Telugu Global
Business

5జీలోనూ ఆ మూడు కంపెనీలే.. నేటి నుంచి స్పెక్ట్రమ్ వేలం.. సేవలు ఎప్పటి నుంచి అంటే..!

ప్రస్తుతం ఇండియాలో మొబైల్ నెట్‌వర్క్ సేవలు అందిస్తున్న జియో, ఎయిర్‌టెల్, వోడఫోన్ ఐడియాతో పాటు అదానీ డేటా ఈ వేలంలో పాల్గొంటున్నాయి.

5జీలోనూ ఆ మూడు కంపెనీలే.. నేటి నుంచి స్పెక్ట్రమ్ వేలం.. సేవలు ఎప్పటి నుంచి అంటే..!
X

ప్రస్తుతం ఇండియా అంతటా 4జీ మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే పలు ప్రపంచ దేశాల్లో వినియోగంలో ఉన్న 5జీ నెట్‌వర్క్ మరో రెండు నెలల్లో దేశంలోని 25 నగరాల్లో అందుబాటులోకి రానున్నది. 4జీ కంటే పది రెట్లు వేగంతో డేటా ట్రాన్స్‌ఫర్ చేయగలిగే సామర్థ్యం ఈ 5జీ సొంతం. దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా 5జీ నెట్‌వర్క్ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొననున్నాయి. నేటి నుంచి (జూలై 26) కేంద్రం 5జీ స్పెక్ట్రమ్‌ను వేలం వేయనుంది. మొత్తం 72 గిగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను 20 ఏళ్ల పాటు వినియోగించుకోవడానికి వీలుగా వేలం వేయనున్నారు. ఇందులో 600, 700, 800, 1800, 2100, 2300, 3300 మెగాహెర్జ్ వంటి తక్కువ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లతో పాటు 26 గిగాహెర్జ్‌ల అధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం ఇండియాలో మొబైల్ నెట్‌వర్క్ సేవలు అందిస్తున్న జియో, ఎయిర్‌టెల్, వోడఫోన్ ఐడియాతో పాటు అదానీ డేటా ఈ వేలంలో పాల్గొంటున్నాయి. కాగా, అదానీ డేటా సంస్థ కేవలం క్యాప్టీవ్ నెట్‌వర్క్ కోసం మాత్రమే వేలంలో పాల్గొంటున్నామని, కమర్షియల్ సేవలు అందించడానికి రావడం లేదని స్పష్టం చేసింది. అంటే ఇప్పుడు మొబైల్ వినియోగదారులకు ఆ మూడు కంపెనీలే 5జీ సేవలను కూడా అందించనున్నట్లు తెలుస్తుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యునికేషన్స్ అనుమతించిన 72 గిగా హెర్జ్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కనీసం రూ. 4.3 లక్షల కోట్ల ఆదాయం రానున్నది. ఇది కేవలం బేస్ ప్రైస్ మాత్రమే. ఒకవేళ పోటీ పెరిగితే ఆదాయం మరింతగా పెరుగనున్నది.

ఇండియాలో అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్, వినియోగదారుల పరంగా అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ జియో కూడా 5జీ కోసం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే రూ.14,000 కోట్లను ఈఎండీ కింద చెల్లించింది. భారతి ఎయిర్‌టెల్ రూ. 5,500 కోట్లు, వొడఫోన్ ఐడియా రూ. 2,200 కోట్లు, అదానీ డేటా నెట్‌వర్క్స్ రూ.100 కోట్లు ఈఎండీ రూపంలో చెల్లించి వేలంలో పాల్గొంటున్నాయి.

ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ వివరాల మేరకు ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో ఇండియాలోని 25 నగరాల్లో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, పూణే, చెన్నై, గాంధీనగర్, జామ్‌నగర్, ముంబై, అహ్మదాబాద్, చంఢీఘర్ ఈ లిస్టులో ఉన్నాయి. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్, వోడఫోన్ ఐడియా సంస్థలు 5జీ నెట్‌వర్క్ ట్రయల్స్ పూర్తి చేశాయి. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో చేసిన 5జీ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి.

వోడఫోన్ ఐడియా చేసిన 5జీ ట్రయల్స్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ 5.92 జీబీపీఎస్‌గా నమోదైంది. ఎయిర్‌టెల్ ట్రయల్ స్పీడ్ 3 జీబీపీఎస్, జియో ట్రయల్ స్పీడ్ 1 జీబీపీఎస్‌గా ఉంది. అయితే ట్రయల్ స్పీడ్ ఇలా నమోదైనా.. కమర్షియల్ వినియోగంలోకి వచ్చే సరికి భారీ వ్యత్యాసం ఉంటుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. ఒక టవర్ పరిధిలో 5జీ వినియోగదారుల సంఖ్య, డౌన్‌లోడింగ్ చేస్తున్నవారి సంఖ్యను బట్టి స్పీడ్ మారుతుందని చెప్తున్నారు.

ఇక అదానీ డేటా నెట్‌వర్క్స్ సంస్థ 5జీలో పాల్గొన్నా... అది కేవలం క్యాప్టీవ్ నెట్‌వర్క్ కోసం మాత్రమే అని స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్టులు, సీపోర్టులు, హాస్పిటల్స్, బడా కార్పొరేట్స్ వంటి సంస్థలకు ప్రత్యేకమైన 5జీ సేవలు అందించడానికి మాత్రమే ఈ నెట్‌వర్క్ ఉపయోగిస్తారు.

Next Story