Telugu Global
Arts & Literature

భారత సుతుడా మేలుకో !

భారత సుతుడా మేలుకో !
X

1.తమదు లక్ష్యము చేరుకొరకని

వార్తలొండెడు పత్రికలతో

సత్యమాత్మకు హత్య నిత్యము

భరత సుతుడా మేలుకో !

2. జరిగినల్లరి యథాతథముగ

మరల మరలను టి.వి. చూపగ

కొత్త అల్లరి జరుగుచుండును

భరత సుతుడా మేలుకో !

3. చిన్ని పాపల బూతు పాటలు

పెద్ద పాపల బూతు డ్రెస్సులు

టి.వి. లోపల గొప్ప ప్రోగ్రాం

భరత సుతుడా మేలుకో !

4. చిన్ని బాలలకాయుక్షీణము

కలుగునట్లుగ మెచ్చుకొందురు

పెద్దవారలు టి.వి. లోపల

భరత సుతుడా మేలుకో !

5. న్యాయవాదియు న్యాయస్థానము

తీర్పు చెప్పెడు న్యాయమూర్తియు

గంపగుత్తగ 'మీడియా' యే

భరత సుతుడా మేలుకో !

6. ఓటు కొనడము పెట్టుబడిగా

దేశమమ్మెడు దుకాణాలను

నడుపు వారల పాలనమ్మిది

భరత సుతుడా మేలుకో !

7. ప్రజల ఓటుతో గెలిచియుండియు

ప్రజల ఇష్టము చెల్లదనియెడు

నీచులను మరి తరిమికొట్టగ

భరత సుతుడా మేలుకో !

8. ప్రజలనమ్మెడు వారలందరు

ప్రజలు నమ్మిన పెద్దమనుషులె

ద్రోహమన్నది వృత్తియైనది

భరత సుతుడా మేలుకో !

9. విత్తు సంకరముండవచ్చును

మట్టి సంకరముండ జాలదు

సంకరపు పాలనము వచ్చెను

భరత సుతుడా మేలుకో !

10. దేశమగ్నికి గుండమవగా

చలిని కాగుటకుద్యమించెడు

వారినెల్లరఁదునుము కొరకని

భరత సుతుడా మేలుకో !

- వరిగొండ కాంతారావు

First Published:  15 Aug 2023 3:35 AM GMT
Next Story