Telugu Global
Arts & Literature

మన రచనల ఆయుష్షు ఎంత?

చదవడం ఒక అభిరుచి. ఈ అభిరుచి ఉన్నవారు పుస్తకాలు చదువుతారు. లేనివారు ఇతరేతర కాలక్షేపాలతో కాలాన్ని కరిగిస్తారు. సెకండ్‌ షోకు వెళ్ళి సినిమా చూడాలనే ఆసక్తి కలవారు ఉంటారు.

మన రచనల ఆయుష్షు ఎంత?
X

మన రచనల ఆయుష్షు ఎంత?

చదవడం ఒక అభిరుచి. ఈ అభిరుచి ఉన్నవారు పుస్తకాలు చదువుతారు. లేనివారు ఇతరేతర కాలక్షేపాలతో కాలాన్ని కరిగిస్తారు. సెకండ్‌ షోకు వెళ్ళి సినిమా చూడాలనే ఆసక్తి కలవారు ఉంటారు. రాత్రి ఒంటిగంటవరకు పుస్తకం చదువుతూ వుండిపోయేవారిని కూడా చూస్తాం. ఒకప్పుడు ప్రయాణాల్లో పేపర్లు, వీక్లీలు, నవలలు, కథల పుస్తకాలు కనిపించేవి. ఇపుడు మొబైల్స్‌ కనిపిస్తున్నాయి. ఈ మార్పు పట్ల ఫిర్యాదులక్కరలేదు. చాలామంది రచయితలు, కవులు - పుస్తకాలు చదివేవారు, కొనేవారు తగ్గిపోతున్నారని ఫిర్యాదు చేస్తుంటారు. వాపోతుంటారు. అయినా పుస్తకాలు వేయడం ఎవరూ మానరు. మానక్కర్లేదు కూడా. పుస్తకం అవసరం ఉన్నవారు చదువుతారు. లేనివారు అటువైపు చూడనే చూడరు. చదివే అలవాటు ఉన్నవారు కూడా అన్నీ చదవరు. తమ మనసుకు నచ్చితే, ఎక్కడో ఏదో వాక్యం మెప్పిస్తే, లేదా సదరు పుస్తకంతో అవసరం పడితే తప్ప ఆ పుస్తకం జోలికిపోరు, చదవరు, కొనరు.

ఉచితంగా ఇచ్చినంత మాత్రాన పుస్తకాలు చదవాలనేం లేదు. డయాబెటీస్‌ ఉన్న వ్యక్తికి స్వీట్‌ డబ్బా కానుకగా ఇస్తే ఏం చేస్తాడు. పక్క ఇంటివారికో, తన దగ్గరి పనివాళ్ళకో, మరెవరికో ఇచ్చేస్తాడు. చిన్న ముక్క కూడా తినరు. ఎందుకంటే అది తమకు అవసరం కానిదిగా భావిస్తారు కనుక. అలాగే ఉచితంగా పోగు పడే పుస్తకాలను ఏదో ఒకరోజు తూకానికి అమ్మివేస్తారు. మనం ఎంత ప్రేమగా అందించినప్పటికీ కొన్నాళ్ళయ్యాక పడేస్తారు. అవసరమయితే తప్ప ఒక పేరా కూడా చదవరు. అయినప్పటికీ రచయితలు, కవులు ఎందుకో రాయాలనుకుంటారు. మరెందుకో పుస్తకాలు వేసుకోవాలనుకుంటారు. 30 లేదా 40 వేల రూపాయలు ఖర్చు చేసి పుస్తకం అచ్చయ్యేగల స్థోమత కలవారు వేస్తారు. వేయడం వల్ల నష్టమేమీ లేదు. రకరకాల ఫంక్షన్ల పేరిట లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. చీర కట్టించడం, పంచె కట్టించడం పేరిట లక్షలు ఖర్చు చేయడం లానే పుస్తకాలు కూడా అచ్చేస్తారు. ఇండ్లలో జరిగే రకరకాల ఫంక్షన్ల మాదిరిగానే పుస్తకాల ఆవిష్కరణ సభలు జరుగుతాయి. సభానంతర సభలు ఘనమైన విందు వినోదాలతో వర్థిల్లుతాయి. ఖర్చు పెట్టగలిగిన వారి ఆనందం ఎందుకు కాదనాలి?

