Telugu Global
Business

ప్రస్తుతానికి ఈ నగరాల్లో 5జీ సర్వీసులు ఫ్రీ

జియో ట్రూ 5జీ సర్వీసులు ఢిల్లీ, ముంబై, కోల్‌కత, వారణాసిలోని పరిమిత కస్టమర్లకు.. భారతి ఎయిర్‌టెల్ ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, నాగ్‌పూర్, సిలిగురిలోని కొన్ని ప్రాంతాల్లో అందరికీ 5జీ సర్వీసులు అందుబాటులోకి తెచ్చాయి.

ప్రస్తుతానికి ఈ నగరాల్లో 5జీ సర్వీసులు ఫ్రీ
X

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో రిలయర్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ సంస్థలు 5జీ సర్వీసులను ప్రారంభించాయి. జియో ట్రూ 5జీ సర్వీసులు ఢిల్లీ, ముంబై, కోల్‌కత, వారణాసిలోని పరిమిత కస్టమర్లకు.. భారతి ఎయిర్‌టెల్ ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, నాగ్‌పూర్, సిలిగురిలోని కొన్ని ప్రాంతాల్లో అందరికీ 5జీ సర్వీసులు అందుబాటులోకి తెచ్చాయి. 5జీ హ్యాండ్ సెట్లు లేదా 5జీ ఎనేబుల్డ్ హ్యాండ్ సెట్లు ఉన్న కస్టమర్లు చిన్న సెట్టింగ్ మార్చుకోవడం ద్వారా ఈ సర్వీసులు పొందవచ్చు. 5జీ హ్యాండ్ సెట్లలో ప్రస్తుతం దాదాపు 600 మెగాబిట్ పర్ సెకెండ్ (ఎంబీపీఎస్) వేగంతో సేవలు అందుతున్నాయి. ఈ మొబైల్ సెట్ల ద్వారా ప్రొఫెషనల్ కంప్యూటర్లు కూడా వాడుకునే వీలుంది. జియ్, ఎయిర్‌టెల్ కస్టమర్లు తమ 4జీ సిమ్‌ను మార్చుకోకుండానే 5జీ సర్వీసులు వాడుకోవచ్చు.

జియో కస్టమర్లు 5జీ సర్వీసులను 'బీటా ట్రయల్' ద్వారా వాడుకోవచ్చు. సదరు సిటీలో పూర్తి స్థాయి నెట్‌వర్క్ వచ్చే వరకు ఈ బీటా ట్రయల్ అందుబాటులో ఉంటుంది. 4జీ ధరకే 5జీ సర్వీసులు పూర్తి ఉచితంగా వాడుకునే వెసులుబాటు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ 1 జీబీపీఎస్ స్పీడ్ వస్తుందని గతంలో హామీ ఇచ్చింది. అయితే మొబైల్ స్టేషన్స్‌కు దగ్గరగా ఉండేవారికి మాత్రమే ఇంత వేగం వస్తుందని.. మొత్తానికి సగటున 600 ఎంబీపీఎస్ వేగం మాత్రం కచ్చితంగా అందుబాటులో ఉంటుందని తెలిపింది.

మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలకు 5జీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్న ఎరిక్‌సన్ సంస్థ మాత్రం కస్టమర్లు పూర్తి స్థాయిలో పెరిగిన తర్వాత 200 నుంచి 300 ఎంబీపీఎస్ స్పీడ్ అందుబాటులో ఉంటుందని చెబుతోంది. 6 జీబీ ఉండే హెచ్‌డీ సినిమా 1.25 నిమిషాల్లో, 4కే మూవీ అయితే 3 నిమిషాల్లో డౌన్‌లోడ్ అవుతుందని ఎరిక్‌సన్ సౌత్ఈస్ట్ ఏసియా హెడ్ థాయ్‌సెంగ్ చెప్పారు. కస్టమర్లు తమ హెడ్‌సెట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి 5జీ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుందని అన్నారు. ఎక్కడైనా 5జీ సర్వీస్ అందుబాటులో ఉంటే 4జీ కాస్తా 5జీ మారిపోతుందని ఆయన చెప్పారు.

జియో, ఎయిర్‌టెల్ ప్రస్తుతం 5జీ సర్వీసులను ఫ్రీగానే అందిస్తున్నాయి. అయితే ఒక సర్కిల్‌లో పూర్తి స్థాయిలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తే తప్పకుండా 5జీకి కూడా సెపరేట్ ధరలు అమల్లోకి వస్తాయని బీఎస్ఎన్ఎల్ మాజీ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ అన్నారు. రాబోయే ఒకటిన్నర ఏడాదిలో మొబైల్ కస్టమర్ల డేటా వినియోగం ఇప్పటి కంటే రెండింతలు అవుతుందని నోకియా ఇండియా హెడ్ సంజయ్ మాలిక్ అంచనా వేస్తున్నారు. చాలా దేశాల్లో 5జీ సర్వీసులకు ప్రత్యేక టారిఫ్‌లు వసూలు చేయడం లేదని, అయితే ఇండియాలో ఇప్పుడు ఫ్రీగానే 5జీ సర్వీసు ఇచ్చినా.. రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా చార్జీలు వసూలు చేస్తారని ఆయన చెబుతున్నారు.

5జీ సర్వీసులు ప్రారంభం కావడంతో 5జీ హ్యాండ్ సెట్లకు కూడా డిమాండ్ పెరుగుతోందని క్వాల్‌కామ్ ప్రెసిడెంట్ అమన్ తెలిపారు. 5జీ సర్వీసులు రాబోయే రోజుల్లో బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌కు కూడా సవాలు విసరబోతున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు చాలా మంది అత్యధిక వేగం కోసం బ్రాడ్‌బ్యాండ్‌ను ఉపయోగిస్తున్నారు. 5జీ సర్వీసులు అంతటా అందుబాటులోకి వస్తే బ్రాడ్‌బ్యాండ్ డిమాండ్ పడిపోతుందని ఆయన అంటున్నారు. ప్రొఫెషనల్ కంప్యూటర్లు, సర్వర్లను కూడా 5జీ ద్వారా ఉపయోగించే వీలుంటుందని ఆయన చెప్పారు. 2023 డిసెంబర్ నాటికి జియో తమ 5జీ నెట్‌వర్క్‌ను దేశమంతటా విస్తరించనున్నది. ఇక ఎయిర్‌టెల్ 2024 మార్చినాటికి 5జీ నెట్‌వర్క్ పూర్తి చేస్తామని చెప్పింది. 2027 కల్లా దేశంలో సగం మంది 5జీ వినియోగదారులు ఉంటారని మొబైల్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి.

Next Story