Telugu Global
Arts & Literature

నీ సుఖమే నే కోరుకున్నా..

నీ సుఖమే నే కోరుకున్నా..
X

నా మనసేం బాగాలేదు. నన్ను, నా బృందాన్ని ఇంటికి తీసుకు వచ్చిన రోజు ఈ ఇంటివాళ్ళంతా చూపిన ఆప్యాయతానురాగాలు ఇప్పుడు యేమయ్యాయి… ఎక్కడికి వెళ్ళాయి? ఆ రోజు మమ్మల్ని ఆహ్వానించడానికి ఇంటి సభ్యులందరూ ఇంటి బయటే మా రాక కోసం వేయి కళ్ళతో యెదురుచూశారు. ఇంటిపెద్దైన బామ్మగారైతే ఇంట్లోకి అడుగుపెట్టేముందు మాకు చక్కగా హారతిచ్చి, కుంకం పెట్టింది. ఆ ఇంట్లో మా రాకని ఒక పండగలాగా, తమ సంతోషాన్ని స్వీటు, కారాలతో ఇరుగుపొరుగు వారితో పంచుకున్నారు. ఆ తరువాత ఒక్కొక్కరే మమ్మల్ని ఆప్యాయంగా, యెక్కడ మాసిపోతామో అన్నట్లు నాజూకుగా తాకి, మురిసిపోయారు. తరువాత మా అందరికీ సన్నటి పొరను రక్షణగా తొడిగాక, ఒక్కొక్కరే వచ్చి, తమ చేతిలోకి అతి జాగ్రత్తగా తీసుకుని, అటు ఇటు తిప్పుతూ మురిపెంగా చూశారు.

ఆ తరువాత ఒక్కొక్కరే వారికి తెలిసినవారందరి పేర్లను మాకు పరిచయం చేశారు. వంతులవారిగా అందరూ మమ్మల్ని చేరదీసి, తమకు కావలసినవారితో హాయిగా కబుర్లాడసాగారు. మొదట్లో మాకు భలేగా అనిపించింది. పని ఒత్తిడి వలన వారు తమ స్నేహితులను, బంధువులను కలవలేకపోతున్న సమయంలో, కనీసం వారితో హాయిగా మాట్లాడడానికి మేము ఉపయోగపడ్డామని. మా జన్మ సార్థకమైందనుకున్నాము. శాయశక్తులా వారికి సహకరించాలని నిశ్చయించుకుని, వారి ప్రేమకు దాసోహమయ్యాము “ఖైదు మాంగీ థీ రిహాయీ తో నహీ మాంగీ థీ” అంటూ పాడుకుంటూ.

ఉదయం అలారం పెట్టడం దగ్గరనుంచి, ఆకాశవాణి కార్యక్రమాలతో పాటు రోజువారీగా ఇంటికి కావాలసిన వస్తువులను ఆన్లైన్ లో కొనడం మొదలుకొని, అందరికీ మేల్కొలుపుల పిలుపులు, యెక్కడెక్కడో ఉన్న స్నేహితులతో, బంధువులతో వీడియో కాల్ సమావేశాలు, పుట్టినరోజు, పెళ్ళిరోజు లాంటి వేడుకలకి అనవసరంగా ఆహ్వానపత్రికలకు డబ్బు వృథా చేయకుండా అందరికీ మా ద్వారా సందేశాలు పంపడం, సంగీతం, చిత్రలేఖనం లాంటి కళలు నేర్చుకోవడం, యూట్యూబ్ లో

తమకు తెలియని వంటలు, చిట్కాలు, ఆరోగ్యసూత్రాలు, పోషకాహార ప్రాముఖ్యం, వ్యర్థాలను పునర్వినిమయం చేయడం, పిల్లలైతే తమకు తెలియని పాఠాలని స్నేహితులనుండి మా ద్వారా తెలుసుకోవడం, తమ స్నేహితుల సందేహాలని తీర్చడం, ఇరుగు పొరుగువారికి, తెలియనివారికి కూడా రక్తదానం, అనాథలకి, పేదలకి, ఆశ్రమాలకి, అమృతాంగులకు విరాళం, చేతనైన సహాయసహకారాలని, సేవలని అందించడం లాంటివి మా మూలంగా జరిగినప్పుడు చాలా సంతోషం, కాస్త గర్వం కూడా కలిగేవి.

