Telugu Global
Business

పెరుగుతున్న ఉద్యోగుల కోత! ఏయే రంగాల్లో ఎలా ఉందంటే..

ప్రస్తుతం టెక్‌ కంపెనీల్లో ఉద్యోగుల కోత మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం, పడిపోతున్న మార్కెట్ల వల్ల ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు లే ఆఫ్ ఇస్తున్నాయి.

పెరుగుతున్న ఉద్యోగుల కోత! ఏయే రంగాల్లో ఎలా ఉందంటే..
X

పెరుగుతున్న ఉద్యోగుల కోత! ఏయే రంగాల్లో ఎలా ఉందంటే..

ప్రస్తుతం టెక్‌ కంపెనీల్లో ఉద్యోగుల కోత మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం, పడిపోతున్న మార్కెట్ల వల్ల ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు లే ఆఫ్ ఇస్తున్నాయి. ట్విట్టర్‌, మెటా, అమెజాన్‌ వంటి సంస్థలతో పాటు చిన్నచిన్న ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే కేవలం ఐటీ మాత్రమే కాదు, మాంద్యం ఎఫెక్ట్ ఇతర రంగాలపై కూడా భారీగా పడింది. ఐటీ బాటలోనే పలు ఇతర రంగాలు కూడా నడుస్తున్నాయి.

2025 నాటికి 4-6 వేల మంది తొలగిస్తామని తాజాగా హెచ్‌పీ సంస్థ ప్రకటించింది. ట్విట్టర్ ఇప్పటికే దాదాపు 5,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఫేస్‌బుక్‌ పేరెంట్ కంపెనీ మెటా 11 వేలమంది ఉద్యోగులను తొలగించింది. ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రపంచవ్యాప్తంగా 10 వేల మందిని తొలగించింది. అయితే ఉద్యోగుల కోతకు ఒక్కోకంపెనీ ఒక్కో కారణాన్ని చెప్తోంది. ఆర్థిక మాంద్యం, మార్కెట్‌ ఒడిదొడుకులే కారణాలని కొన్ని కంపెనీలు చెప్తుంటే.. మూన్‌లైటింగ్ అని కొన్ని సంస్థలు, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ బ్యాచ్ ఏరివేత అని మరికొన్ని.. కాస్ట్ కటింగ్ అని ఇంకొన్ని సంస్థలు చెప్తున్నాయి.

ఉద్యోగుల కోత ఐటీతో ఆగలేదు మీడియా రంగంపై కూడా మాంద్యం ఎఫెక్ట్ పడింది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలకు ప్రకటనలు తగ్గడంతో ఖర్చుని తగ్గించుకునేందుకు ఉద్యొగులను తొలగిస్తున్నారు. అమెరికాకు చెందిన వార్నర్ బ్రోస్ డిస్కవరీ, సీఎన్‌ఎన్, పారామౌంట్ గ్లోబల్, వైస్ మీడియా, ఎన్‌బీసీ, వాల్ట్ డిస్నీ లాంటి మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలు కూడా త్వరలో భారీ సంఖ్యలో లే-ఆఫ్స్ ప్రకటించబోతున్నాయి.

కారణాలివే..

కరోనా ఎఫెక్ట్‌తో రిమోట్ వర్కింగ్ పేరుతో సంస్థలు అదనంగా కొత్తవారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. కరోనా ఆంక్షల ఎత్తివేశాక ఇంటర్నెట్‌ వాడకం తగ్గిపోయింది. ఉద్యోగుల అవసరం తగ్గింది. ఆదాయం పడిపోయింది. దీంతో ఖర్చు ఎక్కడ తగ్గించుకోవాలో తెలియక ఉద్యోగుల కోత మొదలుపెట్టాయి.

యుద్ధం కారణంగా ఆర్థిక మాంద్యం పెరుగుతోంది. మార్కెట్లు పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో వ్యాపారాన్ని బతికించుకునేందుకు కంపెనీలు నానా తంటాలు పడాల్సి వస్తోంది.

కంపెనీలకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అవసరానికి పెట్టుబడుల లేక, రుణాలు దొరకక ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది.

వీటితో పాటు ద్రవ్యోల్బణం భారీగా పెరగడం కూడా ప్రపంచ దేశాల ఎకానమీపై ప్రభావం చూపింది. ఇది జాబ్‌ మార్కెట్‌లో సంక్షోభానికి దారితీసింది.

First Published:  24 Nov 2022 11:57 AM GMT
Next Story