Telugu Global
Business

క్రెడిట్ కార్డులు తెగ వాడేస్తున్నారు!

ఒక్క మే నెలలో క్రెడిట్ కార్టులతో చేసిన ఖర్చు రికార్డు స్థాయిలో రూ. 1.4 లక్షల కోట్లకు చేరుకుంది.

క్రెడిట్ కార్డులు తెగ వాడేస్తున్నరు!
X

క్రెడిట్ కార్డులు తెగ వాడేస్తున్నరు!

దేశంలో క్రెడిట్‌ కార్డుల వినియోగం పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఒక్క మే నెలలో క్రెడిట్ కార్టులతో చేసిన ఖర్చు రికార్డు స్థాయిలో రూ. 1.4 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 8.74 కోట్ల మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారని ఆర్​బీఐ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకూ కొత్త క్రెడిట్ కార్డుల సంఖ్య 5 మిలియన్లకు పైగా పెరిగింది. ఇన్ని కార్డులు, ఇంత మొత్తం లావాదేవీలు జరగడం ఇదే మొదటిసారని ఆర్​బీఐ డేటా చెప్తోంది.

క్రెడిట్ కార్డుల వినియోగం ప్రతీనెలా 5 శాతం మేర పెరుగుతుందని గణాంకాలు చెప్తున్నాయి. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో యాక్టివ్‌ క్రెడిట్‌ కార్డుల సంఖ్య 8.24 కోట్లుగా, ఫిబ్రవరిలో 8.33 కోట్లు, మార్చి చివరికి 8.53 కోట్లు, ఏప్రిల్‌ చివరికి 8.65 కోట్లు చొప్పున పెరుగుతూ వచ్చింది. మే నెల చివరికి మొత్తం యాక్టివ్ క్రెడిట్ కార్డుల సంఖ్య 8.74 కోట్లకు చేరింది. ఒక్కో కార్డుపై యూజర్ చేస్తున్న సగటు వ్యయం రూ.16,144గా ఉంది.

ఇక బ్యాంకుల వారీగా చూస్తే.. క్రెడిట్ కార్డుల వినియోగంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ముందువరుసలో ఉంది. మే చివరి నాటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ యాక్టివ్ క్రెడిట్ కార్డుల సంఖ్య‌ 1.81 కోట్లకు చేరింది. క్రెడిట్‌ కార్డు లోన్స్ పరంగానూ 28.5 శాతం వృద్ధితో హెచ్ డీఎఫ్ సీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 1.73 కోట్ల కార్డులతో ఎస్‌బీఐ రెండో స్థానంలో ఉంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.46 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.24 కోట్ల కార్డులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే దేశంలో పెండింగ్ క్రెడిట్‌ కార్డు బకాయిలు కూడా గణనీయంగా పెరిగాయి. క్రెడిట్ కార్డుతో ఈజీగా లోన్స్ వంటివి లభిస్తుండడంతో వాటి వినియోగం అమాంతం పెరిగింది. కానీ, గడువు లోగా తిరిగి చెల్లించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాది మార్చి నాటికి వసూలు కాని బకాయిలు/ఎన్‌పీఏలు 2.94 శాతం వరకూ ఉన్నాయి.

First Published:  17 July 2023 8:39 AM GMT
Next Story