Telugu Global
Business

Citigroup Layoffs | సిటీ గ్రూప్` బ్యాంకులో ప‌ది శాతం లేఆఫ్స్‌.. ప్ర‌ధాన విభాగాల ప్ర‌క్షాళ‌న‌.. కార‌ణాలివేనా..?!

Citigroup layoffs | గ్లోబ‌ల్ బ్యాంకింగ్ దిగ్గ‌జం సిటీ గ్రూప్‌ మ‌రో ద‌ఫా పొదుపు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 10 శాతం ఉద్యోగుల‌కు లేఆఫ్స్‌ ఇవ్వ‌నున్న‌ది. అంటే 24 వేల మంది ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌లికే అవ‌కాశాలు ఉన్నాయి.

Citigroup Layoffs | సిటీ గ్రూప్` బ్యాంకులో ప‌ది శాతం లేఆఫ్స్‌.. ప్ర‌ధాన విభాగాల ప్ర‌క్షాళ‌న‌.. కార‌ణాలివేనా..?!
X

Citigroup Layoffs | సిటీ గ్రూప్` బ్యాంకులో ప‌ది శాతం లేఆఫ్స్‌.. ప్ర‌ధాన విభాగాల ప్ర‌క్షాళ‌న‌.. కార‌ణాలివేనా..?!

Citigroup Layoffs | అమెరికాలోని వాల్‌స్ట్రీట్ కేంద్రంగా ప‌ని చేస్తున్న గ్లోబ‌ల్ బ్యాంకింగ్ దిగ్గ‌జం సిటీ గ్రూప్ (Citigroup) ఇబ్బందుల్లో ఉందా... లాభాలు త‌గ్గిపోయాయా..? త‌మ ఆదాయంతోపాటు లాభాలు పెంచుకోవడానికి పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ పేరిట ఉద్యోగుల‌కు తాజాగా లేఆఫ్స్ (layoffs) ప్ర‌క‌టించ‌నున్నదా.. అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌మ బ్యాంకు శాఖ‌ల్లోని ప‌లు ప్ర‌ధాన బిజినెస్ సెగ్మెంట్ల‌లో క‌నీసం 10 మంది ఉద్యోగుల‌ను ఇండ్ల‌కు సాగ‌నంప‌నున్న‌ద‌ని తెలుస్తున్న‌ది. 2021లో బ్యాంకు సీఈఓగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి జేన్ ఫ్రాజ‌ర్ (Jane Fraser).. లాభాలు పెంచ‌డానికి, బ్యాంకు ప‌నితీరు క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు, నియంత్ర‌ణ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి నిరంత‌రం ప‌ని చేస్తున్నారు.

సిటీ గ్రూప్ సీఈఓ జేన్ ఫ్రాజ‌ర్ (Jane Fraser) త‌న‌ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ ప్ర‌ణాళిక‌కు అనుగుణంగా ఉద్యోగుల కుదింపు విభాగాల‌పై బ్యాంకు మేనేజ‌ర్లు, క‌న్స‌ల్టెంట్ల‌తో సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. గ‌త సెప్టెంబ‌ర్‌లోనే స‌మూల ప్ర‌క్షాళ‌న ప్ర‌క్రియ‌లో భాగంగా ఉద్యోగాల్లో కోత విధిస్తామ‌ని సిటీ గ్రూప్ (Citigroup) ప్ర‌క‌టించింది. తాజాగా ఉద్వాస‌న ప‌లుక‌నున్న ఉద్యోగుల జాబితా త‌యారీ ప్ర‌క్రియ సాగుతున్న‌ద‌ని సోమ‌వారం ప్ర‌ముఖ ఆంగ్ల దిన చానెల్ ఓ వార్తా క‌థ‌నం వెలువ‌రించింది. ప్ర‌స్తుత త్రైమాసికంలో ఖ‌ర్చుల ఆదా, ఉద్యోగుల లేఆఫ్స్ ప్ర‌భావం ఎంత అన్న విష‌య‌మై అంచ‌నా వేస్తున్న‌ట్లు స‌మాచారం.