ఇంత చేసాక సదరు పుస్తకం గురించి చిన్న ప్రశంస, చిరు అవార్డు, అక్కడో ఇక్కడో నాలుగు సమీక్షలు, విమర్శ వ్యాసాలు రావాలని కోరుకోడం సహజం. వందమందికి పుస్తకాలు పంపితే... అందులో పది మంది అయినా నాలుగు మంచి మాటలు మాట్లాడాలని ఆశించడమూ తప్పు కాదు.

కానీ మనుషులతో అవసరమైతే తప్ప మాట్లాడని వారు, పుస్తకాలని కూడా అవసరమైతే తప్ప చదవరు. అందులో ఏదో ఆనందం, అక్కర ఉంటేనే చదువుతారు. అందుకని నిరాశ అక్కర్లేదు.

ప్రపంచంలో ఏదీ పూర్తిగా నశించదు. చరిత్రలోని అవశేషాలు ఏదో రూపంలో కొనసాగుతాయని ప్రఖ్యాత చరిత్రకారుడు డి.డి. కోశాంబి అంటారు. ఆదిమానవుల్లా బతికేవారు ఈ అత్యాధునిక యుగంలో ఉన్నట్టే పుస్తకాలు అరుదుగా చదివేవారు ఉంటారు. వారి కోసమే పత్రికలు, వెబ్‌సైట్లు, వాట్సాప్‌ గ్రూపులు, పుస్తకాల ప్రదర్శనలు జరుగుతుంటాయి. కోటిమందికి పైగా ఒకచోట జీవించే నగరంలో ఓ లక్ష మంది పదిరోజుల పుస్తకాల వేడుకకు హాజరు కావడం గొప్పనే కదా. నన్నయ మహాభారతం రాసినపుడు అక్షరాస్యులే తక్కువ. ఇవాళ ఇన్నేళ్ళ తరువాత లక్షలు, కోట్ల మంది మహాభారతం చదువుతున్నారు. కనుక పుస్తకాన్ని అచ్చు వేసే కవి, రచయిత తన వాచకాన్ని ఇపుడు కాకున్నా కొన్నేళ్ళకయినా జనాలు గుర్తించి చదువుతారని ఆశించడం, ఆశపడటం సహజం. ఆ ఆశ రచయితలనీ, కవులనీ బతికిస్తుంది. ఖరీదయినప్పటికీ వందల, వేల పుస్తకాలు అచ్చవుతున్నాయి. ఎవరు చదువుతారని కాదు, ఎపుడో ఒకసారి చదువుతారని ఎవరి పుస్తకాలు వారు అచ్చు వేసుకోవడం ఆనవాయితీ. కనుక సాహిత్య ప్రపంచంలో అద్యయనం తగ్గిపోతున్నదని ఎవరయినా వాపోయినా పట్టించుకోనక్కర్లేదు. ఎవరి ఆట వారు ఆడాల్సిందే.

టీవీషోల యాంకర్లుగా నాగార్జున, బాలకృష్ణ వంటి ఉద్ధండులు వస్తారని గతంలో ఎవరూ ఊహించలేదు. పెద్దనటులు బుల్లితెర వైపు చూడనే చూడకపోయేవారు గతంలో. కానీ అవసరం ఎటువైపయినా మనుషులని నడిపిస్తుంది. అందునా వాణిజ్యానికి చిన్నా పెద్దా తేడా లేదు. అందుకే టీవీ షోల హంగామాలో పెద్దనటుల ప్రవేశం అనివార్యమైంది. డబ్బులు వచ్చే పని చేయడానికి ఎవరూ వెనుకంజ వేయరు.

