Telugu Global
Arts & Literature

క్షణ‌మొక స‌మీక్ష‌...!(కవిత)

క్షణ‌మొక స‌మీక్ష‌...!(కవిత)
X

క్షణ‌మొక స‌మీక్ష‌...!(కవిత)

నిరంత‌రంగా జ్వ‌లించ‌డం

సెల‌యేటిలా దూకడం

పిడికిలి విప్ప‌డం

ప‌రిధిలేని ప్ర‌పంచాన్ని విస్త‌రించ‌డం

న‌క్ష‌త్రాల‌కు రెక్క‌లు తొడిగి ఎగిసిరావ‌డం

అనంతానికి ఆనందాల‌ను చెక్క‌డం

ఒడ్డును తాకిన కెర‌టంలా సంచ‌లించిపోవ‌డం

అనుభూతుల ర‌స‌నిధులు దాచుకోవ‌డం

క‌ఠోర జ‌ల‌బింబాలెన్ని అడ్డు ప‌డ్డా

తీరాల్ని క‌లుపుతూ

స‌రికొత్త వంతెన‌ల్ని కట్టేయ‌డం

రాలిప‌డ్డ చోటే మొక్క‌గా మ‌ళ్ళీ పుట్ట‌డం

స‌మ‌గ‌తిలో స‌రితూకంగా ప్ర‌వ‌హించ‌డం

ప్ర‌లోభాల ప్ర‌మాద సూచిక‌ల

చివ‌రి పుట‌ల్ని చించేయ‌డం

ఇదో... అంతిమ గీతం రాయ‌ని యుద్ధ‌రంగం

మెతుకును ప‌ట్టుకుని బాగోగులు అడిగిన‌ట్టు

తాకితే గాని గాయాల జ‌డి తెలియ‌దు

జ‌ల‌గ‌ర్భాల నిర‌స‌న ఆవిష్కృతం కాదు

క‌ల్లోల ప్ర‌వాహాల విస్ఫోట‌నాల మ‌ధ్య

కూలిన‌ స్వ‌యం వేద‌న‌ల‌ను వినాలి

తుఫానులెన్ని వ‌చ్చినా

నిల‌బ‌డ్డ ధైర్యాన్ని వెత‌కాలి

అప్పుడే...

ల‌య‌ను ఏరుకోవ‌డానికి

మాట‌లు ప‌డ్డ ఆరాటం తెలుస్తుంది

వేళ్ళ‌లోంచి రాలిప‌డ్డ

అక్ష‌రాల క‌వాతు క‌న్పిస్తుంది

పాట‌రెక్క మీద లేచిన ఉద్య‌మం ఉద‌యిస్తుంది

పాత ఎప్పుడైనా ప్ర‌పంచంపై జ‌డ‌ముద్రే

మ‌నిషికి ప్ర‌తి సూర్యోద‌య‌మూ కొత్త‌దే

ర‌ణాలతో జీవ‌న్మ‌ర‌ణం సాగిస్తూ

ర‌క్త సంబంధాల‌ను రిక్త బంధాలుగా మారుస్తూ

ఉసురులు తీసే ఆత్మ‌లర‌హిత స‌మాజంలో

వివిధ జీవ‌న భాష‌ల్లోకి

ఎప్పుడూ మ‌నం అనువ‌దింప‌బ‌డుతుంటాం

అక్క‌డే అస్తిత్వ‌మూలాల్ని

వెదుక్కునే ప్ర‌శ్న మ‌ళ్ళీ పుడుతుంది

ఆక‌లి, అనుభ‌వం... దుఃఖం, అనుభూతి

అన్నీ తెలిసిన బ‌తుకు పాట‌ల మునులం మ‌నం

నేల పొక్కిలికి ఓదార్పు లేప‌నం అద్దిన మూల‌కాలం

త‌డి లేకుండా ఇసుక గుళ్ళ‌ను క‌ట్టి చూపిన వాళ్ళం

మ‌బ్బుల్ని మోస్తూ నిద్ర‌ల‌ను న‌టించ‌లేని వాళ్ళం

శ్ర‌మ సుఖం తెలిసిన మ‌ట్టి మనుషులం!

త‌డిక‌ళ్ళ నిరీక్షణ‌లోనూ

బ‌తుకుదారుల్ని ప‌రిచిన వాళ్ళం

మట్టి పొర‌ల్ని త‌నివారా త‌డిపిన మాన‌వ మేఘాలం

అన్నం ముద్ద‌గా మారిన మ‌ట్టి పురుగులం

పీఠిక‌లం.. నేల మీదికి పొంగిన ఆకుప‌చ్చ సముద్రాలం

మాటై, పాటై ప‌దునెక్కిన వాళ్ళం.. ప్ర‌తిధ్వ‌నించిన వాళ్ళం

మేం నినాదాలం...

సామూహిక స్వాప్నికులం

- తిరున‌గ‌రి శ్రీ‌నివాస్

First Published:  28 Dec 2022 6:48 AM GMT
Next Story