Telugu Global
Arts & Literature

"అపుడో-ఇపుడో"(జ్ఞాపకం)

అపుడో-ఇపుడో(జ్ఞాపకం)
X

అపుడు ఇరవై రోజుల ముందే

దీపావళి ని మోసు కొచ్చేవి ప్రత్యేక

సంచిక లు!!"వ.పా" చిత్రాలతో..

వహ్వా అనిపించే కథలతో..

వాకిట్లో ఎండబెట్టిన సూరేకారం, గంధకం,రజనులు!

చినుకులు పడితే అమ్మో!

తాటిగుల్లలు తిప్పుడుపొట్లాలకి,

మొవ్వతాటాకులు గుమ్మటాలకి,

జమ్ము పుల్లలు మతాబా

గొట్టాల తయారీకి,మందు కూరటానికీ,

సేకరణ పిల్లలదే!

ఇంటిల్లిపాదీ హడావిడే!

కొమ్ము మిఠాయి, తొక్కుడు లడ్డు తీపి తినాలి గా!

నరకచతుర్దశి-నలుగుస్నానాలు,

కొత్తబట్టలుకుట్టించటాలు!

వయసు, భయాలను బట్టి అగ్గి పుల్ల, పాము బిళ్ళ నుండి లక్ష్మి బాంబు దాకా!కాకరపూవొత్తి,మతాబా,ఏది కావాలి?

తాటాకుటపాకాయ,.సీమటపాకాయ, పేక, ఏదిపేల్చగలవో చూసుకో!

భూచక్రమా?విష్ణుచక్రమా?

నీకేది కావాలి?

"తిప్పు తిప్పు దీపావళి!

మళ్ళీ వచ్చే నాగులచవితి!"

జ్వలించే గోగుకాడల తిప్పుళ్ళు!

"నేనే కాల్చా భయంలేకుండా"

గర్వం తెచ్చేపండుగ!

జాగ్రత్త చెప్పే వృద్ధులు!

మరి ఇపుడో--

పగలంతా బుల్లితెరలో భాగవతాలు!!

"ఆన్ లైన్ అప్పచ్ఛులు"!

రెడీ మేడ్ డ్రెస్సు లు!

కాలుష్యభయంతోనరకాసురుడు

కొండెక్కా డనేమో ఆకాశంలో కెళ్ళేక్రాకర్స్!

రంగు రంగుల నిప్పురవ్వలవిన్యాసాలు!

ఎవరు కాలిస్తే ఏం?

మెడ ఎత్తి తిలకిస్తేనే దీపావళి!!

"వాట్సాప్"ల్లో శుభాకాంక్షలవెల్లువలు కురిపిస్తే నే దీపావళి!

డా.వేమూరి.సత్యవతి.

(విజయవాడ.)

First Published:  12 Nov 2023 9:28 AM GMT
Next Story