Telugu Global
Arts & Literature

ఏం చేస్తావ్ ఆమెని (కవిత)

ఏం చేస్తావ్ ఆమెని (కవిత)
X

ఏం చేస్తావు ఆమెని

ఎత్తుకోగలవా, చేతుల్లో పెట్టుకు లాలించగలవా

నీ రెండు కళ్లను పీకి

ఆమె అరచేతుల్లో పెట్టగలవా

ఎన్నో జన్మల నుంచి నడుస్తున్న

ఆమె కాళ్ల కింద యింత దుమ్ము అవగలవా

ఏం చేస్తావు ఆమెని

నాలుక చివరతో ఆమె కంట్లోని నలకను తీయగలవా

గుండెలో విరిగిన ముల్లును

మునిపంటితో బయటికి లాగగలవా

భూమిపొరల్లో ