Telugu Global
Arts & Literature

సెంటిమెంట్ (కథ)

సెంటిమెంట్ (కథ)
X

శ్రీధర్, సత్యం ఒకే ఆఫీసులో అసిస్టెంట్ లు గా పనిచేస్తున్నారు. అందాల యామినిఅదే సెక్షన్లో టైపిస్ట్.

శ్రీధర్ యామినిని లోలోపలే ప్రేమిస్తు న్నాడు.అదీగాక హైదరాబాద్ వంటి సిటీలో భర్తకు తోడు భార్య సంపాదన గూడా వుంటే హేపీగా వుంటుందనే ఆలోచనా వుంది. తన మనసులో మాట చెప్పాలని వున్నా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ రోజులు దొర్లిస్తున్నాడు.

అయితే అనుకోకుండా ఓ చిక్కొచ్చిపడింది.

సత్యం ఈ విషయంలో ముందడుగు వేసితన తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి యామినినిచూపించాడనీ, త్వరలో వాళ్ళిద్దరికీ పెళ్ళిజరుగుతుందనీ అందరూ చెప్పుకోసాగారు.

శ్రీధర్ డీలా పడిపోయాడు. ఆప్తమిత్రుడు బ్రహ్మానందానికి చెప్పుకుని గొల్లుమన్నాడు.

"దీనికే అంత డీలా

అయిపోతావెందుకు?

అపాయాన్ని ఉపాయంతో జయించాలి!నీకు యామినితో పెళ్ళి జరగాలి అంతేగదా?" అన్నాడు బ్రహ్మానందం.

"అంతే! కానీ, ఇప్పుడెలా? వాడు చాలాఅడ్వాన్స్ గా వున్నాడే. ఆల్రెడీ పెళ్ళిచూపులైపోయాయి కూడానూ"

కూడానూ" విచారంగా అన్నాడు శ్రీధర్.

"ఇల్లలకగానే పండగకాదు. పెళ్ళిచూపులుఅవగానే పెళ్ళయిపోదు. దానికి బోలెడు తతంగం వుంది. నేను చక్రం అడ్డేస్తాగా !నువ్వేం దిగులుపడకు" "ఏం చేస్తావేం?" "ఏంచేస్తానో ఎలా చేస్తానో చూస్తూండు. మరి మనకి బీదర్ తీసుకెళ్ళిగ్రాండ్ పార్టీ ఇవ్వాలి సుమీ" అన్నాడు.బ్రహ్మానందం.

"దానికేవుంది? యామినితో నా పెళ్ళి కుదరాలేగానీ మన సెక్షన్ మొత్తాన్ని బీదర్తీసుకెళ్ళి పార్టీ ఇస్తా! అవునుగానీ ఎట్లాచక్రం అడ్డువేస్తావో చెప్పు" అన్నాడు శ్రీధర్

'సత్యంగాడికి జాతకాల పిచ్చి జోతిష్యంచాదస్తం బాగానే వున్నాయి.

అయితే డబ్బిచ్చి చూపించుకోని పిసినిగొట్టు. నాబోటి మిడిమిడి జ్ఞానంగల వాళ్ళని పట్టుకుంటుంటాడు. నేను ఈ మధ్య సరదాగాతెలుగు యూనివర్సిటీలో జ్యోతిష్యంలోడిప్లొమా చేసినప్పటినుంచీ నన్ను చంపుతునాడులే " "అయితే ఇప్పుడేంటి " "యామిని డేట్ ఆఫ్ బర్త్, వగైరాలన్నీ తీసుకుని చచ్చినట్టు రేపు నా దగ్గరకొస్తాడు.అప్పుడు నేను చక్రం అడ్డువేస్తాగా ఫినిష్.ఇక యామిని పేరెత్తడు" అన్నాడు బ్రహ్మానందం.

శ్రీధర్ వుబ్బి తబ్బిబ్బయ్యాడు. సత్యంతోయామిని పెళ్ళి తప్పిపోయినట్లు కలలు కనసాగాడు.

*****

ఆ మర్నాడు సత్యం తన సీట్లోనుంచి బ్రహ్మానందం దగ్గరికి వెళ్ళి చాలాసేపు గుసగుసలాడడం గమనిస్తూనే వున్నాడు శ్రీధర్.

సత్యం అటెళ్ళగానే శ్రీధర్ పరుగెత్తుకెళ్ళాడు.

"ఏం చెప్పావేం?" ఆత్రంగా అడిగాడు.

"సెంటిమెంట్ మీద కొట్టాను.

యామినితో పెళ్ళయితే నీ తల్లిదండ్రులకి ప్రాణ గండం అని చెప్పాను. ఎవరో ఒకరుగాని,లేదా ఇద్దరూ ఢాం అంటారని హడలగొట్టాను" అన్నాడు బ్రహ్మానందం.

"వాడు నీ మాటమీదే వుంటాడని నమ్మకం ఏమిటి? మరొకరికి ఆ జాతకంచూపిస్తే?" అనుమానంగా అడిగాడుశ్రీధర్.

"చస్తే చూపించడు పీనాసివెధవ" శ్రీధర్, బ్రహ్మానందానికి షేక్ హేండ్ ఇచ్చాడు.

"పద అట్లా హోటల్ కెళ్ళి స్వీట్ తిందాం"అన్నాడు శ్రీధర్.

****

వారంరోజుల తర్వాత బ్రహ్మానందం అంచనాలు తారుమారు చేస్తూ, శ్రీధర్ పేకమేడలు కూలుస్తూ సత్యం, యామినితో తనపెళ్ళికి ఆఫీసులో అందరికీ వెడ్డింగ్ కార్డులుపంచాడు.

బ్రహ్మానందం బిత్తరపోయాడు.

శ్రీధర్ కృంగిపోయాడు.

తర్వాత బ్రహ్మానందం, సత్యాన్ని ఒంటరిగా కలుసుకున్నాడు.

"ఏమిటోయ్ ఇది? " అన్నాడు.

సత్యం చిరునవ్వు నవ్వాడు.

"నువ్వు చెప్పింది గుర్తుంది గురూ!

అమ్మా, నాన్నలకి గండం అంటావా? ఎట్లాజరగాల్సివుంటే అట్లా జరుగుతుంది. జరిగేదాన్ని మనం ఆపలేం గదా! మాఅమ్మకి సుగర్. మా నాన్నకి సుగర్ తో బాటు బి.పీ. గూడా వుంది. డాక్టర్ల చుట్టూతిరగలేక

చస్తున్నాననుకో. ఆ టెస్టూ , ఈటెస్టూ అని డబ్బంతా తగలేయిస్తున్నారు.యామినితో పెళ్ళయ్యాకైనా వాళ్లకీ బాధల్నుంచి విముక్తి కలిగితే అంతకంటే కావల్సిందేవుంది గురూ!"

సత్యం మాటలకు బ్రహ్మానందానికి కళ్ళుగిర్రున తిరిగాయి.

-వాణిశ్రీ

First Published:  24 April 2023 7:19 AM GMT
Next Story