Telugu Global
Business

ఆ యూజర్లే లక్ష్యంగా జియో భారత్.. రూ.999కే 4జీ ఫోన్

జూలై 7 నుంచి 10 లక్షల మందితో జియో భారత్ బీటా ట్రయల్స్ ప్రారంభమవుతుందని కంపెనీ చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు.

ఆ యూజర్లే లక్ష్యంగా జియో భారత్.. రూ.999కే 4జీ ఫోన్
X

దేశ టెలికాం రంగంలో జియో ఎప్పుడూ సంచలనమే. రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీగా ఉన్న జియో టెలికాం.. ఇండియాలో ఇంటర్నెట్ యూజర్ల పెరుగుదలకు కారణం అంటే ఎవరైనా ఒప్పుకోవల్సిందే. ప్రస్తుతం ఇండియాలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగి, డేటా రేట్లు తగ్గడానికి ప్రధాన కారణం రిలయన్స్ జియోనే. తాజాగా జియో మరో వర్గం యూజర్లపై కన్నేసింది. ప్రస్తుతం దేశంలో 5జీ అందుబాటులోకి వచ్చింది. అనేక మంది 4జీ, 5జీ సేవలను ఉపయోగించుకుంటున్నారు.

అయితే భారత్ వంటి అతిపెద్ద దేశంలో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు చాలా మంది 2జీ ఫోన్ల దగ్గరే ఆగిపోయారు. 4జీ ఫోన్లు కొనుగోలు చేసే శక్తి లేకపోవడం, దానికి సంబంధించి నెల నెలా డేటా ఖర్చులకు భయపడి ఆ సర్వీసులకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని జియో సరికొత్త సంచలనానికి తెర తీసింది. దేశంలో ఉన్న 25 కోట్ల మంది 2జీ కస్టమర్లను 4జీలోకి మార్చడమే లక్ష్యంగా జియో భారత్ అనే ఫోన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.999కే ఈ 4జీ ఫోన్ అందుబాటులోకి రానున్నది.

జూలై 7 నుంచి 10 లక్షల మందితో జియో భారత్ బీటా ట్రయల్స్ ప్రారంభమవుతుందని కంపెనీ చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. జియో నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రతీ ఒక్కరికీ ఇంటర్నెట్ అందించాలని జియో లక్ష్యంగా పెట్టుకున్నదని అన్నారు. అందులో భాగంగానే జియో భారత్‌ను ప్రవేశపెట్టినట్లు ఆకాశ్ పేర్కొన్నారు.

రూ.999 విలువైన జియో భారత్ ఫోన్‌ను కార్బన్ కంపెనీ తయారు చేస్తోంది. ఈ ఫోన్ రెండు రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇందులో 1.77 అంగులాల క్యూవీజీఏ డిస్‌ప్లేతో పాటు 1000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో జియో సిమ్ లాక్ అయి ఉంటుంది. వినియోగదారులు వేరే నెట్‌వర్క్ సిమ్ యూజ్ చేసే అవకాశం ఉండదు. జియో సినిమా, జియో సావన్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్ ప్రీ ఇన్‌స్టాల్ అయి ఉంటాయి.

యూపీఏ పేమెంట్స్ చేసేందుకు వీలుగా జియో పే యాప్ అందిస్తున్నారు. టార్చ్, ఎఫ్ఎం రేడియో, 3.5 ఎంఎం ఆడియో జాక్, 0.3 ఎంపీ కెమేరా ఉంటుంది. డివైజ్ స్టోరేజీని 128 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

కాగా, ఈ ఫోన్ కొనుగోలు చేసిన వాళ్లు రూ.123 రీచార్జ్ చేస్తే.. రోజుకు 0.5 జీబీ చొప్పున నెలకు 14 జీబీ డేటా, అపరిమిత్ కాల్స్ 28 రోజుల పాటు అందుతాయి. అదే ఏడాదికి రీచార్జ్ చేయాలనుకుంటే రూ.1234తో రీచార్జ్ చేయాలి. రోజుకు 0.5 జీబీ చొప్పున 168 జీబీ ఏడాది పాటు వస్తుంది.

First Published:  3 July 2023 4:10 PM GMT
Next Story