Telugu Global
Business

పాత వాహ‌నాల విక్ర‌యంపై కొత్త నిబంధ‌న‌లు

ఇందులో భాగంగా 1989 నాటి నిబంధ‌న‌ల్లోని చాప్ట‌ర్ 3ని స‌వ‌రిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీంతో పాత వాహ‌నాల‌ను రిజిస్ట‌ర్డ్ డీల‌ర్ ద్వారా సులువుగా విక్ర‌యించేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది.

పాత వాహ‌నాల విక్ర‌యంపై కొత్త నిబంధ‌న‌లు
X

మీ పాత వాహ‌నాల‌ను విక్ర‌యించాల‌నుకుంటున్నారా.. అయితే ఈ ప్ర‌క్రియ ఇకపై మ‌రింత సుల‌భ‌త‌రం కానుంది. పాత వాహ‌నాల క్ర‌య, విక్ర‌యాల్లో ఉన్న ఇబ్బందుల‌ను తొల‌గిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం కొత్త నిబంధ‌న‌లు తీసుకొచ్చింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. డిసెంబ‌ర్ 22న ఈ మేర‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా 1989 నాటి నిబంధ‌న‌ల్లోని చాప్ట‌ర్ 3ని స‌వ‌రిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీంతో పాత వాహ‌నాల‌ను రిజిస్ట‌ర్డ్ డీల‌ర్ ద్వారా సులువుగా విక్ర‌యించేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. దీనివ‌ల్ల వాహ‌నాలు అమ్మ‌ద‌ల‌చిన‌వారు డీల‌రును సంప్ర‌దిస్తే స‌రిపోతుంది. త‌ద్వారా వారికి కార్యాల‌యాల చుట్టూ తిర‌గాల్సిన ప‌ని త‌ప్పుతుంది.

కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఏం చేయాలంటే..

కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం య‌జ‌మాని కాని, రిజిస్ట‌ర్డ్ డీల‌రు కాని యాజ‌మాన్య హ‌క్కుల బ‌దిలీకి ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించే అవ‌కాశ‌ముంటుంది.

♦ త‌న వాహ‌నాన్ని విక్ర‌యించ‌ద‌ల‌చిన య‌జ‌మాని ఇందుకు గాను డీల‌రును సంప్ర‌దిస్తే స‌రిపోతుంది.

♦ వాహ‌న య‌జ‌మాని త‌న వాహ‌నాన్ని ఫ‌లానా డీల‌రుకు అప్ప‌గిస్తున్న‌ట్టు ఫామ్ 29 సీ ని ఎలక్ట్రానిక్ రూపంలో అధికారుల‌కు స‌మ‌ర్పించాలి. వెంట‌నే ఆటో జ‌న‌రేటెడ్ అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబ‌రు వ‌స్తుంది.

♦ దీంతో సంబంధిత డీల‌రుకు ఆ వాహ‌నాల‌పై లావాదేవీల హ‌క్కు ల‌భిస్తుంది. అలాగే డీల‌రే ఊహాజ‌నిత య‌జ‌మాని కూడా అవుతాడు. ఆ వాహ‌నాల‌కు సంబంధించిన లావాదేవీలు, వాటి ద్వారా జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌కు కూడా అత‌నే జ‌వాబుదారు అవుతాడు.

♦ రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికెట్‌, ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్ రెన్యువ‌ల్‌, డూప్లికేట్ రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికెట్‌, నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్‌, ఇన్సూరెన్స్‌, వాహ‌న యాజ‌మాన్య హ‌క్కుల బ‌దిలీ అన్నీ డీల‌రు చేతుల‌మీదుగానే నిర్వ‌హించ‌డానికి అవ‌కాశం ఏర్ప‌డుతుంది.

♦ ఒక‌వేళ డీల‌రు నుంచి త‌న వాహ‌నాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని య‌జ‌మాని భావిస్తే.. అందుకు గాను ఫామ్ 29 డీ ని స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. త‌ద్వారా అప్ప‌టి నుంచి వాహ‌న య‌జ‌మానికే పూర్తి హ‌క్కులు వ‌స్తాయి. వాటిద్వారా లావాదేవీలు జ‌రిపే అధికారం డీల‌రుకు ఉండ‌దు.

Next Story