Telugu Global
Business

సమ్మర్‌‌లో ఏసీ, కూలర్ మెయింటెనెన్స్ టిప్స్!

సమ్మర్‌‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది ఏసీలు, కూలర్లు వాడుతుంటారు. అయితే వీటిని వాడేటప్పుడు కొన్ని బేసిక్ జాగ్రత్తలు పాటించడం ద్వారా అవి ఎక్కువకాలం మన్నికగా ఉండేలా, తక్కువ కరెంట్ బిల్ వచ్చేలా చూసుకోవచ్చు.

సమ్మర్‌‌లో ఏసీ, కూలర్ మెయింటెనెన్స్ టిప్స్!
X

సమ్మర్‌‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది ఏసీలు, కూలర్లు వాడుతుంటారు. అయితే వీటిని వాడేటప్పుడు కొన్ని బేసిక్ జాగ్రత్తలు పాటించడం ద్వారా అవి ఎక్కువకాలం మన్నికగా ఉండేలా, తక్కువ కరెంట్ బిల్ వచ్చేలా చూసుకోవచ్చు. అదెలాగంటే..

సమ్మర్ కోసం ఏసీలు, కూలర్లు కొనేముందు బ్రాండ్, సర్వీస్, వారెంటీ వంటి అన్ని వివరాలు తెలుసుకుని కొనాలి. మీరు ఉండే గది వైశాల్యాన్ని బట్టి సైజు ఎంచుకోవాలి. ఏసీల్లో కాస్త ధర ఎక్కువైనా త్రీ స్టార్ లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్నవి తీసుకుంటే దీర్ఘకాలంలో ఎక్కువ కరెంట్ ఆదా అవుతుంది.

గదిలో ఉన్న ఉష్ణోగ్రతను చల్లబరచడమే ఏసీ పని. అయితే గది ఉష్ణోగ్రత ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని చల్లబరచడం కోసం ఏసీ అంత ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో ఏసీ కరెంట్ బిల్లు పెరుగుతుంటుంది. దీన్ని అదుపు చెయాలంటే ఎండలు ముదరకముందే ఏసీని సర్వీసింగ్‌ చేయించాలి. అలాగే గ్యాస్‌ పట్టించడం, ఎయిర్ ఫిల్టర్‌లు మార్చడం వంటివి ఇప్పుడే చేసేస్తే మంచిది.

ఏసీ సరిగ్గా పనిచేయాలంటే కండెన్సర్ యూనిట్‌కు గాలి తగలాలి. కాబట్టి కండెన్సర్ యూనిట్ అమర్చిన చోట చుట్టూ ఖాళీ ఉండేలా చూసుకోవాలి. గదిలో ఏసీ ఆన్‌లో ఉన్నపుడు కిటికీలు, తలుపులు తెరచి ఉంచితే గది చల్లబడకపోగా, కరెంట్ బిల్లు ఎక్కువవుతుంది. కాబట్టి ఏసీ ఆన్‌లో ఉంటే కిటికీలు మూసి ఉంచాలి. అలాగే ఇన్వర్టర్ లేని ఏసీలను అస్తమానం ఆన్‌లో ఉంచకుండా గది చల్లబడిన తర్వాత ఆఫ్ చేయడం ద్వారా కరెంట్ బిల్ ఆదా చేయొచ్చు..

ఇక కూలర్లు కొనేటప్పుడు కూడా కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. చాలామంది నాసిరకం కూలర్లు కొని సమ్మర్ అయిపోగానే వాటిని మిద్దెపై పడేస్తుంటారు. మరుసటి ఏడాదికి అవి సరిగా పనిచేయక.. మళ్లీ ఏడాదికో లేదా రెండేళ్లకో మరో కొత్త కూలర్ కొంటుంటారు. దీనికి బదులు తక్కువ సైజులో ఉండే మేలు రకం టవర్ కూలర్లు కొంటే ఎక్కువ కాలం మన్నిక ఉంటాయి. వీటిని గదిలోనే ఓ మూలన ఉంచేయొచ్చు. అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒక చోటు నుంచి మరొక చోటుకు తీసుకెళ్లేందుకు వీలుగా వీల్స్‌ ఉన్న టవర్ కూలర్లు తీసుకుంటే మరింత అనుకూలంగా ఉంటుంది.

కూలర్లు కొనేటప్పుడు మంచి కూలింగ్ ప్యాడ్లు ఉన్నవి ఎంచుకోవాలి. కూలర్ విషయంలో చల్లదనం అనేది ఆ ప్యాడ్‌ల మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే పాత కూలర్లు వాడేవాళ్లు ఏడాదికోసారి ప్యాడ్లు మార్చుకుంటే మంచిది.

కూలర్లు వాడనప్పుడు అందులో ఉండే నీటిని అలానే వదిలేస్తే దోమలు వచ్చి చేరతాయి. కాబట్టి కూలర్లు వాడనప్పుడు అందులో నీళ్లు లేకుండా తీసేయాలి.

First Published:  13 April 2024 1:30 AM GMT
Next Story