Telugu Global
Business

Health Insurance | ఆరోగ్య బీమాకు నో ఏజ్ లిమిట్‌.. ప‌లు నిబంధ‌న‌ల్లో స‌వ‌ర‌ణ‌లు చేసిన ఐఆర్డీఏఐ..!

Health Insurance | మీకు 65 ఏండ్లు దాటిన త‌ల్లిదండ్రులు ఉన్నారా..? వారికి గుండెపోటు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు వ‌చ్చినా.. మ‌ధుమేహ వ్యాధితో బాధ‌ప‌డుతున్న వారికి అత్య‌వ‌స‌ర వైద్య చికిత్స చేయించాల్సి వ‌స్తే ఏం చేయాల‌ని ఆలోచిస్తున్నారా..? గ‌తంలో మాదిరిగా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు.

Health Insurance | ఆరోగ్య బీమాకు నో ఏజ్ లిమిట్‌.. ప‌లు నిబంధ‌న‌ల్లో స‌వ‌ర‌ణ‌లు చేసిన ఐఆర్డీఏఐ..!
X

Health Insurance | మీకు 65 ఏండ్లు దాటిన త‌ల్లిదండ్రులు ఉన్నారా..? వారికి గుండెపోటు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు వ‌చ్చినా.. మ‌ధుమేహ వ్యాధితో బాధ‌ప‌డుతున్న వారికి అత్య‌వ‌స‌ర వైద్య చికిత్స చేయించాల్సి వ‌స్తే ఏం చేయాల‌ని ఆలోచిస్తున్నారా..? గ‌తంలో మాదిరిగా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్పుడు పౌరులంద‌రికి హెల్త్‌కేర్ కల్పిస్తూ భార‌త బీమా నియంత్ర‌ణ‌, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కూ గ‌రిష్టంగా 65 ఏండ్ల వ‌య‌స్సు వ‌ర‌కూ మాత్ర‌మే హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ పాల‌సీలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ, ఇప్పుడు వ‌య‌స్సు నిమిత్తం లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకునేందుకు అనుమ‌తి ఇస్తూ తీసుకున్న నిర్ణ‌యం ఈ నెల ఒక‌టో తేదీ నుంచి అమ‌ల్లోకి తెస్తున్న‌ట్లు ఐఆర్డీఏఐ నోటిఫికేష‌న్ జారీ చేసింది.

ఇక ప‌సికందు నుంచి వ‌యోవృద్ధుల వ‌ర‌కూ ప్ర‌తి ఒక్క‌రికీ బీమా సంస్థ‌లు ఆరోగ్య బీమా పాల‌సీలు జారీ చేస్తాయి. వృద్ధులు మొద‌లు గృహిణులు, విద్యార్థులు, పిల్ల‌లు స‌హా అన్ని వ‌య‌స్సుల వారికి అనుగుణంగా ఇన్సూరెన్స్ సంస్థ‌లు బీమా ఉత్ప‌త్తులు రూపొందించ‌వ‌చ్చున‌ని ఐఆర్డీఏఐ జారీ చేసిన నోటిఫికేష‌న్‌లో పేర్కొంది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల మ‌రింత మందికి ఆరోగ్య సంర‌క్ష‌ణ క‌ల్పించ‌డంతోపాటు బీమా సంస్థ‌లు త‌మ బీమా ఉత్ప‌త్తుల‌ను విభజించుకునేందుకు వెసులుబాటు ల‌భిస్తుంది. అలాగే వృద్ధులు, వ‌యో వృద్ధుల వంటి నిర్దిష్ట వ‌య‌స్సు గ‌ల వారికి ప్ర‌త్యేక హెల్త్ ఇన్సూరెన్స్ పాల‌సీలు తేవ‌డంతోపాటు బీమా పాల‌సీదారుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక విభాగం ఏర్పాటు చేయాల‌ని బీమా సంస్థ‌ల‌ను ఐఆర్డీఏఐ ఆదేశించింది.

మ‌రోవైపు, ఆరోగ్య బీమా పాల‌సీలు తీసుకున్న పాల‌సీదారుల క్ల‌యిమ్ నిబంధ‌న‌ల‌ను కూడా ఐఆర్డీఏఐ స‌వ‌రించింది. ముంద‌స్తు వ్యాధులు వెయిటింగ్ పీరియ‌డ్‌, మార‌టోరియం గ‌డువు త‌గ్గించేసింది. దీనివ‌ల్ల ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకునే వారికి మ‌రింత ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. సాధార‌ణంగా ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకునే వారి ఆరోగ్య ప‌రిస్థితి గురించి బీమా సంస్థ‌ల ఏజెంట్లు వాక‌బు చేస్తారు. ప్ర‌తి ఆరోగ్య బీమా పాల‌సీ క‌వ‌రేజీ ప్రారంభానికి కొంత వెయిటింగ్ పీరియ‌డ్ ఉంటుంది. ఈ గ‌డువు లోపు బీమా పాల‌సీదారు అనారోగ్యానికి గురైనా ఇన్సూరెన్స్ క‌వ‌రేజీ ఉండ‌దు. దీన్నే పీఈడీ వెయిటింగ్ పీరియ‌డ్ అంటారు. ఈ వెయిటింగ్ పీరియ‌డ్‌ను నాలుగేండ్ల నుంచి మూడేండ్ల‌కు కుదించింది. విదేశీ ప్ర‌యాణ ఇన్సూరెన్స్ పాల‌సీకి ఈ నిబంధ‌న వ‌ర్తించ‌దు.

హెల్త్ ఇన్సూరెన్స్ పాల‌సీపై మార‌టోరియం గ‌డువు ఎనిమిదేండ్ల నుంచి ఐదేండ్ల‌కు త‌గ్గించేసింది. హెల్త్ ఇన్సూరెన్స్ పాల‌సీ కొనుగోలు చేసిన వారు వ‌రుస‌గా ఐదేండ్లు ప్రీమియం చెల్లిస్తే, స‌ద‌రు బీమా పాల‌సీ ప్ర‌కారం అన్ని ర‌కాల క్ల‌యిమ్‌ల‌ను బీమా సంస్థ చెల్లించాల్సిందే. ఇదిలా ఉంటే, హెల్త్ పాల‌సీ ప్రారంభ‌మ‌య్యాక నాలుగేండ్ల వ‌ర‌కూ కొన్ని వ్యాధుల‌కు చికిత్స‌పై క‌వ‌రేజీ ల‌భించ‌దు. దీన్నే నిర్దిష్ట వెయిటింగ్ పీరియ‌డ్ అంటారు. ప్ర‌మాదాల‌కు మాత్రం మిన‌హాయింపు ఉంట‌ది. ఈ నిర్దిష్ట గ‌డువును మూడేండ్ల‌కు త‌గ్గించింది ఐఆర్డీఏఐ. గ‌డువు ముగిసిన త‌ర్వాత అన్ని ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు చికిత్స క‌వ‌రేజీ ల‌భిస్తుంది. పాత‌, కొత్త బీమా పాల‌సీల‌కు స‌వ‌ర‌ణ‌లు వ‌ర్తిస్తాయ‌ని బీమా రంగ నిపుణులు చెప్పారు.

First Published:  22 April 2024 7:38 AM GMT
Next Story