Telugu Global
Arts & Literature

విలువల కళా సాహిత్య రూపం (శీలా) వీర్రాజు

శీలా వీర్రాజు గారి మరణం గురించి వినగానే మా ఆరు దశాబ్దాల అనుబంధాల్లోకి నా ఙాపకాలు తొలుస్తూ పోయాయి. ఆయన సహచరి, అంతే సున్నితమైన తాత్విక చింతనాపరురాలు శీలా సుభద్రాదేవి గారితో రేఖా మాత్రంగా ఆ స్మృతులు పంచుకుంటున్నప్పుడు నా గుండెలు బరువెక్కాయి.

విలువల కళా సాహిత్య రూపం (శీలా) వీర్రాజు
X

శీలా వీర్రాజు గారి మరణం గురించి వినగానే మా ఆరు దశాబ్దాల అనుబంధాల్లోకి నా ఙాపకాలు తొలుస్తూ పోయాయి. ఆయన సహచరి, అంతే సున్నితమైన తాత్విక చింతనాపరురాలు శీలా సుభద్రాదేవి గారితో రేఖా మాత్రంగా ఆ స్మృతులు పంచుకుంటున్నప్పుడు నా గుండెలు బరువెక్కాయి. ఆయన సహస్ర చంద్ర దర్శనాలకు మించి జీవితంలో ఎన్నో వెలుగు చీకట్లు చూసి ఒక సార్థక ఫలవంతమైన సంతృప్తితో వెళ్ళిపోయారు. ఆయన ఎన్నడూ నిరాశావాది కాదు. అసహనానికి ఎన్నడూ గురి కాలేదు. ఆయన వ్యాకుల‌త అంతా వ్యవస్థ గురించి, వ్యవస్థలో , ఆ ప్రభావంతో సమాజంలో ముఖ్యంగా మధ్యతరగతిలో, అందులోనూ బుద్దిజీవుల్లో పెరుగుతున్న స్థితి స్థాపకత, ఉదాసీనత తో కూడిన స్వార్థం, విలువల రాహిత్యం గురించి.

ఆయన వ్యక్తిగత జీవితం, సాహిత్య వ్యక్తిత్వం అంతా విలువల కోసం నిజాయితీగా చేసిన పోరాటం. 'మైనా' నవల మొదలు ఆయన వచన కవిత ప్రక్రియలోనే రాసిన స్వీయ జీవితం వరకు ఆయన సామాజిక, సాహిత్య జీవితం లోని ఈ విలువల పోరాటం ప్రతిఫలిస్తుంది.

ఎంత రూపమని పిట్టపిల్లంత మనిషి. కాని మగ్గం మీద ఎన్నో గజాలు నేసిన కలనేత వస్త్రం వంటి ఎన్నో పొరలు విప్పినా తరగని ప్రేమ, స్నేహం, ఆత్మీయ స్పర్శ. మృదువైన, దృఢమైన మాట ఎంత మెత్తటిదో అంత పదునైనది.

ఆయనింకా రాజమండ్రి నుంచి వచ్చిన కొత్తరోజుల్లో అనుకుంటాను. అప్పటికింకా కథల్లో, నవలల్లోనే ఉన్నాడేమో కనీసం అచ్చయి వచ్చిన గుర్తింపువల్ల.

నేనింకా ఉస్మానియా యూనివర్సిటీ వదలని క్యాంపస్ రోజులు 1960‍-64 ఆ తొలిదశ్కంలోనే మొదట ఫ్రీవర్స్ ఫ్రంట్ కవిత్వ పఠన సమావేశాల్లో కుందుర్తిగారితో పరిచయమైంది. 'తెలంగాణ' కావ్య రచయితగా, ఫ్రీవర్స్ ఫ్రంట్ నాయకుడుగా, వచన కవితా ఉద్యమకారుడిగా కుందుర్తి గారికి అప్పటికి నేను కవితాభిమానిని. ఒకవిధంగా ఫ్రీవర్స్ ఫ్రంట్ ఆ తర్వాత ప్రభుత్వ అనువాద శాఖలో ఆయనతో ఏర్పడిన‌ సాహచర్యంలో 'స్వఛ్చంద కవితా' సమర్ధకుడిగా నేనాయన ప్రక్రియలో సహగామినయ్యాను. అయితే ఆ విషయంలో కుందుర్తి కుడి భుజం మాత్రం శీలావీర్రాజు గారే.

