Telugu Global
Business

చెక్ ఇస్తే చిక్కినట్టే.. బౌన్స్ కాకుండా కొత్త రూల్స్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35 లక్షల చెక్‌ బౌన్స్‌ కేసులు పెండింగులో ఉన్నాయి. ఇకపై ఇలాంటి కేసులు ఉండకూడదు అంటే.. ఉద్దేశ పూర్వకంగా నగదు లేని ఖాతాలకు సంబంధించిన చెక్‌లు ఇచ్చేవారికి కళ్లెం వేయాలి.

చెక్ ఇస్తే చిక్కినట్టే.. బౌన్స్ కాకుండా కొత్త రూల్స్
X

ఆర్థిక మోసాల్లో చెక్ బౌన్స్ కూడా ఒకటి. ఇవ్వాల్సిన సొమ్ముని చెక్ రూపంలో ఇచ్చేసి, అప్పటికప్పుడు కొన్ని సెటిల్మెంట్‌లు చేసుకుంటారు. తీరా ఆ చెక్ బ్యాంక్‌లో వేసే సమయానికి డబ్బుల్లేవు, ఈ రోజు, రేపు అంటూ బతిమిలాడుకుంటారు. పోనీ చెక్ బ్యాంకులో వేసినా అకౌంట్‌లో డబ్బు లేకపోతే బౌన్స్ అవుతుంది. దీంతో మనకు గిట్టుబాటు కాదులే అని చాలామంది బాధితులు సైలెంట్‌గా ఉంటుంటారు. చెక్ బౌన్స్ కేసులు కూడా ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోతున్నాయి. దీన్ని నివారించేందుకు ఇప్పుడు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకురాబోతోంది.

ఒక అకౌంట్‌లో లేకపోతే ఇంకో అకౌంట్ నుంచి..

ఒకే వ్యక్తికి నాలుగైదు బ్యాంకుల్లో నాలుగైదు అకౌంట్లు ఉన్నా కూడా ఒకదానితో ఇంకొకదానికి సంబంధం ఉండదు. కేవలం, పాన్, ఆధార్ వంటివి మాత్రమే కామన్‌గా లింక్ అయి ఉంటాయి. ఇలాంటి లింకుల ఆధారంగా చెక్ బౌన్స్ సమస్యలను పరిష్కరించబోతున్నారు. ఒక అకౌంట్‌లో డబ్బు లేకపోతే, అదే వ్యక్తికి చెందిన మరో అకౌంట్ నుంచి ఆ సొమ్ము బదిలీ అయ్యేలా కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అత్యున్నత స్థాయి సమావేశంలో సంస్కరణలపై చర్చ జరిగింది.

నిపుణుల సూచనలు..

చెక్ జారీ చేసిన బ్యాంకు ఖాతాలో తగినంత సొమ్ము లేకపోతే, అదే వ్యక్తికి సంబంధించిన మరో ఖాతా నుంచి నగదు అటోమేటిక్‌గా బదిలీ అయ్యేలా చూడటం.

♦ ఆర్థిక నేరస్థులుగా ముద్రపడితే ఏ బ్యాంక్‌లోనూ కొత్త ఖాతాలు తెరిచే వీలు లేకుండా చేయడం. ఈమేరకు పాన్ నెంబర్ ఆధారంగా కొత్త ఖాతాలు తెరవకుండా నిషేధం విధించాలి.

♦ చెక్‌ బౌన్స్‌ కేసుల్ని లోన్ డిఫాల్ట్‌ గా పరిగణించి, దానికి పాల్పడినవారి సిబిల్ స్కోర్ తగ్గించడం, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఆ సమాచారం ఇవ్వడం.

ఈ నిబంధనలు అమలులోకి వస్తే చెక్ బౌన్స్ కేసులు తగ్గుతాయని, బ్యాంకుల ద్వారా జరిగే ఆర్థిక నేరాలు కాస్త తగ్గుముఖం పడతాయని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35 లక్షల చెక్‌ బౌన్స్‌ కేసులు పెండింగులో ఉన్నాయి. ఇకపై ఇలాంటి కేసులు ఉండకూడదు అంటే.. ఉద్దేశ పూర్వకంగా నగదు లేని ఖాతాలకు సంబంధించిన చెక్‌లు ఇచ్చేవారికి కళ్లెం వేయాలి. పొరపాటున చెక్ ఇచ్చినా.. నిల్వ ఉన్న అకౌంట్ నుంచి నగదు తీసుకుంటారు అనే భయం చెక్ ఇచ్చేవారిలో ఉంటుంది. అంటే చెక్ ఇస్తే ఇకపై తప్పించుకునే వీలు లేదు అనేది కొత్త నిబంధనల సారాంశం.

First Published:  10 Oct 2022 4:51 AM GMT
Next Story