Telugu Global
Business

మూడులో రెండొంతుల జీఎస్టీని కట్టేది 50 శాతం మంది పేదలే.. ధనవంతుల వాటా 3 శాతం మాత్రమే : ఆక్స్‌ఫామ్

ధనవంతులకు ఇస్తున్న పన్ను మినహాయింపులు, జీఎస్టీ అంతరాల కారణంగా దేశంలో ఆర్థిక అసమానతలు నెలకొంటున్నట్లు ఆక్స్ ఫామ్ తెలిపింది.

మూడులో రెండొంతుల జీఎస్టీని కట్టేది 50 శాతం మంది పేదలే.. ధనవంతుల వాటా 3 శాతం మాత్రమే : ఆక్స్‌ఫామ్
X

ఇండియాలో సంపద, ఆదాయం పరంగా ప్రజల మధ్య అసమానతలు ఎలా ఉన్నాయో ఆక్స్‌ఫామ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. 2012-21 మధ్య దశాబ్ద కాలంలో దేశంలో సృష్టించబడిన సంపదలో 40 శాతం ధనవంతుల వద్దకు వెళ్లిపోయిందని నివేదిక తేల్చింది. దేశ జనాభాలో వీరు 1 శాతం మాత్రమే ఉండగా.. 40 శాతం సంపద వారి వద్దకే వెళ్లిందని పేర్కొన్నారు. అదే సమయంలో దేశంలో ఆదాయపరంగా దిగువన ఉన్న 50 శాతం మందికి చేరిన సంపద 3 శాతం మాత్రమే అని చెప్పింది. దేశంలో కేవలం 5 శాతం మంది వద్దే 60 శాతం సంపద పోగుపడిందని నివేదికలో వెల్లడించారు.

ధనవంతులకు ఇస్తున్న పన్ను మినహాయింపులు, జీఎస్టీ అంతరాల కారణంగా దేశంలో ఆర్థిక అసమానతలు నెలకొంటున్నట్లు ఆక్స్ ఫామ్ తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.14.83 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కాగా.. అందులో 64 శాతం జనాభాలో సంపద పరంగా దిగువన ఉన్న 50 శాతం దగ్గర నుంచే వసూలు అయినట్లు తెలిపింది. ఇక ధనవంతుల నుంచి 3 శాతం, మధ్య తరగతి నుంచి 33 శాతం జీఎస్టీ వసూలు అయినట్లు తెలిపారు. జనాభాలో 50 శాతం మంది పేదలు పరోక్ష పన్నుల ద్వారా భారీగా చెల్లిస్తున్నారని.. అదే సమయంలో ట్యాక్స్ పేయర్‌గా చెప్పుకుంటున్న వాళ్లు కట్టేది చాలా తక్కువని నివేదికలో పేర్కొన్నారు. ధనవంతుల కంటే పేదలు ఆరు రెట్లు ఎక్కువగా పరోక్ష పన్నులు కడుతున్నట్లు ఆక్స్‌ఫామ్ వెల్లడించింది.

2020లో దేశంలో 102 మంది బిలియనీర్లు ఉంటే.. 2022కి వారి సంఖ్య 166కు పెరిగినట్లు చెప్పారు. దేశంలోని టాప్ 100 బిలియనీర్ల సంపద దాదాదపు రూ.54.12 లక్షల కోట్లుగా ఉందని అన్నారు. ఇది దేశ 18 నెలల బడ్జెట్ కంటే ఎక్కువే అని నివేదిక తెలిపింది. పాండమిక్ సమయంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సంపద రెట్టింపు అయిన విషయాన్ని కూడా నివేదికలో ఉటంకించింది. దేశంలో 19 శాతం మంది బిలియనీర్లు హెల్త్ కేర్, ఫార్మా రంగాలకు చెందిన వారే ఉన్నారని తెలిపింది. కోవిడ్ పాండమిక్ సమయంలో ఈ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తల్లో ఏడుగురు బిలియనీర్లుగా అవతరించారని చెప్పారు.

2019లో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. ఇక కొత్తగా ప్రారంభించబడని కంపెనీలు 15 శాతం ట్యాక్స మాత్రమే చెల్లిస్తున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్లకు ఇచ్చిన ఇన్సెంటీవ్స్, మినహాయింపుల విలువ రూ.1,03,285 కోట్ల కంటే ఎక్కువే. ఇది కేంద్ర ప్రభుత్వం 1.5 ఏళ్లకు గాను ఉపాధి హామీ పథకానికి వెచ్చించిన మొత్తంతో సమానమని నివేదికలో పేర్కొన్నారు. పరోక్షంగా అత్యధిక పన్నులు చెల్లించేది అంతా కార్పొరేట్లకే వెళ్లిపోతోందని కూడా నివేదిక వెల్లడించింది.

First Published:  22 May 2023 1:21 PM GMT
Next Story