Telugu Global
Arts & Literature

తప్పు? శిక్ష?

తప్పు? శిక్ష?
X

తప్పు? శిక్ష?

హైదరాబాద్ నడిబొడ్డున చాలా రోజులుగా ఖాళీగా పడి వున్న వెయ్యి గజాల స్థలం. ఆ యజమానికి తనకి ఈ సిటీలో అటువంటి స్థలం ఒకటి వుంది అన్నట్టు కూడా గుర్తు లేదు. అంత పెద్ద సిరిమంతుడు. ఆ ఖాళీ స్థలంలో చాలా పెద్దగా పెరిగిన వేప చెట్టు వుంది. ఈ యేడు కాయలు కాయడానికి సిద్ధంగా వున్న మామిడి చెట్టు కూడా వుంది. ఇంకా చిన్ని చిన్ని పిచ్చి పొదలు.

ఈ స్థలంని ఆనుకొని కొబ్బరిబొండాల కొట్టు నడుపుకొనే అరవై అయిదేళ్ళ సలీం. ఆ స్థలంలోనే ఒక మూల చిన్న పాకలో నివాసం. ఆ పాకలో జబ్బుతో మంచాన వున్న సలీం భార్య. వీళ్ళకి ఇద్దరు పిల్లలు. ముందు పుట్టిన కూతురుకి పెళ్ళి చేసి దుబాయి పంపించేసారు. ఇక మిగిలిన కొడుకుని తాహతుకి మించి డిగ్రీ చదివించారు. వాడు ఉద్యోగం కోసం అప్పులు చేసి దేశం దాటించారు. కువైట్ వెళ్ళాక వాడి నుంచి కబురే లేదు. కూతురు పెళ్ళికి , కొడుకు నౌకరీకీ చేసిన అప్పు వడ్డీతో కలిసి కొండై కూర్చుంది. ఆ అప్పు తీరాలి అంటే ఇంకా ఎన్ని కొబ్బరి బోండాలు కొట్టాలో! అంత సత్తువ సలీంలో వుందా ..

ఇక ఆ ఖాళీ స్థలంలో వేప చెట్టుపై గూళ్ళు కట్టుకున్న వలస పక్షులెన్నో. సాయంత్రం అయ్యేసరికి కిలకిల మంటూ చెట్లపై చేరి చేసే సందడి అంతా ఇంతా కాదు. చుట్టూ ఎత్తైన భవంతుల మధ్య స్వచ్చమైన గాలిని పంచుతున్న స్థలం ఇది. మామిడి చెట్టు పై నుంచి వేప చెట్టు పైకి గెంతుతూ రెండు ఉడతలు. ఆ కాంక్రీట్ అపార్ట్మెంట్ల మధ్య అమృతం పంచే స్థలం ఇది.

అనుకోకుండా ఒక రోజు ఆ స్థలం యజమాని యంత్రాలు, పనివాళ్ళతో వచ్చాడు. ఈ స్థలం నాది అన్నాడు. వెంటనే ఖాళీ చెయ్యమని చెప్పాడు. సలీం మనిషి కాబట్టి విషయం అర్ధమయ్యింది. యజమాని కాళ్ళు పట్టుకున్నాడు. "సాబ్! ఒక పది రోజులు టైమ్ ఇవ్వు. వేరే చోటుకి మారి పోతా" అని వేడుకున్నాడు. రాయిలాంటి యజమానిది ఒక్కమాటే. "ఈ స్థలం నాది. వెంటనే ఖాళీ చేస్తారా? ఇప్పటి దాకా వాడుకున్నందుకు డబ్బులు కడుతారా?" అని ఆగ్రహం చూపించాడు.

చేసేదిలేక వున్నవి మూటకట్టుకొని, పెళ్ళాం చెయ్యి పట్టుకొని రోడ్డున పడ్డాడు సలీం. కళ్ల ముందే కొబ్బరిబోండాల కొట్టు నేల కొరిగింది. మనస్సులేని యంత్రం తన పని చేసుకొని పోయింది. నిమిషాల్లో చెట్లు కూలిపోయాయి. ఆ స్థలం మొత్తం శుభ్రం చేసేసారు. ఇప్పటిదాకా ప్రాణంతో వున్న ఆ స్థలం కూడా నిర్జీవంగా మారిపోయింది.

ఆ స్థలం మధ్య ఒక బోర్డు పెట్టారు. "ఈ స్థలం ఫలానా వాళ్ళది. నిబంధనలకి అతిక్రమించినవారు చట్టరీత్యా శిక్షించబడుతారు". పని ముగించుకొని యజమాని, యంత్రాలు, పనివాళ్లు అందరూ వెళ్ళిపోయారు. సలీం, భార్య రోడ్డున పడ్డారు. ఆ వీధుళ్ళోని ఎన్నో కుటుంబాలు సలీం దగ్గరే కొబ్బరి బోండాలు తాగి వుంటారు. ఒక్కరూ సలీం కుటుంబామ్ని ఆదుకోలేదు.తాగడానికి మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు. మూసేసిన ఒక పాత సామన్ల కొట్టు ముందే తాత్కాలికంగా ఆగిపోయారు. రేపు పొద్దునే వాళ్ళు కూడా తరిమేయొచ్చు? మరో చోటు వెతుక్కోవాలేమో!

సాయంత్రం కాగానే పక్షులు ఆనందంగా తమ గూళ్ళకు తిరిగి వచ్చాయి. గూళ్ళు లేవు. అవి వుండే చెట్లు లేవు. అక్కడే అటుఇటు తిరిగాయి. ఆ స్థలం మధ్యలో వున్న బోర్డు మీద వాలింది ఒక పక్షి. నిబంధనలు అతిక్రమించినందుకు ఈ పక్షి కి శిక్ష పడుతుందా ఇప్పుడు? గూళ్ళు చెదిరి, గుడ్లు పగిలి, పక్షి పిల్లలు చచ్చి అప్పటికే పడిన శిక్షకంటే పెద్దది పడుతుందా? అక్కడే ఒక మూల యంత్రాల క్రింద పడి సచ్చిపోయిన ఒక ఉడతని మరో ఉడత లాక్కెళ్లడానికి ప్రయత్నం చేస్తోంది. చేసేదిలేక పక్షులన్నీ మరి చోటు కోసం ఎగిరి పోయాయి.

యజమాని తన ఏ‌సి కార్ లో తన ఇంటికి చేరుకున్నాడు. వేడివేడి నీళ్ళతో స్నానం చేసాడు. కడుపు నిండా తిన్నాడు. తన గదిలో ఏ‌సి వేసి హాయిగా పడుకున్నాడు. ఇళ్ళు కోల్పోయిన సలీం తన భార్యతో కలిసి చలికి వణుకుతూ ముడుక్కొని పడుకున్నాడు. రేపటి తన బ్రతుకు ఎలా వుంటుందో తెలియదు. వున్న గూళ్ళు పోయి , చీకటై పోయి, దారి కానరాక కాంక్రీట్ గోడలే ఆ పక్షులకు ఆ రాత్రికి దిక్కయ్యాయి. తన స్థలంలో తన బోర్డు పాతిన యజమానిది తప్పా? తనది కానీ స్థలంలో కొట్టు పెట్టుకున్న సలీంది తప్పా? ఇవేమీ తెలియక గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టుకున్న పక్షులది తప్పా? తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి?

కాకు వెంకట శివకుమార్ (హైదరాబాద్)

First Published:  12 Dec 2022 11:05 AM GMT
Next Story