Telugu Global
Arts & Literature

ఆడంబరం లేని కవిత్వం : ఆగ్ని పుత్రి

ఆడంబరం లేని కవిత్వం : ఆగ్ని పుత్రి
X

ఆచార్య నాయని కృష్ణ కుమారి గారు జానపద వాజ్ఞ్మయం లో విశేషమైన కృషి చేసారు. వారు తమ సిద్ధాంతగ్రంథం “జానపదగేయగాథలు” ను 1977లో ప్రచురించారు. ఆ తరవాత ఆమె తన దృష్టి అంతాజానపదసాహి త్యంమీదేకేంద్రీకరించారు.

కృష్ణకుమారిగారు విద్యారంగం లో ఆచార్యులుగా ప్రసిద్ధులు. ఉత్తమ పరిశోధకులు. బహుముఖ మైన సాహిత్య సేవను కావించారు. విద్యార్థినిగా క్లాసులో రాసుకున్న నోట్సు ఆధారంగా. మొదటి రచన" ఆంధ్రుల కథ" ను రాసారు. ఉగ్గుబాలతో కవిత్వ రచనను ఆకళింపు చేసుకున్నారు. వారి తండ్రి గారు ప్రముఖ భావ కవి శ్రీ నాయని సుబ్బారావు గారు. "నా పుత్రీ విదుషీయశోవిసర విన్యాసమ్ములంబొంగితిన’’ నని తండ్రి గారి ప్రశంసలను పొందారు.

వారు అగ్ని పుత్రి,( 1978)

ఏంచెప్పను నేస్తం, (1988)

కవిత్వ సంపుటాలను వెలువరించారు.

25 సంవత్సరాల తరువాత సౌభద్ర భద్ర రూపం ను

రచించారు.వారు రచించిన "మానస లీల" పద్యకృతి.

కృష్ణ కుమారి గారు మొదటి కవితా సంపుటి ‘అగ్నిపుత్రి’ తండ్రి గారి ఎనభయ్యవ జన్మదినాన వారికి అంకితమిచ్చారు. వారి తొలికవితల్లో నాయని,విశ్వనాథ గారల ప్రభావం కనబడుతుంది

అగ్ని పుత్రి కి రాసిన ముందు మాటగా 'నాకవిత్వానికి నేను చేయబోయే వ్యాఖ్యానం కాదని’ చెప్పి, కేవలం దాన్ని పాఠకులు సరిగా అర్థం చేసుకోవడానికి, చేసినఅంతరంగావిష్కారం మాత్రమే’ నని అన్నారు .

కవి మాత్రమే తన అంత రంగ భావనలను విశదీకరించగలడని ఆమె భావించారు. అందుకనే సంపుటాలకు ముందు మాటను తామే రాసుకున్నారు. వారు తిక్కన కవిత్వాన్ని అధ్యయనం చేయ దలచినప్పుడు స్వయంగా ఆ కవి వచ్చి తన భావాలను వివరిస్తే బాగుండునని అనుకున్నారట . కవి స్వయంగా తన కవిత్వ ఉద్దేశాన్ని కవిత్వ తత్వాన్ని, వివరిస్తే చదువరికి ఆ కవిత్వం సులభ గ్రాహ్యం అవుతుందని చెప్పారు. నిఘంటువుల నాశ్రయించి అర్థంకాని పదాలను వెదకడాన్ని అంగీకరించరు.కవిత్వం వ్యక్తిత్వం భిన్నం కారాదని గదిలో కూర్చుని ఇతరులను ప్రేరేపించరాదని చెప్పారు .

"అనల్ప కల్పనా శిల్పం లేదు

అంగార తల్పం లేదు

నాకవిత తళతళల్లో

అసలేటి బంగారపుటిసుక

మిసమిసలు లేవు

అమృతం లేదు.

అనుభవంతో పరిమళించే

ఫల సంపెంగ లాంటి

అంతరంగం నిండిన నా కవితలోలోకంమీద అసహనం లేదు ."

అని తమ కవిత్వం సరళ సుందరమైనదని ప్రకటించారు. తాను కీర్తి ప్రతిష్టలనూ,ధనాన్నీ ఆశించి రాయలేదనీ, తనలోని స్ఫూర్తి ని వెల్లడించినదే తన కవిత్వమని చెప్పారు. కృష్ణ కుమారి గారి విశాఖలో విద్యార్థినిగా ఉన్నప్పుడే కాలాతీతవ్యక్తులు” రచయిత్రి, డా. పి. శ్రీదేవి గారితో పరిచయం అయింది. వారి తల్లి గారు అస్వస్థులు కాగా, శ్రీదేవి ఆమెకి చికిత్స చేసారు. . శ్రీదేవిగారి అకాలమరణం కృష్ణ కుమారి గారిని బలంగా కలచివేసింది. ఆ మనోవేదన తో “ఏం చెప్పను, నేస్తం” కవిత ను రాసారు. అదే పేరుతో రెండవ సంపుటాన్ని వెలువరించారు.