అక్షర ప్రపంచంలోనూ పెద్ద కవులు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి వేదిక మీద తమ పేరు కనిపించాలనుకునేవారిని చూస్తుంటాం. చిన్న వెబ్‌సైటులో, ఓ మారుమూల నుంచి వచ్చే చిన్న పత్రికలో కూడా తమ కవిత చూడాలనుకునే పేరుమోసిన కవులని గమనించవచ్చు. పెద్ద పత్తికలలోనే తమ కవిత అచ్చు కావాలని మిగతా వాటికి దూరంగా ఉండరు. అలాగే అవార్డులు వచ్చినా రాకున్నా అన్నిప్రకటనలకు స్పందించి పుస్తకాలు పంపిస్తారు. పాఠకులు ఎక్కడ ఏ మూలన ఉన్నా వారిని చేరుకోవాలన్న ఆరాటమే దీనికి మూలం.

అయితే తాము ఏం రాస్తున్నామో, కొత్తగా ఏమైనా చెబుతున్నామా, తాము చెప్పేది ఎవరయినా వింటున్నారా, తమ అక్షరాలు ఎవరినైనా ప్రభావితం చేస్తున్నాయా అని ఆలోచిస్తే బాగుండునని కొందరు అంటారు. కానీ వేగం నిలువనియ్యదు. ఇలా రాసి అలా పోస్టు చేసే సౌలభ్యం ఉన్న చోట నాలుగురోజులు నానబెట్టి, మరల మరల తిరగరాసే ఓపిక చాలామందికి ఉండదు. ఇది ఈ యుగపు ధోరణి. దీన్ని అర్థం చేసుకొని, తమలోకి తాము చూసుకునే వ్యవధానం రావాలంటే అరబస్తా ఉప్పు తినాలి. అంత సహనం లేదు కనుకనే తోసి పడేయటం సహజం. వాట్సాప్‌లలో ఇలా వచ్చిపడే చెత్తను క్లియర్‌ చాట్‌తో క్షణాల మీద తొలగించే సౌలభ్యమూ పాఠకులకు ఉంది. కనుక ఇవాళ్టి రచనకు డైలీ పేపర్‌కు వున్నంత ఆయుష్షు కూడా ఉండటం లేదు.

అయినా ఎవరి ప్రయత్నం వారు చేయాల్సిందే. ఒకనాడు కాళోజీనే కవి కాదన్నారు. కానీ కాలం పరుగులు తీసి కొన్ని దశాబ్దాలు గడిచాక కాళోజీ నామస్మరణ నిత్యకృత్యమైంది కదా. అందుకని కవిత్వానికీ, రచనలకీ కొలమానాలు ఉండవు. పాఠకులకు ఉండే అవసరమే వాటిని బతికిస్తుంది. ఆ అవసరం ఎపుడు ఎలా ఉంటుందో కచ్చితంగా చెప్పడమూ సాధ్యం కాదు. ఎవరి అనుభవాలని వాళ్ళు రాసుకున్నట్టుగా, ఎవరి పుస్తకాలు వాళ్ళు అచ్చు వేసుకొని లోకం మీదకు వదలాల్సిందే. కర్మ చేయి ఫలితాన్ని ఆశించకు అన్నట్టు, పుస్తకం అచ్చు వేయి, ఫలితాలని ఆశించకపోతే ఆరోగ్యంగా, హాయిగా ఉంటారు. మనోడే, మన కులపోడే, మన వాదం వాడే, మన భావజాలం వాడే, మనతో కలిసి మందు కొట్టేవాడే అయినా అవార్డు ఇవ్వలేదనో, నాలుగు వాక్యాలు రాయలేదనో హైరానా పడితే మిగిలేది బి.పి.,లు, షుగర్లే. రచన చేశాక, అచ్చు వేసాక ఏదీ ఆశించని స్థిరచిత్తం మానసిక, శారీరక ఆరోగ్యానికి మేలు.

- గుడిపాటి

First Published:  3 Dec 2022 10:38 AM GMT
Next Story