క్యాంపస్ నుంచి కుందుర్తి గారిని కలవడానికి గాంధీభవన్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ అనువాద శాఖకు వెళ్ళినప్పుడు ఆ కార్యాలయం ఒక కవుల, కళాకారుల కూటమిగా పరిచయమైంది. కుందుర్తి గారు తన సహోద్యోగులు గోపాలచక్రవర్తి(గోపాలశాస్త్రి తెలుగు 'స్వతంత్ర' వారపత్రిక సంపాదకులు గోరాశాస్త్రి మేనల్లుడు అన‌డం కన్నా) వచన కవితలో తనదైన ముద్రవేసిన ఆజానుబాహుడు. శిలావీర్రాజులను పరిచయం చేసారు. వీర్రాజు గారిది శాంతి స్వరూపం. చల్లటి నీడలాంటి ప్రసన్నమైన ముఖం, ఆయన తాత్విక కళాకారుడని కాసేపు సంభాషణలోనే ఆ మిత భాషిత్వంలోనే, ఆ విశాలమైన నేత్రాల్లో, చిత్రలేఖనా లిపిలో ఆయన స్నేహాన్ని , ప్రేమను క్యాన్వాసుపై చిత్రిస్తున్నట్టు పరిచయమయ్యాడు కాని అనువాద వృత్తి జీవిగా కాదు. అందుకే ఆయన తర్వాత స్వఛ్చంద పదవీ విరమణ కూడా చేసి సాహిత్య, చిత్రకళా ప్రవృర్తినే పూర్తి కాలపు జీవన వ్యావృత్తిగా ఎంచుకున్నాడు. మా స్నేహం మాకు ఆఫీసులో కలయికలకే పరిమితం కాలేదు. ఆయన రాంకోటి ఇంటి నుంచి ప్రస్తుతం నివాసం దాకా అనివార్య విరామాలతోనే కావచ్చు చివరిదాకా కొనసాగింది.

కుందిర్తి వచన కవితా ప్రక్రియను ఒక ఉద్యమంగా నిర్వహించాడు. 'నయాగరా' కవుల నుంచి,నర్సారావుపేట నుంచి, కమ్యూనిస్టు స్నేహితుల నుంచి ఆయన ప్రక్రియను కూడా ఫ్రంట్ చేయగలిగాడు. ఐతే ఒక షరతు కవిత అయినా , కథ అయినా ఏదయినా వచన కవితలోనే జరగాలి గానీ . అది సామాజిక స్పృహ, చైతన్యం కలిగి , సామాజిక చలనానికి ప్రేరణ ఇచ్చేదిగా ఉండాలి. కుందుర్తి జీవితకాలంలోనూ , తన సమగ్ర‌ జీవిత కాలంలోనూ కుందిర్తి ఆశించిన దానికన్నా మించి అన్ని సాహిత్యరూపాలను, కథ, నవల చివరకుస్వీయ చరిత్ర వరకు పుష్కలంగానూ పరిపుష్టిగా చేసి చూపించిన‌ కమిటెడ్ రచయిత శీలా వీర్రాజు గారు. ఆయన అన్ని విధాల సవ్యసాచి. బహుసాచి కూడానేమో. ఆయన ఎంత కవో అంత గొప్ప చిత్రకారుడు. కవిత్వం రాయకుండా ఉన్న రోజు లేదు. బొమ్మలేయకుండా ఉన్నరోజు లేదు.నా హాస్టల్ మేట్ 'తిరుగబడు' కవి పి.సి.నరసింహారెడ్డి కవిగా 'ఐ' చిత్రకారుడుగా 'శుక్తి' తర్వాత సృజన చిత్రకళాకారుడుగా ఆధారపడింది శీలా వీర్రాజు గారి పైననే. క్యాంపస్ లో ఉండగానే శిష్టా జగన్నాధరావు ద్వారా 'నవత'(63-64) కవిత్వ పత్రిక తెచ్చిన సందర్భంలోనూ కుందుర్తి, వీర్రాజులతో నా అనుబంధం కొనసాగింది.

