Telugu Global
Business

కొత్తగా ఏసీ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి!

ఏసీ కొనేముందు దాని సైజు, రేటింగ్, ఇన్వర్టర్, ఇతర ఫీచర్లపై ఓ లుక్కేయాలి. అలాగే కొనబోయే ముందు గది పరిమాణాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.

కొత్తగా ఏసీ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి!
X

వచ్చే నెల నుంచి ఎండలు మండిపోతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే పీక్ సమ్మర్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని చాలామంది ఎసీలు కొంటుంటారు. అయితే ఆన్ లైన్ లేదా షాపుల్లో ఏసీలు కొనేముందు కొన్ని విషయాలు చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

ఏసీ కొనేముందు దాని సైజు, రేటింగ్, ఇన్వర్టర్, ఇతర ఫీచర్లపై ఓ లుక్కేయాలి. అలాగే కొనబోయే ముందు గది పరిమాణాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.

సైజు ఇలా..

ఏసీ కొనేముందు గది సైజుని దృష్టిలో ఉంచుకుని దానికి తగిన కెపాసిటీ ఉన్న ఏసీని ఎంచుకోవాలి. పెద్ద గదులకు తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీ పెడితే రూం చల్లబడదు. కాబట్టి గది సైజు వంద స్క్వేర్ ఫీట్‌కు సుమారుగా ఉంటే ఒక టన్ను ఏసీ అంతకంటే ఎక్కువగా ఉంటే 1.5 టన్నులు లేదా 2 టన్నుల కెపాసిటీ ఉన్న ఏసీని ఎంచుకోవాలి.

రేటింగ్

ఏసీని కొనేటప్పుడు ఎనర్జీ ఎఫీషియన్సీ(ఐఎస్‌ఈఈఆర్‌) రేటింగ్‌ చూడాలి. రేటింగ్ 4 లేదా 5 ఉంటే తక్కువ విద్యుత్ ఖర్చు అవుతుందని అర్థం. రేటింగ్ తగ్గే కొద్దీ కరెంట్ బిల్లు పెరగుతుంది అని లెక్క.

ఇన్వర్టర్‌ ఉందా?

ఏసీల్లో ఇన్‌బిల్ట్ ఇన్వర్టర్ ఉండే వాటిని ఎంచుకుంటే అది కొంత వరకూ విద్యుత్‌ను ఆదా చేస్తుంది. అంటే గది చల్లబడిన వెంటనే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యి మళ్లీ కాసేపటికి ఆన్ అవుతుంది. రోజంతా ఏసీ ఆన్‌లో ఉంచేవాళ్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. నాన్‌ ఇన్వర్టర్‌ ఏసీల్లో ఈ ఫీచర్ ఉండదు. రోజులో కొన్ని గంటలు మాత్రమే ఏసీ వాడతామనుకునేవాళ్లు నాన్ ఇన్వర్టర్ ఏసీ కొనుగోలు చేయొచ్చు.

స్టెబిలైజర్ కూడా..

ఏసీ కొనేటప్పుడే స్టెబిలైజర్‌ కూడా కొంటే మంచిది. ఎప్పుడైనా ఇంట్లో తక్కువ వోల్టేజ్‌ కరెంట్ వచ్చినప్పుడు ఏసీ మోటర్ పాడవ్వకుండా ఉండాలంటే స్టెబిలైజర్‌ ఉండాలి. స్టెబిలైజర్ లేకపోతే ఏసీ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.

సర్వీస్ చెక్

ఏసీ కోసం బ్రాండ్ ఎంచుకునేటప్పుడు వారెంటీ, సర్వీస్ వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని కొనాలి. ఏ బ్రాండ్ సరైన సమయానికి సర్వీస్ అందిస్తుందో తెలుసుకోవాలి. అలాగే బ్రాండ్ల వారీగా కస్టమర్ల రేటింగ్‌లు , రివ్యూలు కూడా చదవడం మంచిది.

ఇవి కూడా..

ఇక వీటితోపాటు ఏసీ కొనేటప్పుడు ఇన్‌స్టలేషన్ సర్వీస్ ను కూడా ఎంచుకోవాలి. నిపుణుల చేత మాత్రమే ఏసీని ఇన్‌స్టాల్ చేయించాలి. అలాగే ఏసీల్లో పలురకాల స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా పరిగణలోకి తీసుకుని సరైన ప్రొడక్ట్ ఎంచుకోవడం మంచిది.

First Published:  21 March 2024 12:30 AM GMT
Next Story