Telugu Global
Arts & Literature

తీరని కోరిక (కథ) - చలపాక ప్రకాష్

తీరని కోరిక (కథ) - చలపాక ప్రకాష్
X

శ్రీ చలపాక ప్రకాష్ కవి, రచయిత, వ్యాసకర్త, సంస్థ నిర్వాహకుడు.

1971 లో విజయవాడలో జన్మించారు .

రమ్యభారతి త్రైమాస పత్రిక వ్యవస్థాపకసంపాదకుల ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం ప్రధానకార్యదర్శి .విజయవాడలోని విద్యాధరపురం వాస్తవ్యులు.తెలుగు భాష ప్రధానాంశంగా ఎం.ఎ. పట్టాను పొందారు.వృత్తిరీత్యా స్వర్ణకారులు


మూడోకన్ను (కవిత్వం) :,ఈ కాలమ్‌ కథలు ,ప్రేమాభిమానాలు.చలపాక నానీలు.మూడు ముక్కలాట,జీవితం (కథలసంపుటి),హాస్యాభిషేకం,చలపాక ప్రకాష్ కార్టూన్లు-2,చూపు, ప్రళయం వంటి గ్రంథాలు వెలయించారు.


పిడుగులాంటి వార్త! తన ఆఫీస్‌ కొలిగ్‌ ప్రసాద్‌ చనిపోయాడన్న దుర్వార్త! నిన్నరాత్రి వరకు నిక్షేపంగా తమతో కలిసిఉన్న ప్రసాద్‌ హఠాత్తుగా మరణించడమేమిటి? నమ్మలేక పోతున్నాడు తాను. నిజానికి ప్రసాద్‌ కడిగిన మేలిమి 'ముత్యం'లాంటి వాడు. ఆఫీస్‌ వర్కే కాదు, సామాజిక రంగంలో కూడా తన అసమాన సేవలందిస్తూ నలుగురికీ ఆదర్శవంతుడిగా నిలిచేవాడు ప్రసాద్‌. మూడు పదులు దాటిన వయస్సులోనే ఆరు పదులు దాటినంత అనుభవం అతనిది.

ఒకసారి ఆఫీసులో తమ కొలిగ్‌ ఒకతను తమ బంధువుల కుర్రాడు యాక్సిడెంట్‌లో బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడని సెలవు కావాలని బాస్‌ని రిక్వెస్ట్‌ చేస్తున్న సందర్భంలో, అది విన్న ప్రసాద్‌ వెంటనే తాను చేస్తున్న పనిని పక్కవాడికి అప్పజెప్పి బాస్‌ని ఆ కొలిగ్‌తోపాటు తనకూ శెలవు ఇప్పించమని కోరి అతనితో హాస్పిటల్‌కి పయనమయ్యాడు.

''అతని బంధువుల కుర్రాడు చనిపోతే నీకెందుకురా అంత టెన్షను? ఆఫీసుకు శెలవు పెట్టి మరీ అతనితో వెళుతున్నావు?'' అడిగాడు తాను.

''నువ్వుకూడా నాకు తోడుగా రారా'' అంటూ నన్ను కంగారుపెట్టి మరీ వెంటపెట్టుకొని లాక్కుపోయాడు ప్రసాద్‌. ప్రసాద్‌ ఎందుకలా చేస్తున్నాడో నాకు మొదట అర్థం కాలేదు. కానీ హాస్పటల్‌కి వెళ్ళిన తర్వాత నాకు విషయం స్పష్టంగా అర్థమయ్యింది. చనిపోయిన పిల్లాడి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రసాద్‌ ధైర్యంగా తన మనసులో మాట చెప్పాడు. దానికి వాళ్ళు కోపంతో ముందుఊగి

పోయారు. ససేమిరీ అన్నారు. కాని ఒకో సందర్భంలో విషయాన్ని విడమిరిచి చెప్పి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నంత పని చేసాడు.

''వాళ్ళకిలేనిది నీకెందుకురా అంత బాధా?'' అడిగాను అక్కడదంతా చూస్తున్న నేను.

''ఎవరికి వాళ్లు అలా ఊరుకుంటే ఎలాగరా? నలుగురు పనికొచ్చే మంచి పని చెయ్యడానికి వాళ్ళని ఒప్పించడానికి ఈమాత్రం కష్టపడకపోతే ఎలాగరా?'' అన్నాడు ప్రసాద్‌.