మేము వారందరికీ అరచేతిలో స్వర్గం చూపిస్తున్నామన్న భావనతో మా జన్మ చరితార్థమైందనుకున్నాను. కానీ ఆ భావన తప్పని కొంత కాలానికే ఋజువైంది. సంతోషంగా మొదలైన వారి సంభాషణలు క్రమంగా ఇతరులపై చాడీలు చెప్పడం, పని, అవసరం లేకున్నా అర్థంలేని ఉబుసుపోకు మాటలు, అవాకులు, చవాకులు, టీవీ సీరియల్స్ మీద వాదోపవాదాలు, ఇంట్లో అంతదాకా కలిసి ఉన్న సభ్యులందరూ మా రాకతో దూరంగా ఉన్నవారికి దగ్గరై, దగ్గరగా ఉన్నవారికి దూరమవడం, ఇంటికి అవసరంలేని వస్తువులను కొనడం, యెప్పుడూ సోషల్ మీడియాలకు బానిసలై అటు పెద్దలు ఇంటిని పట్టించుకోకపోవడం, వంట చేయడానికి సమయం లేక బయటి తిండ్లపై ఆధారపడడం, ఇటు పిల్లలు తమ చదువులను నిర్లక్ష్యం చేయడంలాంటివి జరిగేటప్పటికి ఇంట్లో అశాంతి నెలకొంది.

పిల్లలు తమని పట్టించుకొనేవారు లేకపోవడంతో అశ్లీల వీడియోలు చూడడం, అసభ్యమైన పనులకు వాడడంతో మా మనసులు వేయి వ్రక్కలయ్యాయి. వారు పరీక్షలలో తక్కువ మార్కులు తెచ్చుకోడానికి మేమొక కారణమైనందుకు చాల బాధ కలిగింది. కొన్నిసార్లు కోపం వచ్చినపుడు మమ్మల్ని ఒకళ్ళమీద ఒకళ్ళు విసిరేసుకుంటారు. మమ్మల్ని మెడకానించి చెవిదగ్గర పెట్టుకుని రెండు చేతులతో పనులు చేసుకుంటూ మాట్లాడడం, ఆ తరువాత మెడనొప్పి అని బాధపడడం. బండిని తోలుతూ వాడడం, రక్షణలేకుండా, ప్రమాదకరమైన స్థితులలో సెల్ఫీ లు తీసుకోవడం, చార్జీలలో పెట్టి, మమ్మల్ని వాడి తమ ప్రాణాలమీదకి తెచ్చుకోవడం లాంటి ప్రమాదకరమైన పనులు చేయడం వల్ల పెద్దలు మమ్మల్ని నానా మాటలు అనడం భరించలేకపోతున్నాము.

అంతదాకా వాళ్ళు యెక్కడికి వెళ్ళినా మమ్మల్ని తమతో తీసుకుని వెళుతుంటే, గర్వపడే మాకు ఇప్పుడు వారు చెడుదారిలో వెళుతున్నందుకు మేము కూడా ఒక కారణమయ్యామని తెలుసుకుని చింతించాము .కానీ ఈ విషయం వారి పెద్దలకి యెలా తెలపగలము ఈ సమస్యకి పరిష్యారమేమిటో తెలియలేదు.

అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. వారికి తోడ్పడటంలో బాగా అలసి, సొలసిన నాకు కూడా విశ్రాంతి కావలసివచ్చింది. మరిచిపోయిన సంబంధ బాంధవ్యాలను, ఆప్యాయతానురాగాలను వారికి రుచి చూపించి, విశ్వమానవ సౌభ్రాతృత్వం చాటడానికి, విశ్వశాంతి నెలకొల్పడానికి నేనొక సాధనమై, వారి అరచేతిలో ఖైదీనై, వారికి అన్ని వసతులు కల్పించి, నా జన్మ సార్థకం చేసుకోవాలనుకున్నా కానీ ఇలా వారే నాలో ఖైదీలవుతారని కలలో కూడా అనుకోలేదు. పరికరాలను వాడుకోవాలని, మనుషులను ప్రేమించాలన్నది మరిచి, పరికరాలని ప్రేమిస్తూ, మనుషులని విస్మరించండం యెంత బాధాకరం – అని నాలో నేనే మథనపడి , ఇక భరించలేక చివరికి ఒక రోజు వారికి సహాయపడడం పూర్తిగా మానేసి, మనసులో “నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా” అనుకుంటూ మౌనినయ్యాను శాశ్వతంగా.

ఏ సాంకేతిక నైపుణ్యమైనా మానవ ఉద్ధారణకి, విశ్వశాంతికే ఉపయోగపడాలి కానీ వినాశానికి కాదు కనుక నా బృందం కూడా నన్ను త్వరలో అనుసరించబోతోంది.

Dr. తిరుమల ఆముక్తమాల్యద, (చెన్నై)

First Published:  4 Feb 2023 10:58 AM GMT
Next Story