Telugu Global
Business

వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇక 'రైట్ టూ రిపేర్'

మీ మొబైల్ లేదా గ్యాడ్జెట్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే రిపేర్ చేయించడం కష్టమవుతోందా? విడిభాగాలు దొరకట్లేదని వస్తువులను పక్కన పెట్టేస్తున్నారా? ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవు.

వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇక రైట్ టూ రిపేర్
X

మనం ఎంతో ఇష్టపడి ఒక మొబైల్ కొనుక్కుంటాం. కొన్ని రోజులకో.. నెలలకో అది రిపేర్‌కు వస్తుంది. బాగు చేయించాలని ఏదైనా షాప్‌కు లేదా ఆ కంపెనీ సర్వీస్ సెంటర్‌కు వెళ్తాం. తీరా అక్కడకు వెళ్లాక.. పాడైన పార్ట్ ఇప్పుడు దొరకడం లేదు. కొన్ని రోజులు వెయిట్ చేయండి సార్ అంటాడు. మనం సరే అని కొన్ని రోజలు, వారాలు వెయిట్ చేస్తాం. కానీ అప్పటికీ 'సార్ మీరు అడిగిన పార్ట్ దొరకడం లేదు' అని చెప్తాడు. ఆ సర్వీస్ సెంటర్ వాడిని నాలుగు తిట్లు తిట్టి.. ఆ మొబైల్ బదులు మరో మొబైల్ కొనుక్కుంటాం. ఏదో చిన్న పార్ట్ దొరకనందుకు ఆ పాత మొబైల్ మూలన పడేస్తాం.

Advertisement

పైన చెప్పిన ఉదాహరణ లాగే.. నిత్యం ఎన్నో మొబైల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ఇతర వస్తువులు రిపేర్‌కు వచ్చి, సరైన విడి భాగాలు దొరకక మూలన పడుతున్నాయి. దీని వల్ల వినియోగదారుడు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా ప్రతీ ఏడాది 'ఈ-వేస్ట్' భారీగా పెరిగిపోతోంది. ఇది పర్యావరణ కాలుష్యానికి కూడా దారి తీస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం దీన్ని నివారించడానికి ఒక కొత్త చట్టాన్ని తీసుకొని రాబోతోంది. అదే 'రైట్ టూ రిపేర్'. మన దేశంలో రైట్ టూ ఇన్‌ఫర్మేషన్, రైట్ టూ ఎడ్యుకేషన్ అనే చట్టాలు ఉన్నాయి. అంటే సమాచారం తెలుసుకోవడానికి, చదువుకోవడానికి దేశ ప్రజలకు హక్కు ఉన్నది. అది ఎవరూ కాదనలేనిది. అలాగే ఇప్పుడు వినియోగదారుడు తన వస్తువును 'రిపేర్' చేయించుకునే హక్కును కూడా పొందబోతున్నాడు.

Advertisement

డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్జూమర్ అఫైర్స్ (వినియోగదారుల శాఖ) ఇటీవల ఒక అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసింది. 'రైట్ టూ రిపేర్' మీద పూర్తి అధ్యయనం చేసి, ఇందుకు అవసరమైన ఫ్రేమ్ వర్క్ సిద్దం చేయడానికి సదరు కమిటీకి అధికారాలు అప్పగించారు. ఇప్పటికే ఈ చట్టానికి సంబంధించిన డ్రాఫ్ట్ పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఎలాంటి లొసుగులు లేకుండా మరింత బలంగా ఈ చట్టాన్ని తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ చట్టం వల్ల ఏం లాభం?

