Telugu Global
Business

సరుకులు కొనేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి!

ఇంటికి కావాల్సిన సరుకులను నెలకోసారి లిస్ట్ రాసుకుని తెచ్చుకునే రోజులు పోయాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్‌కు వెళ్లి ఏది గుర్తొస్తే అది బాస్కెట్‌లో వేసుకోవడం లేదా అక్కడ ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తే దాన్ని కొనేయడం అలవాటైపోయింది.

సరుకులు కొనేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి!
X

ఇంటికి కావాల్సిన సరుకులను నెలకోసారి లిస్ట్ రాసుకుని తెచ్చుకునే రోజులు పోయాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్‌కు వెళ్లి ఏది గుర్తొస్తే అది బాస్కెట్‌లో వేసుకోవడం లేదా అక్కడ ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తే దాన్ని కొనేయడం అలవాటైపోయింది. అయితే ఈ అలవాటు వల్ల తెలియకుండానే ఎక్కువ ఖర్చవ్వడంతో పాటు అవసరం లేని ప్యాక్డ్ ఫుడ్ కూడా ఇంట్లోకి వచ్చి చేరుతుంది. అందుకే సూపర్ మార్కెట్లలో షాపింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

సూపర్ మార్కెట్ లేదా డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌కి వెళ్లినప్పుడు అక్కడ కనిపించే డిస్కౌంట్లు, ఆఫర్లు, కొత్త కొత్త బ్రాండ్లు, ప్యాక్డ్ ఫుడ్స్‌కు అట్రాక్ట్ అయ్యి అవసరం లేని సరుకులన్నింటికీ ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు చాలామంది. ఉదాహరణకు నెలకు ఒక లీటర్ నూనె సరిపోతుందని తెలిసినా ‘బయ్ వన్ గెట్ వన్’ పేరుతో రెండు లీటర్ల నూనెను కొనిపిస్తుంటాయి మార్కెట్లు. ఈ క్రమంలో పరిచయం లేని కొత్త బ్రాండ్‌లను కూడా అలవాటు చేస్తాయి. అందుకే సరుకులు కొనేముందు కాస్త ప్రాక్టికల్‌గా ఆలోచించడం అవసరం.

సూపర్ మార్కెట్ల మాయలో పడకూడదంటే ముందుగా కావాల్సిన సరుకులను లిస్ట్ రాసుకుని బయలుదేరాలి. లిస్ట్‌లో క్వాంటిటీ కూడా రాసుకోవాలి. లిస్ట్‌లో లేని సరుకులను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు. వంట నూనె వంటి వాటిని నెలకోసారి కొనడమే మంచిది. వాటిని ఎక్కువగా కొని నిల్వ చేయడం వల్ల పాడయ్యే అవకాశం ఉంది.

వారం, పది రోజులకు సరిపడా కూరగాయలు కొనే బదులు మూడు నాలుగు రోజులకోసారి వెళ్లి కొనుక్కోవడం మంచిది. అయితే కూరగాయలను సూపర్ మార్కె్ట్లో కంటే బయట ఉండే రైతు మార్కెట్లో కొనడం ఉత్తమం. సూపర్ మార్కెట్స్‌లో నేచురల్ బ్రీడ్స్‌కు బదులు హైబ్రిడ్ కూరగాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి. పైగా వాటిని బల్క్‌లో తెచ్చి ఎక్కువ రోజులపాటు నిల్వ చేస్తుంటారు.

ఉప్పు, పసుపు, మసాలాల వంటివి కొనేటప్పుడు ప్యాక్డ్ కంటే లూజ్ కొనడం మంచిది. ప్యాక్డ్ ఫుడ్స్‌ కొనేటప్పుడు వాటిపై ఉండే ఎక్స్‌పైరీ డేట్ చూసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీటిని కూడా బల్క్‌లో కాకుండా కొద్దిమొత్తాల్లో నెలకోసారి కొంటే పాడవ్వకుండా ఉంటాయి.

ఇక గోధుమ పిండి, శెనగ పిండి వంటి పిండి పదార్థాలు కొనుగోలు చేసేటప్పుడు లూజ్ అయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని కొనాలి. తేమ చేరితే ఇవి త్వరగా పాడైపోతాయి. కాబట్టి వీటి విషయంలో ప్యాక్ చేసినవే ఎంచుకుంటే మంచిది.

First Published:  4 April 2024 2:07 AM GMT
Next Story