Telugu Global
Business

టీవీ, ఫ్రిజ్‌లు కొనొద్దు.. ప్రజలకు అమెజాన్ బాస్ సూచన

కొనుగోళ్లు తగ్గించి, ఆ నగదును నిల్వ చేసుకోవడమే సరైన నిర్ణయం అని అన్నారు. రేపటి రోజున ఏమైనా జరగొచ్చని, కష్టకాలానికి సిద్ధంగా ఉందామని బెజోస్ సూచించారు.

టీవీ, ఫ్రిజ్‌లు కొనొద్దు.. ప్రజలకు అమెజాన్ బాస్ సూచన
X

ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటైన అమెజాన్‌కు ఆయన అధిపతి. తన వెబ్‌సైట్, యాప్ ద్వారా నిత్యం ఎన్నో రకాల వస్తువులను అమ్ముతుంటారు. పండుగల సమయంలో డిస్కౌంట్లు పెట్టి మరీ జనాల చేత రకరకాల వస్తువులను కొనిపిస్తుంటారు. బట్టలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్స్, గృహోపకరణాలు.. వాట్ నాట్.. అన్నీ అమెజాన్‌లో దొరుకుతుంటాయి. అయితే ఇప్పుడు ఆ సంస్థ అధినేత జెఫ్ బెజోస్.. టీవీ, ఫ్రిజ్‌లు కొనొద్దు అని వినియోగదారులకు సూచిస్తున్నారు. దీని వల్ల తన వ్యాపారం పడిపోచ్చు. కానీ ప్రజల మంచి కోరి చెబుతున్నానని బెజోస్ అంటున్నారు.

అమెరికాలో త్వరలో హాలీడే సీజన్ ప్రారంభం కానున్నది. క్రిస్మస్ సమయంలో చాలా మంది అవసరం ఉన్నా లేక పోయినా కొత్త వస్తువులు కొంటుంటారు. అయితే ఈ హాలీడే సీజన్‌లో అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలని, ఆ డబ్బును దాచుకోవాలని బెజోస్ సూచిస్తున్నారు. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్నందున ఈ చిట్కాలు చెప్తున్నానని ఆయన అన్నారు. ఒక పెద్ద టీవీ, ఫ్రిజ్, కారు కొనాలని భావిస్తుంటే.. ఆ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని అన్నారు. ఆ డబ్బును మీ వద్దే జాగ్రత్తగా దాచుకోవాలని కూడా సూచిస్తున్నారు.

ఇప్పుడు కొనుగోళ్లు తగ్గించి, ఆ నగదును నిల్వ చేసుకోవడమే సరైన నిర్ణయం అని అన్నారు. రేపటి రోజున ఏమైనా జరగొచ్చని, కష్టకాలానికి సిద్ధంగా ఉందామని బెజోస్ సూచించారు. ఆర్థిక మాంద్యం మానవాళిని నాశనం చేయకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతా మంచే జరగాలని అందరం కోరుకుందామని అన్నారు.

కాగా, ఆర్థిక మాంద్యం భయంతోనే మెటా, ట్విట్టర్ వంటి సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమెజాన్ కూడా తమ ఉద్యోగుల్లో చాలా మందిని ఇంటికి పంపే అవకాశాలు ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రపంచ బిలియనీర్లలో ఒకరైన జెఫ్ బెజోస్ ఆర్థిక మాంద్యం తప్పదని అంచనా వేస్తున్నారు. ఒకవైపు మాంద్యం భయాలు ఉన్నా.. తన సంపదలో అధిక మొత్తాన్ని పర్యావరణ పరిరక్షణకు ఇవ్వనున్నట్లు బెజోస్ వెల్లడించారు.

Next Story