ఇంక జడ్చర్ల నుంచి సృజన ప్రారంభించినాక 1966 నుంచి మా అనుబంధం దృఢతరమైంది. ముఖ్యంగా చెరబండరాజు , శ్రీపతి, చంద్రలతో పాటు కాచీగూడ , బర్కత్ పురా, నారాయణగూడాలలో మా సాహిత్య సమావేశాల్లోనూ , విరసం సభల్లోనూ వీర్రాజు గారి సహకారం లేకుండా ఊహించలేము. అయితే అన్నింటా ఆయన ఒక అంతస్రవంతి. ఒక కాన్షన్స్ కీపర్. విశ్వసనీయంగా ఆధార పడిన స్నేహితుడు. నాకే కాదు సృజన 'సాహితీ మిత్రులు' అందరికీ ఆయన స్నేహితుడయ్యాడు. అది వే. నరసింహా రెడ్డి(వేనరె) కావచ్చు , గంట రామన్న(జి.రాంరెడ్డి) కావచ్చు, (అంపశయ్య) నవీన్ సరేసరి. కథా నవలా రచయితగా తన సాహిత్య కోవకే చెందిన వీర్రాజు గారికి స్నేహం కావడం ఆశ్చర్యం కాదు. అందుకే అంపశయ్య నవీన్ సంపాదకత్వంలో సృజన ఐదవ సంచిక (బుచ్చిబాబు స్మృతిలో)67 నవంబర్ లో వెలువరించినప్పుడు సృజన అక్షరాలు రాసి బుచ్చిబాబు ముఖచిత్రం వేసింది వీర్రాజుగారే. సృజన చలం సంచిక (1968మే), శ్రీశ్రీ సంచిక(ఫిబ్రవరి 1970)లు హైదరాబాద్ లో అచ్చు వేసినప్పుడు కూడా వీర్రాజు గారి సహాయ సహకారాలున్నాయి. ఇక విరసం ఆవిర్భావం మొదలు, వీరశైవ‌ హాస్టల్ లో 1971 లో రెండవ మహాసభలు, విప్లవకవుల అరెస్టులు, చెరబండరాజు అనారోగ్యం, శస్త్రచికిత్స, అమరత్వం అన్ని సందర్భాల్లోనూ వీర్రాజు గారి ఆత్మీయ అనుబంధం గాఢమవుతూ వచ్చింది.

కుందుర్తి 'ఫ్రీవర్స్ ఫ్రంట్' ద్వారా ఉత్తమ వచన కవితా సంపుటాలకు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు 1968 లో ప్రారంభించారు. అప్పటికే వెలువడిన‌ శీలావీర్రాజు గారి 'కొడి గట్టిన సూర్యుడు' కు మొట్టమొదటి అవార్డు రావడం కవితా న్యాయం. వరుసగా 'చలినెగళ్ళు'(68) చెరబండరాజు దిక్సూచికి అవార్డులు రావడం స్నేహ న్యాయం కావచ్చు. లేదా ఆలంకారిత‌ భాష‌లో కవిసమయాలు కావచ్చు. కుందుర్తి మరణించాక అవే ప్రమాణాలతో . అవే విలువలతో శీలావీర్రాజు గారు కుందుర్తి పెద్ద కుమారుడు సత్యమూర్తి గారితో కలిసి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులివ్వడం కొనసాగించారు. ఏ ప్రభుత్వ, సంస్థ సహకారం లేకుండా శీలావీర్రాజు గారి సాహిత్యమిత్రుల సహాయంతో తమ స్వంత ఖర్చులతో నిర్వహించే ఈ అవార్డు నిర్ణయం, సభా నిర్వహణ కార్యక్రమాలు ఎంత అరుదయిన ప్రమాణాలతో వీర్రాజుగారు నిర్వహించారంటే బహుశా ఇవ్వాళ తెలుగు కవిత్వ లోకంలో పురోగమన భావాలు కలిగిన ఏ కవీ ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డు పొందకుండా గుర్తింపు పొందలేదనుకుంటాను.

విరసం ఏర్పడిన తొలి రోజుల్లోనే నలబై మంది రచయితల ఇళ్ళ మీద దాడి జరిగినపుడు ఆ దాడిని ఖండిస్తూ సంతకాలు సేకరించే బాధ్యత చేపట్టిన వారు కుందుర్తి, చేకూరి రామారావు. శీలా వీర్రాజులు. ఆ తర్వాత మార్చ్, ఝంఝ కవితా సంకలనాల నిషేధాలు, విరసం రచయితల అరెస్టులు మొదలు రచయితలపై నిషేధాలు, నిర్బంధాలన్నింటినీ నిర్వ్దందంగా ఖండించిన రచయితల ముందు వరుసలో వీర్రాజుగారు ఉంటారు. ఆయన వెనుక సీట్లో కూర్చుంటారు కానీ నిర్బంధితుల, నిషేధితుల

పట్ల ఆయన అభిమానం వల్ల వాళ్ళ హృదయాల్లో మాత్రం ముందువరుసన ఉంటారు.

ఆయన సామాజిక జీవిత నేపథ్యం వల్ల కళా, సాహిత్య దృక్పథం వల్ల కళా సాహిత్య రంగానికి పరిమితం కాకుండా జీవితమంతా ప్రజాస్వామిక ఉద్యమాలలో , విలువలతో ఆయన నిలిచారు.

డా. జగతి, పొనుగోటి కృష్ణా రెడ్డి కుటుంబంతో ఇటు మా కుటుంబానికి , అటు సుభద్ర దేవి, వీర్రాజు గారి కుటుంబానికి ఉన్న అనుబంధం వల్ల మా కలియికలు, అనుబంధాలు మరెంతో గాఢమైనవి. ఎక్కువగా మేము మలక్ పేట, ముసారాంబాగ్, మూసీకి ఈవల నివాసం ఉండడం, కవి మిత్రుడు నాళేశ్వరం శంకరం తో కూడా అనుబంధం వల్ల పూలతీగ అల్లుకున్నట్లుగా మా స్నేహాలు అల్లుకున్నాయి. ముఖ్యంగా నా వ్యాపకాల వల్ల అవి చాలాకాలం కలుసుకోలేనివయినా, వాళ్ళ స్నేహాభావాలవల్ల దృఢంగానూ , స్థిరంగానూ నిలిచినవి.

హెర్నియా ఇన్ ఫెక్షన్ తో శుక్రవారం (27)న ఆసుపత్రిలో చేరిస్తే సోమవారం డిశ్చార్జి అయివచ్చారని నిన్న సాయంత్రం గుండెపోటుతో పోయారని చెప్పి మీ ఆరోగ్యం కూడాబాగుండటంలేదట కదా అని సుభద్రా దేవి గారు అడిగినప్పుడు నాకు హెర్నియా అపెండిక్స్ ఆపరేషన్ అయిందని నాకు చెప్పాలనిపించలేదు.

- వి.వి.

First Published:  2 Jun 2022 8:28 AM GMT
Next Story