Telugu Global
Arts & Literature

మినీ కథల మెగా కథకుడు కీ.శే. కె.బి.కృష్ణ - విహారి

మినీ కథల మెగా కథకుడు కీ.శే. కె.బి.కృష్ణ - విహారి
X

కాకరపర్తి భగవాన్ కృష్ణ

- కె.బి.కృష్ణ.

తెలుగు పత్రికా పాఠకులకు

బాగా పరిచితమైన పేరు.

900 కథలు రాశారు. సుమారు

500 కథల్ని ప్రతిలిపిలో పొందుపరచగలిగినందుకు చాలా సంతోషంగా వుందని చెప్పుకున్నారు.

గాయత్రి, ఆమె నవ్వింది.

అభిషేకం,అనుబంధాలు ,

చిత్రలోకం వంటి కథాసంపుటాల్లోని కథలన్నీ ఆయన కథానిర్మాణ నైపుణ్యాన్ని వెల్లడిస్తాయి. సమాజాన్ని, సమస్యల్నీ నిశితంగా విశ్లేషించి కథాత్మకంగా చాలా కథలు రాశారు. వెట్టిచాకిరి, కులవివక్ష, వరకట్నం, అవినీతి, దగా, దోపిడి, బలహీనులపట్ల బలవంతుల కరుణరాహిత్యం వంటి అంశాలు ఆయా కథల్లో ఇతివృత్తాలైనాయి.

కృష్ణ కథావస్తువుల్లో- కుటుంబంలో వ్యతిరిక్త పరిణామాలు, ప్రభావమూ, పర్యవసానమూ-ఎంతో గాఢతతో చిత్రించిన ఉదాహరణలు చాలా వున్నాయి. అంతర్గతంగా ఆయన

ఈ విషయం గురించి - వ్యక్తిగతమైన బాధావ్యథల్నీ, సంవేదననీ పొందారని నాకు తెలుసు.

ప్రపంచ తెలుగు రచయితల సభల సందర్భంగా రెండుసార్లు ఆయన,

నేనూ చాలా సమయం గడిపాము. కాకినాడలో శ్రీ కంఠస్ఫూర్తి పుస్తకావిష్కరణ సందర్భంలోనూ

విడిగా కూర్చుని మాట్లాడుకున్నాము. ఆయన మనసులోని ఆవేదనని-

ఒకటి రెండు వాక్యాల్లో చెప్పాలంటే - ఒకటి: చాలామంది రచయితలు రచ్చగెలిచి ఇంట

గెలువలేకపోతున్నారనేది.

రెండవది: ఇంత సాహిత్య సృజన, అభిమానులు, వైయక్తికమైన అధ్యయనం... ఇవన్నీ ఎందుకు... పాపినేని శివశంకర్ ‘సముద్రం’ కథలో అన్నట్టు ‘ఈ సముద్రాన్ని ఎక్కడ పారబొయ్యను’ అనే సంవేదన.

ఈ రెండు మనస్తాత్విక సమస్యలకు - ఏవేవో సంఘటనల ఉదాహరణలతో ఒకసారి నాకు చాలా పెద్ద ఉత్తరం రాశారు! ఆయనలాంటి రచయితల్లో అసలైన బుద్ధిజీవుల్ని ఈ సమస్యలు బాధిస్తున్నాయనే అనిపిస్తుంది!

ఆయన అమ్మ కథలపై స్పెషలిస్ట్ గా కూడా గణింపబడి గౌరవం పొందారు. మినీ

కథావిరించిగా ఆయన

101 మినీ కథలతో అభిషేకం సంపుటి వచ్చింది. అలాగే ‘రివర్స్ గేర్’ కామెడి కథల సంపుటి ఉన్నది. జంతర్మంతర్, మోహనరాగం వంటి నవలలూ రాశారు.కాగా, కృష్ణ రాసిన అన్ని కథల్లో ఒకటి

అద్భుతమైన తేజోరేఖ -

‘ ఈ కొట్టుకు సెలవు లేదు’ అనేది. నేనా కథని - ఆంధ్రప్రభలో ఐదేళ్లు నడిచిన నా ధారావాహిక-పరిచయాలు పరామర్శల్లో - విశ్లేషించాను.

ఆయన దాన్ని చూసి పొంగిపోయారు.

అలాగే గొల్లపూడి మారుతీరావు, అద్దేపల్లి రామమోహనరావు,

వియోగి వంటి చాలామంది విమర్శకులు, సాహితీపరులు, రచయితలు -

ఆ కథారచయితనీ,

నన్నూ కూడా ఎంతో ప్రశంసించారు.

ఆ కథా పఠనం అనుభవైకవేద్యం

కనుక వేరే సాధించి చదవండి.

కృష్ణ కథలమీద ఒక పిహెచ్. డి,

రెండు ఎంఫిల్ లు వచ్చినట్లు గుర్తు. సుప్రసిద్ధ రచయిత, బహుముఖ ప్రజ్ఞావంతుడు

మాకినీడి సూర్యభాస్కర్

కృష్ణ సాహిత్యం మీద

‘మినీ కథకబ్రహ్మ-కె.బి.కృష్ణ’

అనే పుస్తకం రాసి ప్రచురించారు.

కృష్ణ కథారచనా రీతిలో ఒక ప్రత్యేకత-సందేశాత్మకంగా రచన చేయటం -శిల్పం, శైలి సరే- అంతకంటే ముఖ్యం వ్యక్తి చైతన్యావశ్యకత, తద్వారా సామాజికాభ్యుదయం-

అనేవి ఆయన నిబద్ధతా లక్షణాలు. ఈ కారణంవల్లనే చాలా కథల్లో ఆయన కథాశిల్పం కంటే, లౌకికపోకడ చిత్రణకు ప్రాధాన్యత నిచ్చినట్లు కనిపిస్తుంది.

కృష్ణ ‘నవరత్నాలు అని ఒక

ప్రయోగాత్మక కథా సంపుటిని ప్రచురించారు. 9 మంది కథకులు ఆయన 9 కథల్ని విశ్లేషిస్తూ వ్యాసాలు రాశారు. అందులో నాతో (విహారి )

బాటు -డా.కె.బి .లక్ష్మి , శ్రీయుతులుఎల్ .ఆర్ .స్వామి ,ఎలక్ట్రాన్ ,వాణిశ్రీ , వి .రాజారామ మోహన రావ్ ,

పాండ్రంకి సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఆజాద్ ,జయంతి వెంకటరమణ వున్నారు .

కృష్ణ గారి ఆ 9 కథలూ ప్లస్ మా తొమ్మిదిమంది కథకులకు నచ్చిన వారివారి కథలూ కూడా ఈ సంపుటిలో చేర్చి దాన్ని ఎంతో ప్రయోజనాత్మకం చేశారు.

ఇదొక వినూత్న విజయం!

(మే '10 కీర్తిశేషులు కె.బి.కృష్ణ ద్వితీయ వర్థంతి)

First Published:  10 May 2023 5:45 PM GMT
Next Story