Telugu Global
Business

Gold Returns | బంగారంపై పెట్టుబ‌డుల‌తో గ‌తేడాది 19 శాతం రిట‌ర్న్స్‌.. ఈ ఏడాది లాభాలేలా ఉంటాయో తెలుసా..?!

Gold Returns | గ‌త ఐదేండ్ల‌లో బంగారం ధ‌ర రెట్టింపైంది. 2018 ఆగ‌స్టు 10న తులం బంగారం ధ‌ర రూ.29,486 ప‌లికింది. 2023 ఆగ‌స్టు 10 నాటికి రూ.58,947 ల‌కు చేరుకున్న‌ది.

Gold Returns | బంగారంపై పెట్టుబ‌డుల‌తో గ‌తేడాది 19 శాతం రిట‌ర్న్స్‌.. ఈ ఏడాది లాభాలేలా ఉంటాయో తెలుసా..?!
X

Gold Returns | బంగారం అంటే భార‌తీయుల‌కు.. మ‌హిళ‌ల‌కు ఎంతో మ‌క్కువ‌. పండుగ‌లు, కుటుంబ వేడుక‌లు, ప్ర‌త్యేకించి పెండ్లిండ్ల‌కు పిస‌రంత బంగారం కొన‌డానికి మొగ్గు చూపుతుంటారు. ప్ర‌తి వేడుక‌లోనూ త‌మకు ఉన్న ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డానికి ఇష్ట ప‌డ‌తారు. కానీ, భార‌తీయుల అవ‌స‌రాల‌కు స‌రిప‌డా దేశీయంగా బంగారం నిల్వ‌లు లేవు. దాదాపు 99 శాతం బంగారం దిగుమ‌తి చేసుకోవాల్సిందే. విదేశాల నుంచి దిగుమ‌తుల‌ను నిరుత్సాహ ప‌రిచేందుకు కేంద్రం.. బంగారంపై దిగుమ‌తి సుంకం భారీగా పెంచేసింది. అంత‌ర్జాతీయ ప‌రిణామాలు.. ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధం, మ‌ధ్యప్రాచ్యంలో ఉద్రిక్త‌త‌లు, డాల‌ర్ విలువ బ‌లోపేతం, మార్కెట్ల‌లో ఒడిదొడుకులు త‌లెత్తిన‌ప్పుడు.. ద్ర‌వ్యోల్బ‌ణం భారీ నుంచి త‌ప్పించుకునేందుకు ఇన్వెస్ట‌ర్లు ఆల్ట‌ర్నేటివ్ పెట్టుబ‌డి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటారు. ఇలా ఆల్ట‌ర్నేటివ్ పెట్టుబ‌డి మార్గంగా బంగారం గ‌త ఏడాది 19 శాతం రిట‌ర్న్స్ అందించింది. 2023లో ఇప్ప‌టివ‌ర‌కూ తొమ్మిది శాతం లాభాలు వ‌చ్చాయి. ప‌రిస్థితులు ఇలాగే కొన‌సాగితే.. ఈ ఏడాది కూడా బంగారంపై 20 శాతం రిట‌ర్న్స్ వ‌స్తాయ‌ని ఆర్థిక‌వేత్త‌లు చెబుతున్నారు.

మ‌ధ్య‌ప్రాచ్యంలో ఉద్రిక్త‌తల నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర మూడు నెల‌ల గ‌రిష్ట స్థాయి 1,978 డాల‌ర్లు ప‌లికింది. జూలై 20 త‌ర్వాత అంత‌ర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధ‌ర గ‌రిష్ట స్థాయిని తాక‌డం ఇదే తొలిసారి.

ప్ర‌స్తుతానికి అమెరికాలో కీల‌క వ‌డ్డీరేట్లు గ‌రిష్ట స్థాయికి చేరుకున్నా.. వ‌చ్చే ఏడాది ద్వితీయార్థంలో అమెరికా ఫెడ్ రిజ‌ర్వ్ కీల‌క వ‌డ్డీరేట్ల త‌గ్గింపు ప్ర‌క్రియ ప్రారంభిస్తుంద‌ని ఆర్థిక‌వేత్త‌లు చెబుతున్నారు. అదే జ‌రిగితే బంగారం ధ‌ర పెరుగుద‌ల‌కు ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయ‌ని బులియ‌న్ మార్కెట్ వ‌ర్గాలు అంటున్నాయి.

ఐదేండ్ల‌లో 100 శాతం రిట‌ర్న్స్

గ‌త ఐదేండ్ల‌లో బంగారం ధ‌ర రెట్టింపైంది. 2018 ఆగ‌స్టు 10న తులం బంగారం ధ‌ర రూ.29,486 ప‌లికింది. 2023 ఆగ‌స్టు 10 నాటికి రూ.58,947 ల‌కు చేరుకున్న‌ది. ప్ర‌పంచంలోని కేంద్రీయ బ్యాంకులు వ‌చ్చే ఏడాది డాల‌ర్ ఆధారిత ఎకాన‌మీ (de-dollarization) నుంచి తప్పించుకునేందుకు 24 శాతం బంగారం నిల్వ‌లు పెంచనున్నాయి. రిజ‌ర్వ్ క‌రెన్సీగా డాల‌ర్‌పై ఆధార‌ప‌డ‌టం త‌గ్గించ‌డ‌మే డీ-డాల‌రైజేష‌న్ (de-dollarization) అని అంటారు.

అక్టోబ‌ర్‌లో రూ.2900ల‌కు పైగా పెరిగిన ప‌సిడి

ఈ నెల‌లో బంగారం ధ‌ర మ‌రింత ప్రియ‌మైంది. మ‌ధ్య‌ప్రాచ్యంలో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఈ నెల‌లో తులం బంగారం ధ‌ర రూ. 2,974 పెరిగింది. ఈ నెల ఒక‌టో తేదీన తులం బంగారం (24 క్యార‌ట్స్‌) రూ. 57,719 ప‌లికితే, ఇప్పుడు రూ.60,693ల‌కు ల‌భిస్తోంది. మ‌రోవైపు కిలో వెండి ధ‌ర రూ.71,991 నుంచి రూ.71,603కు దిగి వ‌చ్చింది.

బంగారం ధ‌ర పెరుగుద‌ల‌కు కార‌ణాలివీ

అమెరికాలో రుణాల‌పై సీలింగ్ విధించ‌డంతో మే నెల ప్రారంభంలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ), క్రెడిట్ సూయిజ్ వంటి గ్లోబ‌ల్ బ్యాంకింగ్ దిగ్గ‌జ సంస్థ‌లు సంక్షోభంలో చిక్కుకోవ‌డం..

దీపావ‌ళి వ‌ర‌కూ దేశీయ మార్కెట్లో బంగారానికి బాగా గిరాకీ ఉండ‌టం. పండుగ‌లతోపాటు పెండ్లిండ్ల‌కు బంగారం కొంటూ ఉండ‌టం..

ఉక్రెయిన్-ర‌ష్యా మ‌ధ్య మిలిట‌రీ సంక్షోభానికి తోడు ఇజ్రాయెల్‌, హ‌మ‌స్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనిశ్చితి పెరిగిపోవ‌డం

చైనా సెంట్ర‌ల్ బ్యాంక్ స‌హా అతిపెద్ద కేంద్రీయ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయ‌డం.

First Published:  24 Oct 2023 7:59 AM GMT
Next Story