Telugu Global
Arts & Literature

తిమిరావళి! - అచ్యుతుని రాజ్యశ్రీ

తిమిరావళి! - అచ్యుతుని రాజ్యశ్రీ
X

ఆకలి విష్ణుచక్రాలు

గిర్రు గిర్రున ఉదరంలో!

ఉపాధి కోల్పోయిన

భూచక్రాల కాళ్ళతో!


నీటమునిగిన పైరులతో

రైతన్న కంట కాకరపువ్వొత్తు కన్నీటిబొట్లు!


క్రికెట్ఆట-కొత్త సినిమా

విడుదలరోజు

తొక్కిసతోపులాటల

సీమటపాసులు!


అక్రమ ధంధా స్కామ్

బుస్సునఎగిసే

కక్షకార్పణ్యాల

మతాబులు చిచ్చుబుడ్లు!


ఆకాశంలోకి

దూసుకుపోయే

అవినీతి అశాంతి

తారాజువ్వలు!


పుట్టుకొస్తున్న నరకాసురులు!

ఆది అంతం లేని

భోషాణాలు పట్టని

కుంభకోణాల టపాసులు

ఆవరిస్తున్న తిమిరావళి!


ప్రవచనాలపై దాడులు!

గుడిగోపురాలలో

రాజకీయాలు!


హేకృష్ణా !

ఒంటిగా వేణువు ఊదుతూ

లక్షల కోట్ల బిలియన్ల

తప్పులు చూస్తూ

అప్పుడే చక్రాన్ని విసురుతావో?

భగవద్గీతే బోధిస్తావో!?


జీవిత సమరంలో

చతికిలపడిన అర్జునులం!

నోరున్న మూగ మనసులం!

First Published:  23 Oct 2022 8:08 AM GMT
Next Story