Telugu Global
Business

Maruti- Hyundai | కార్ల ఎగుమ‌తిలోనూ మారుతిదే పై చేయి.. త‌ర్వాతీ స్థానంలో హ్యుండాయ్‌..!

Maruti- Hyundai | అంత‌ర్జాతీయంగా ఒడిదొడుకులు ఉన్నా విదేశాల్లో హ్యుండాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి ఎస్‌యూవీ కార్ల‌కు రోజురోజుకు గిరాకీ పెరుగుతోంది.

Maruti- Hyundai | కార్ల ఎగుమ‌తిలోనూ మారుతిదే పై చేయి.. త‌ర్వాతీ స్థానంలో హ్యుండాయ్‌..!
X

Maruti- Hyundai | అంత‌ర్జాతీయంగా ఒడిదొడుకులు ఉన్నా విదేశాల్లో హ్యుండాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి ఎస్‌యూవీ కార్ల‌కు రోజురోజుకు గిరాకీ పెరుగుతోంది. ఆస్ట్రేలియా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లోనూ ఎస్‌యూవీ కార్ల‌కు డిమాండ్ పుంజుకుంటున్న‌ది. దీంతో విదేశాల‌కు మేడ్ ఇన్ ఇండియా కార్ల ఎగుమ‌తులు ప్రీ-కొవిడ్ స్థాయికి చేరుతున్నాయి. ఆటో ఇండ‌స్ట్రీ విశ్లేష‌కుల అంచ‌నా ప్ర‌కారం 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రంలో అంటే మార్చి 31 నాటికి 6.75 ల‌క్ష‌ల‌కు పైగా కార్లు అమ్ముడ‌వుతాయ‌ని తెలుస్తున్న‌ది.

2020-21 ఆర్థిక సంవ‌త్స‌రం (కొవిడ్ మ‌హ‌మ్మారి)లో విదేశాల‌కు 4.04 ల‌క్ష‌ల కార్లు ఎగుమ‌తి అయ్యాయి. తిరిగి 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలో 6.63 ల‌క్ష‌ల‌కు చేరాయి. విదేశాల‌కు కార్ల ఎగుమ‌తిలో మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ మోడ‌ల్స్ పైచేయి సాధించాయి. మూడింట రెండొంతుల కార్లు మారుతి సుజుకి, హ్యుండాయ్ కార్లు ఎగుమ‌తి అయ్యాయంటే అతిశ‌యోక్తి కాదు.

టాటా మోటార్స్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా వంటి దేశీయ కార్ల త‌యారీ సంస్థ‌ల కార్ల మోడ‌ల్స్ ఎగుమ‌తులు చాలా త‌క్కువ‌. టాటా మోటార్స్ కార్లు 0.4 శాతం, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా రెండు శాతం కార్లు విదేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్నారు. విదేశాల‌కు కార్లు ఎగుమ‌తి చేస్తున్న టాప్-5 సంస్థ‌ల్లో మారుతి సుజుకి, హ్యుండాయ్ త‌ర్వాతీ స్థానాల్లో కియా ఇండియా, ఫోక్స్‌వ్యాగ‌న్‌, నిసాన్ నిలిచాయి.

కియా ఇండియా తొమ్మిది, ఫోక్స్ వ్యాగ‌న్ ఏడు శాతం, నిసాన్ ఇండియా ఆరు శాతం కార్లు ఎగుమ‌తి చేశాయి. ఇదిలా ఉంటే, ఏయేటికాయేడు టాటా మోటార్స్, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా దేశీయంగా కార్ల విక్ర‌యాలు పెరుగుతున్నాయి. 2023 ఏప్రిల్ నుంచి గ‌త 11 నెల‌ల్లో టాటా మోటార్స్ 1998, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా 9,218 కార్లు ఎగుమ‌తి చేస్తే, మారుతి సుజుకి 2,02,786, హ్యుండాయ్ 1,29,755 కార్లు ఎగుమ‌తి చేశాయి.

మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా.. త‌న కార్ల‌ను విదేశాల‌కు ఎగుమ‌తి చేసి, త‌న వ్యాపారాన్ని విస్త‌రించేందుకు ప్ర‌ణాళిక రూపొందించింది. ఎక్స్‌యూవీ700, స్కార్పియో ఎన్ వంటి పాపుల‌ర్ కార్ల‌ను రీఫ్రెష్ చేసి, ఎల‌క్ట్రిక్ కార్లుగా విదేశాల‌కు ఎగుమ‌తి చేసేందుకు సిద్ధమైంది. విదేశీయుల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఫీచ‌ర్లు, హై క్వాలిటీతో కూడిన పోర్ట్‌పోలియో యూనిట్ల‌ను డిజైన్ చేయ‌లేక‌పోవ‌డ‌మే టాటా మోటార్స్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా వెన‌క‌ప‌ట్టు ప‌ట్ట‌డానికి కార‌ణం అని నిపుణులు చెబుతున్నారు. జ‌పాన్‌లో త‌యారైన యూజ్డ్ కార్ల‌కు శ్రీలంక‌లో డిమాండ్ ఎక్కువగా ఉంది. క్వాలిటీ, బ్రాండ్ క‌మిట్‌మెంట్స్‌, స్పెషిఫికేష‌న్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ద‌శాబ్ద కాలంలో మారుతి సుజుకి ఎగుమ‌తులు మూడు రెట్లు పెరిగాయి. మారుతి సుజుకి చైర్మ‌న్ ఆర్‌సీ భార్గ‌వ స్పందిస్తూ మేడ్ ఇన్ ఇండియా కార్ల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గిరాకీ ఉంద‌న్నారు. కార్ల త‌యారీ, డిజైనింగ్‌, రీసెర్చ్‌లో ట‌యోటా కిర్లోస్క‌ర్‌తో భాగ‌స్వామ్య ఒప్పందం మారుతి సుజుకికి క‌లిసి వ‌స్తోంది.

First Published:  29 March 2024 2:15 AM GMT
Next Story