Telugu Global
Business

ఎలాన్ మస్క్ కొత్త వ్యాపారం.. ఇకపై పెర్‌ఫ్యూమ్ అమ్మకం

ఒక్కో Burnt Hair బాటిల్ ధర 100 డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 8,200.

ఎలాన్ మస్క్ కొత్త వ్యాపారం.. ఇకపై పెర్‌ఫ్యూమ్ అమ్మకం
X

ప్రపంచంలోని బిలియనీర్లలో ఒకరైన ఎలాన్ మస్క్ ఎప్పుడు ఏ వ్యాపారం చేస్తారో ఎవరికీ అర్థం కాదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో చాలా యాక్టీవ్‌గా ఉండే మస్క్.. తరచూ వివాదాస్పదమైన ట్వీట్లు కూడా చేస్తుంటారు. కానీ తన ట్వీట్లకు ఏనాడూ క్షమాపణలు కూడా చెప్పరు. బుధవారం ఎలాన్ మస్క్ ట్విట్టర్ అకౌంట్ చూసిన వాళ్లు అతడి బయోలో మార్పు చూసి ఖంగుతిన్నారు. ఎందుకంటే.. అక్కడ 'పెర్‌ఫ్యూమ్ సేల్స్‌మాన్' అని రాసుకున్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఏంటి? సెంటు అమ్మే వ్యక్తిగా బయో రాసుకోవడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరైనా అతడి అకౌంట్ హ్యాక్ చేశారేమో అని అనుమానపడ్డారు. కానీ అసలు విషయం తెలిసి ముక్కున వేలేసుకున్నారు.

ఎలాన్ మస్క్ తన సొంత బ్రాండ్ 'Burnt Hair' పెర్‌ఫ్యూమ్క‌ను విడుదల చేశారు. ఇకపై తాను పెర్‌ఫ్యూమ్ వ్యాపారం కూడా చేయబోతున్నట్లు ఒక ట్విట్టర్ థ్రెడ్‌లో పేర్కొన్నారు. ఇకపై ఈ సెంట్లకు సేల్స్‌మాన్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక ప్రయాణ సాంకేతికత, దాని పరిష్కారాల కోసం మస్క్ ఇటీవల 'బోరింగ్ కంపెనీ' అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ నుంచే ఈ కొత్త పెర్‌ఫ్యూమ్ Burnt Hair విడుదల చేశారు. తను ఈ రంగం అంటే చాలా ఇష్టమని.. అందుకే తప్పని సరిగా ఈ వ్యాపారంలోకి వచ్చానని మస్క్ పేర్కొన్నారు.

కాగా ఒక్కో Burnt Hair బాటిల్ ధర 100 డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 8,200. ఈ Burnt Hair ప్రొడక్ట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చని, కేవలం కరెన్సీనే కాకుండా డోజీకాయిన్స్ ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చని మస్క్ పేర్కొన్నారు. ఇది యూనీ సెక్స్ (ఆడ, మగ) ప్రొడక్ట్ అని తెలిపారు. ఇప్పటికే 10వేల బాటిల్స్ అమ్మడు పోయాయని కూడా మస్క్ వెల్లడించారు.


First Published:  12 Oct 2022 2:19 PM GMT
Next Story