బ్రెయిన్‌ డెడ్‌ అయిన కుర్రాడి బంధువులు ఒకొక్కరు వస్తున్నారు వాళ్ళ పెద్దల్ని ఓదార్చడానికి. వాళ్లు పరామర్శల మధ్య మళ్ళీ ఓపిగ్గా రిక్వెస్ట్‌ చేసాడు ప్రసాద్‌ ఆ తలిదండ్రులను.

''ఎన్నిసార్లు చెప్పాలి నీకు? కొడుకు అందకుండా పోయాడన్న బాధలోవున్న మాకు మరింత కడుపుకోతకు గురిచేస్తావా?'' కోపంతో అరిచారు బ్రెయిన్‌ డెడ్‌ అయిన కుర్రాడి తలిదండ్రులు.

ఇదంతా అక్కడ ఉండి చూస్తున్న బంధువుల్లో ఒక పెద్దాయన అడిగాడు ''ఏమిటయ్యా నీ న్యూసెన్స్‌'' అని. జరిగింది చెప్పాడు ప్రసాద్‌. ''పాపం ఈ కుర్రాడు ఎటూ యాక్సిడెంట్‌లో బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడు. కనీసం అతను బ్రతికి ఉండగా అతని అవయవాలు మరికొందరికి దానం చేస్తే అతను మరింత మందికి ఉపయోగపడిన వాడవుతాడు. చనిపోయినా ఎందుకు పనికిరాకుండా పోతున్న అతని దేహం మరిందరిలో ప్రవేశపెట్టడం ద్వారా అతను చిరంజీవిగా బ్రతికుంటాడు'' వివరంగా చెప్పాడు ప్రసాద్‌.

వయస్సులో ఉన్నవాళ్ళే నీ బాధని అర్థం చేసుకోవటడం లేదు. ఇక ఈ పెద్దాయన నిన్నెలా అర్థం చేసుకుంటాడురా. తిరిగి అతనినుండి చివాట్లు తినడం తప్పించి...'' చెప్పి ప్రసాద్‌ని పక్కకి లాక్కుపోయాను. కాని ప్రసాద్‌ అభ్యర్థనతో ఆ పెద్దాయనలో ఏమూలనో ఓ కదలిక వచ్చింది. ప్రసాద్‌ కోరుకున్న మార్పు స్పష్టంగా అతనిలో కనిపించింది.

అక్కడనుండి వేగంగా వెళ్ళి ఆ తలిదండ్రులతోపాటు డాక్టర్లతో మాట్లాడాడు. చివరికి బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఆ కుర్రాడి అవయవాలను దానం చెయ్యడానికి ఒప్పుకున్నారు. ఆ సంఘటనతో ప్రసాద్‌ తాను ఎదో సాధించానన్న తృప్తి అతను కనుసన్నల్లో కనిపించింది నాకు. ఇలా ఎందరో మరణించినవారి చేత వారి భౌతిక దేహాలను వృధాగా పోకుండా వాళ్ళ కుటుంబాలవాళ్ళని ఒప్పించి అవయవ దానాలు చెయ్యించాడు.

ఇంతలో కాలంలో మార్పు... కరోనా పడగ విప్పి ప్రపంచాన్ని వణికించింది. ఆ సమయంలో కూడా వలస జీవులకి తనకు తోచిన సాయం చేస్తూనే ఉన్నాడు ప్రసాద్‌. ఈ కాలంలో కష్టాలలో ఉన్నవారికి తనకు తోచిన సాయం చేస్తూనే వచ్చాడు .అటువంటి మంచి 'ముత్యం'లాంటి ప్రసాద్‌ హాఠాత్తుగా చనిపోవడమేమిటి? అతనికి ఏమైఉంటుంది? అర్థం కాక అతని ఇంటికి బయలుదేరాను.

విచిత్రం! ప్రసాద్‌ ఇంటిముందు మనుషుల అలికిడే లేదు. ఇంటికి తాళం వేసి ఉంది. ఎదురింటి వాళ్ళ కాలింగ్‌ బెల్‌ నొక్కాను విషయం కనుక్కుందామని. వాళ్ళు లోపలనుండే ''ఎవరూ'' అంటూ అడిచారు తప్పించి బైటకు రాలేదు. ప్రసాద్‌ స్నేహితుడినని... ప్రసాద్‌ చనిపోయాడని తెలిసి వచ్చానని, వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని ఆరా తీసాను.

