Telugu Global
Business

ఆఫర్ లెటర్లిచ్చారు.. ఆఫీస్ కి వద్దంటున్నారు

ఉద్యోగం వచ్చేసినట్టేనని ఆనందపడిన విద్యార్థులు, క్రమంగా ధైర్యం కోల్పోతున్నారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు పలురకాల పరీక్షల తర్వాత ఆఫర్‌ లెటర్లు ఇచ్చాయని, ఆ తర్వాత స్పందన లేదని ఎంపికైన విద్యార్థులు వాపోతున్నారు.

IT Jobs in Hyderabad: Confusion in campus placements students in trouble
X

ఆఫర్ లెటర్లిచ్చారు.. ఆఫీస్ కి వద్దంటున్నారు

ఐటీ కంపెనీల్లో కొన్నాళ్లుగా కొలువుల కోతతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. లే ఆఫ్ లతో కంపెనీలు ఖర్చు తగ్గించుకుంటున్నాయి. ఈ ప్రభావం కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారిపై కూడా పడుతోంది. క్యాంపస్ ఉద్యోగం వచ్చిందని సంబరపడిన వేలాదిమంది ఆఫర్ లెటర్ చేతిలో పడినా ఆఫీస్ కి రావాలంటూ కాల్స్ రాకపోయే సరికి దిగులు పడ్డారు. క్యాంపస్ కొలువుల ఆశ ఆవిరైపోవడంతో ఉద్యోగాల వేటలో పడ్డారు.

వేలమందికి ఆఫర్ లెటర్లు.. వందల్లో ఉద్యోగాలు..

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ లోని ఐటీ కంపెనీలు గతేడాది ఆగస్ట్ లో 24,500మందికి క్యాంపస్ ఇంటర్వ్యూలలో నియామక పత్రాలు అందించాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇందులో కేవలం 2,300మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరారు. మిగతా వారికి కనీసం ఆఫీస్ కి రావాలంటూ కాల్స్ రావడంలేదు. ఎంక్వయిరీ చేస్తే ఇప్పుడే కాదనే సమాధానం వస్తోంది. మంచి శాలరీతో ఆఫర్ లెటర్ చేతిలో ఉన్నా ఆఫీస్ కి వెళ్లలేని పరిస్థితుల్లో చాలామంది దిగులు పడుతున్నారు.

ఉద్యోగం వచ్చేసినట్టేనని ఆనందపడిన విద్యార్థులు, క్రమంగా ధైర్యం కోల్పోతున్నారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు పలురకాల పరీక్షల తర్వాత ఆఫర్‌ లెటర్లు ఇచ్చాయని, ఆ తర్వాత స్పందన లేదని ఎంపికైన విద్యార్థులు వాపోతున్నారు. ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అయిపోయాగానే ఆఫీస్ లకు పిలుస్తామంటూ విద్యార్థులకు హామీ ఇచ్చిన సంస్థలు.. ఇప్పుడా మాట నిలబెట్టుకోలేకపోతున్నాయి. కేవలం స్టార్టప్ కంపెనీలు, చిన్న కంపెనీలే కాదు.. పేరున్న కంపెనీలు కూడా క్యాంపస్ ఉద్యోగాల విషయంలో చేతులెత్తేయడం విశేషం.

ఎన్నాళ్లీ రెసిషన్..

ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల్లో ఆర్థిక మాంద్యం కారణంగా పరిస్థితులు తలకిందులయ్యాయి. ఉద్యోగాల్లో కోత మొదలై చాలాకాలం కావస్తోంది. గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా 570 కంపెనీలు 1.70 లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించినట్టు లేఆఫ్స్‌ ఎఫ్‌వైఐ సంస్థ తమ నివేదికలో వెల్లడించింది. మరి దీనికి అంతమెప్పుడనేదే అర్థం కావడంలేదు. దాదాపు రెండేళ్లపాటు ఇవే పరిస్థితులు కొనసాగుతాయనే అంచనాలున్నాయి.

First Published:  10 May 2023 6:48 AM GMT
Next Story