సిటీ గ్రూప్ (Citigroup) బ్యాంకు స‌మూల ప్ర‌క్షాళ‌న‌కు అంత‌ర్గ‌తంగా ప్రాజెక్ట్ బొరాబోరా అని నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు స‌మాచారం. త‌ద్వారా బ్యాంకు లావాదేవీల‌పై సీఈఓ జేన్ ఫ్రాజ‌ర్ (Jane Fraser) కు మ‌రింత నియంత్ర‌ణ అధికారాల‌కు క‌ట్ట‌బెట్టేందుకు సిద్ధ‌మైన‌ట్లు బ్యాంకు వ‌ర్గాలు చెబుతున్నాయి. సిటీ గ్రూప్ (Citigroup) బ్యాంకు ప‌నితీరును స‌ర‌ళ‌త‌రం చేయ‌డంతోపాటు స్టాక్ ధ‌ర పెంచ‌డం త‌ద్వారా వాటాదారుల్లో, వ్యాపార వేత్త‌ల్లో విశ్వ‌సనీయ‌త పెంచ‌డ‌మే యాజ‌మాన్యం ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు క‌నిపిస్తున్న‌ది.

ఉద్యోగుల ఉద్వాస‌న‌పై చ‌ర్చ‌లు ప్రాథ‌మిక ద‌శ‌లోనే ఉన్నాయ‌ని సిటీ గ్రూప్ వ‌ర్గాలు తెలిపాయి. అయితే, ఉద్యోగుల ఉద్వాస‌న‌తోపాటు బ్యాంకు ప్ర‌క్షాళ‌న‌కు స‌రైన ప్ర‌ణాళిక రూపొందించుకోవ‌డానికి `బోస్ట‌న్ క‌న్స‌ల్టింగ్ గ్రూప్ (Boston Consulting Group)`ను నియ‌మించుకున్న‌ట్లు తెలుస్తున్న‌ద‌ని ఆ చానెల్ వార్తా క‌థ‌నం సారాంశం. అయితే, క‌న్స‌ల్టింగ్ గ్రూప్ నియ‌మించుకున్న‌ విష‌య‌మై స్పందించేందుకు నిరాక‌రిస్తున్న‌ది.

బ్యాంకు రీజ‌న‌ల్ మేనేజ‌ర్లు, స‌హ‌-అధిప‌తులు, ఇత‌ర ముఖ్య విభాగాల ఎగ్జిక్యూటివ్‌ల‌ను త‌ప్పించాల‌ని సిటీ గ్రూప్ సీఈఓ జేన్ ఫ్రాజ‌ర్ యోచిస్తున్నారు. ముఖ్య విభాగాల‌ను విలీనం చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం సిటీ గ్రూప్‌లో 13 అంచెల మేనేజ్మెంట్ వ్య‌వ‌స్థ ఉన్న‌ది. దాన్ని ఎనిమిది అంచెల‌కు తీసుకు రానున్న‌ట్లు గ‌త సెప్టెంబ‌ర్‌లోనే వెల్ల‌డించింది. నాయ‌క‌త్వ స్థానంలోని రెండు లేయ‌ర్లు, 15 శాతం ఫంక్ష‌న‌ల్ రోల్స్‌ను త‌గ్గించి, 60 క‌మిటీల‌ను పూర్తిగా తొల‌గిస్తారు. ప్ర‌పంచ వ్యాప్తంగా సిటీగ్రూప్ బ్యాంకులో 2,40,000 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు.

మా వాటాదారులు, మా క‌మిట్‌మెంట్స్‌కు అనుగుణంగా మా బ్యాంకు పూర్తి శ‌క్తి సామ‌ర్థ్యాల‌తో ప‌ని చేసేందుకు మేం క‌ట్టుబ‌డి ఉన్నాం. 2022 ఇన్వెస్ట‌ర్ డే నాడు మేం షేర్ చేసుకున్న ప్ర‌ణాళిక‌కు అనుగుణంగా వ్యూహం అమ‌లుకు సంస్థ‌ను రూపొందించుకోవడానికి స‌రైన చ‌ర్య‌లు చేప‌ట్టాం. ఉద్యోగుల ఉద్వాస‌న‌, పొదుపు చ‌ర్య‌ల‌తో త‌లెత్తే ప‌రిణామాలు మాకు తెలుసు అని సిటీ గ్రూప్ అధికార ప్ర‌తినిధి ఒక‌రు చెప్పారు. ఇదిలా ఉంటే, పొదుపు చ‌ర్య‌ల్లో భాగంగా భార‌త్‌లో సిటీ గ్రూప్‌.. త‌న‌ బ్యాంకింగ్ లావాదేవీల‌ను.. ప్ర‌ముఖ ప్రైవేట్ బ్యాంక్ `యాక్సిస్ బ్యాంక్‌`కు విక్ర‌యించింది.

First Published:  7 Nov 2023 1:59 AM GMT
Next Story