వాళ్ళు దానికి ఏమాత్రం తలుపులు తియ్యకుండా లోపలినుండే సమాధానమిచ్చారు. ''మాకేం తెలియదు. గవర్నమెంట్‌ హాస్పటల్‌కి వెళ్లి అడగండి'' అని. అదేంటి వాడిని గవర్నమెంట్‌ హాస్పటల్‌కి తీసుకెళ్ళడమేంటీ? వాడెలా చనిపోయాడు? అసలు వీళ్ళు మనుషులేనా? ఎదురింటి సాటి మనిషి చనిపోతే ఏమాత్రం సానుభూతి లేకుండా తలుపులు బిడాయించుకుర్చున్నారు? కోపంతో అనుకుంటూ బైక్‌ స్టార్ట్‌ చేసి గవర్నమెంట్‌ హాస్పటల్‌కి బయలుదేరాను.

అక్కడ ఎoక్వైరీ చేస్తే ప్రసాద్‌ అనే వ్యక్తి హార్ట్‌ ఎటాక్‌తో జాయినయ్యాడని కొద్ది సేపటికే కరోనాతో చనిపోయాడని.. అతని బాడీని బరియర్‌ గ్రౌండ్స్‌కి తీసుకుపోయారని...

ఆమాటకు ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. నిన్న రాత్రివరకు మాతో తిరిగిన ప్రసాద్‌ చనిపోవడమేమిటి? ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఎదుటివారికీ కరోనా జాగ్రత్తలు మాటిమాటికీ చెప్పి ప్రచారం చేసే ప్రసాద్‌ కరోనాతో చనిపోవడమేమిటి? ఈ హఠాత్‌ పరిణామాలకి నీరసించి కుప్పకూలిపోయిన నేను, లేని ఓపికను తెచ్చుకొని బరియర్‌ గ్రౌండ్స్‌కి పరిగెట్టాను చివరి చూపులన్నా దక్కుతాయో లేవోనన్న ఆతృతతో..

తాను అక్కడికెళ్ళే సమయానికి ప్రసాద్‌ భౌతిక దేహాన్ని బయటకు కనిపించకుండా నల్లని కవర్లో చుట్టేసి భూమిలో పాతి పెడుతున్నారు. అక్కడకి చాలా దూరంలోనే మమ్మల్ని దగ్గరకి వెళ్ళకుండా ఆపివేసారు హాస్పిటల్‌, బరియర్‌ గ్రౌండ్‌ సిబ్బంది.

నాకే కాదు, కనీసం ప్రసాద్‌ భార్య, పిల్లలు కూడా చివరి చూపు చూడడానికి అవకాశం లేకుండా సుదూరంగా... ఎదో కలలో తెరమాటున చూస్తున్నట్లు చూస్తూ....చూసామనిపించాం. కళ్ళనుండి ధారలా పారుతున్న కన్నీటి చుక్కలు జలపాతంలా నేలను తడిపేస్తున్నాయి. ఎవరూ ఎవరికి ధైర్యం చెప్పే సాహసం చెయ్యలేకపోతున్నాం. ఎవరూ ఎవర్నీ పరామర్శించే మాటలు పేర్చలేకపోతున్నాం. అక్కడున్న అందరూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మౌనంగా రోధిస్తున్నాం.

పుట్టిన మనిషి గిట్టక మానడు. కాని, చిన్న వయస్సులో ఎవరూ ఊహించని రీతిలో చనిపోతే... అదీ కరోనా లాంటి చివరి చూపుకూడా నోచుకోలేని నిస్సహాయ చావుకు దారితీస్తే... ఎవర్ని నిందించాలి? ఎవర్ని నిలదీయాలి? కాలమా, నిన్ను అర్థం చేసుకోవడం ఎవరి వల్లా కాదు. ఎవరు ఎక్కడ ఎలా కలుస్తారో.. ఎవరు ఎక్కడ ఎలా ప్రాణాలు విడుస్తారో... నీకు మాత్రం తప్ప ఇంకెవ్వరికీ తెలియనే తెలియదు. అవయవ దానం ద్వారా ఎందరిలోనో చైతన్యం తీసుకొచ్చి మరెందరో ప్రాణాల్ని కాపాడిని ప్రసాద్‌ చివరికి తన భౌతిక దేహం ఎవరికి ఉపయోగపడకుండా 'కరోనా' కాటుతో పనికి రాకుండా పోవడాన్ని తలుచుకుంటుంటే నాకు ఏడుపు ఆగడం లేదు.

ఏమీ ఆశించకుండా నిస్వార్థ జీవిగా బ్రతికిన ప్రసాద్‌ 'తీరని కోరిక'ను ఏరకంగా తీర్చగలనో అర్థంకాక తలపట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాను.

First Published:  21 Oct 2022 6:53 AM GMT
Next Story