"ఆద్యంతాలకందకుండా

ఆవేశాకావేషాల

రంగులు పట్టని

అచ్ఛాత్మ స్వరూపవైన నేస్తం

ఏం చెప్పను నిన్ను గురించి

ఆపదల పడవలో ఎక్కి

ఆలోకపు టంచుల్ని మెట్టబోయిన

అమ్మను ఆపి

మళ్లీ మామధ్య వదిలిన

మృత్యుంజయవని చెప్పనా నిన్ను నేస్తం? "

అంటూ ఆవేదనను వెల్లడించారు. ..

"ఎప్పుడో ఒకనాడు

రెండు లోకాలు కలిసే

సరిహద్దు గీత మీద

నువ్వు నవ్వుతూ నాకెదురుగా వచ్చినప్పుడు

అంతరంగంలో నువ్వంటే

నాకెంత యిష్టమో

అంతా నిజంగానే చెప్తాను నేస్తం "-అంటూ మైత్రిని తలచి మళ్ళీ కలుస్తామనే ఆశా భవం తో ఊరడిల్లారు.

కృష్ణ కుమారి గారికి విశాఖ తో అనుబంధం "విశాఖ, నా నెచ్చెలి” అన్న కవితలో వ్యక్తం చేసారు

కర్పూర గంధస్థగిత

నిర్భర మరుద్వీచికలా

చల్లగా చుట్టుకునే

చెరపరాని స్మృతి విశాఖ

నాకూ ఈగడ్డకూ మధ్య

కాలం దించిన నీలితెరలు

భవనాలై రాజ మార్గాలై

కిటకిటలాడే

ఆశేష జనసందోహ సంభ్రమాలై......

Wedged by high rising waves/Surrounded by gigantic mountain rock/On this sea shore In this city of destiny my foot steps/Trace back years and years!!/The beauty of those shorelines/Along which I strolled/Still shining in me.

I am standing in front of you./Still fragrant with the sandal scent of knowledge/That was applied here. (Visakha Na Necceli) Dr. Vaidehi Sasidhar అనువాదం లో కూడా అద్వితీయమనిపించిన విశాఖ 'నాగర జీవన వైఖరి ఈనాటికీ ఆత్మీయమని పిస్తుంది.

వారు రాసిన "బొగ్గుపులుసు గాలి" కవిత లో తమపై వచ్చిన విమర్శలకు గట్టి సమాధాన మిచ్చి తమ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించారు.

కృష్ణ కుమారి గారు మారుతున్న ఆధునిక కాల ఘట్టం లో మారని సామాజిక దోషాలను ధైర్యం గా ప్రకటించారు. వారు వర్తమానం లో జీవించారు. నిరాశను తొలగదోసి భవితవ్యాన్ని దర్శించారు. తమలో అణువణువునా నిండిన దేశ ప్రేమను తెలిపారు. మనుషులను ప్రేమించారు. మానవత్వం ప్రధానాంశం గా కవిత్వ రచనను కావించారు. ఈమట్టి తొలకరి తడుపుకు చిలకరించిన వాసనల చిక్క దనంలో- అమ్మ వాత్సల్యపుకమ్మదనాన్ని" గాంచారు.

తమ కవిత్వ సంపుటం " సౌభద్ర భద్ర రూపం ను తల్లి హనుమాయమ్మ గారికి అంకితం ఇచ్చారు. క్రియా శీలమైన సాహిత్యవ్యాసంగంలో పాటు విశిష్టమైన వ్యక్తిత్వం కూడా సంతరించుకున్నారు కృష్ణ కుమారి గారు. కుటుంబవిలువలను నిర్లక్ష్యం చెయ్యని ఉత్తమురాలు.

గృహలక్ష్మి స్వర్ణకంకణం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉత్తమరచయిత్రి బహుమతి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ బహుమతి వంటి ఎన్నో పురస్కారాలు

అందుకున్నారు. దేశవిదేశాలు పర్యటించారు. లెక్కలేనన్ని సభలలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ అఖిలభారత ఆంధ్రరచయిత్రుల సభలు 1963లో ప్రారంభించారు. ఆరోజుల్లో ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారితో పాటు కార్యనిర్వాహకవర్గంలో ప్రముఖపాత్ర వహించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా

చేసిన కృష్ణకుమారి గారు 2016 జనవరి 30 న అస్తమించారు

రాజేశ్వరి దివాకర్ల

(వర్జినియ యు ఎస్)

First Published:  5 March 2023 10:59 AM GMT
Next Story