ఒకసారి ఈ చట్టం అమలులోకి వస్తే మొబైల్ ఫోన్లు, ట్యాబులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, వాషింగ్ మెషిన్లు, డ్రయర్లు, క్లీనింగ్ మెషిన్లు, ఏసీలు, కూలర్లు, ఆటోమొబైల్, ఇతర కన్జూమర్ డ్యూరబుల్ కంపెనీలు అన్నీ తమ ప్రొడక్టు సమాచారాన్ని పూర్తిగా వెల్లడించాలి. యూజర్ మాన్యువల్స్‌లో పొందుపరుచకుండా దాచేసే సమాచారాన్ని కూడా పంచుకోవాలి. అంటే సదరు వస్తువులో ఏయే పార్ట్స్ ఉన్నాయి, అవి ఎక్కడ దొరుకుతాయి, వాటికి ప్రత్యామ్నాయంగా ఏ పార్ట్స్ వాడవచ్చు అనే విషయాలు కూలంకషంగా వివరించాలి. అంతే కాకుండా సదరు వస్తువుకు చెందిన విడి భాగాలను నిత్యం అందుబాటులో ఉంచాలి. ఎప్పుడైనా మొబైల్ లేదా పాత బడిన కార్ రిపేర్‌కు తీసుకెళ్తే తప్పకుండా అందులోని విడిభాగాలు దొరకాలి. సదరు కంపెనీ తప్పకుండా ఆ వస్తువు రిపేర్‌కు అవసరమైన విడిభాగాలు అందజేయాలి. ఇదే రైట్ టూ రిపేర్. అంటే వినియోగదారుడు తన వస్తువును కంపెనీ చేత తప్పకుండా రిపేర్ చేయించుకునే హక్కును పొందుతాడు.

ఒకసారి ఈ చట్టం కనుక అందుబాటులోకి వస్తే.. చాలా ఎలక్ట్రానిక్, మొబైల్, ఆటోమొబైల్ కంపెనీలకు భారంగా మారడం ఖాయం. నెలకో సారి కొత్త మోడల్స్‌ను తీసుకొని వచ్చే మొబైల్ కంపెనీలకు ఇది పెద్ద ఎదురు దెబ్బ అనుకోవచ్చు. ప్రతీ మొబైల్‌కు విడిభాగాలు అందించడం అంటే కష్టంగా మారుతుంది. కానీ అదే సమయంలో ఇది వినియోగదారుడికి చాలా లాభదాయకమైనదని చెప్పవచ్చు. స్క్రీన్ పగిలిందని, బోర్డులో చిన్న చిప్ పోయిందని మొబైల్స్‌ను పక్కన పడేయాల్సిన అవసరం ఉండదు. ప్రతీ ఫోను, కారు, వాషింగ్‌మెషిన్, ఏసీలకు విడిభాగాలు దొరుకుతాయి.

అంతే కాకుండా విడి భాగాలు తయారు చేసే కంపెనీలకు కూడా వ్యాపారం పెరుగుతుంది. అక్కడి ఉద్యోగులు, కార్మికులకు అవకాశాలు లభిస్తాయి. ఇది కేవలం వినియోగదారులకు లాభం, ఈ-వేస్ట్‌ను తగ్గించడమే కాకుండా పరోక్షంగా అనేక కంపెనీలు ఏర్పడటానికి అవకాశం ఏర్పడుతుంది. గతంలో విడిభాగాలను తయారు చేసే అనేక కంపెనీలు.. యూజ్ అండ్ త్రో ఫోన్లు, గ్యాడ్జెట్ల కారణంగా మూతబడ్డాయి. కానీ రైట్ టూ రిపేర్ కారణంగా వాటికి తిరిగి మహర్దశ పట్టే అవకాశం ఉంది.

రైట్ టూ రిపేర్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ప్రతీ ప్రొడక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు, వాటి విడిభాగాల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం తప్పకుండా మాన్యువల్స్ ముద్రించాల్సిందే. ఆథరైజ్డ్ డీలర్లను మరింత మందిని నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాల్లో రైట్ టూ రిపేర్ అమలులో ఉంది. ఆస్ట్రేలియాలో అయితే కొన్ని కంపెనీలు కలిసి 'రిపేర్ కేఫ్స్' ప్రారంభించాయి. వీటిలో ఆయా కంపెనీల వస్తువులకు ఉచితంగా సర్వీస్ చేస్తారు. విడిభాగాలు కూడా దొరుకుతాయి. దీంతో పాత వస్తువులను పారేయకుండానే రిపేర్ చేయించి వాడుకునే అలవాటు బాగా పెరిగిపోయింది. మన దేశంలో కూడా దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని వినియోగదారుల ఫోరమ్స్ కోరుతున్నాయి.

Next Story