Telugu Global
Arts & Literature

మ‌రో జ‌న్మ కోసం... (కవిత)

మ‌రో జ‌న్మ కోసం... (కవిత)
X

సావ‌ధానాన్నాశ్ర‌యించిన

మ‌నోనేత్రం

మ‌ళ్లీ ధార‌లు ధార‌లుగా

కురుస్తోంది

పుట్టుక తంతే

తెలియ‌ని ప్రాణం

ప‌సిప‌దాల రేకుల్లో

పాల‌లిపి పెద‌వుల‌లో పారాడుతున్న‌ది

మాట‌కు భాష

గాయానికి గేయం

అంత‌ర్నేత్రం చిలికిన

మ‌థ‌నం

క‌విత్వానికి అగ్నిగుండ‌మైంది

ఊపిరి బిగ‌బ‌ట్టిన భావం

గొంతు సంకెళ్ళ‌ను

త్రెంచుకుంది

చిహ్నాలే మిగ‌ల‌ని

ప్ర‌యాణంలో

అంబ‌రంలా

వ్రేళ్ళూనిన ప్ర‌శ్నలు

గుండె చెలిమ‌ల‌లో

నీళ్ళూరితే కూడా

తీర‌ని దాహార్తి

క‌టిక చీక‌టిని త‌రిమిన‌

కాంతి పుంజులోనూ

ఏదో వెలితి

రాలిప‌డ్డ రంగుల కోస‌మే

నిరంత‌ర అన్వేష‌ణ

బిగుసుకున్న రెక్క‌లు ఒంట‌రి ప‌క్షుల‌య్యాయి

మ‌నిషి త‌త్వం

మ‌ళ్ళీ మ‌ర‌ణించింది

క‌ల‌ల తోర‌ణాల‌పై లెక్క‌లేని

న‌ల్ల‌ని మ‌చ్చ‌ల గుత్తులు

సెల‌యేళ్ళ‌ను

ప్ర‌స‌వించిన పిడికిలి

దారి త‌ప్పిన మిణుగురులా తిరుగుతూనే ఉంది

మ‌న‌సు అల్లిక‌ల‌పై

తెర‌లుగా పారిన బీట‌లు

ఎదిగిన మొక్క ఇప్పుడు

ముదిరిన వియోగి

ఇక బెర‌డు క‌ట్టిన శ‌రీరానికి కొల‌మాన‌మేది ?

అర్థం కానిదేదో మ‌ళ్ళీ మిగిలిపోయింది

సాలీడు గూడు అల్లిక మ‌రోసారి మొద‌లైంది...

- తిరున‌గ‌రి శ్రీ‌నివాస్

First Published:  2 Feb 2023 10:03 AM GMT
Next Story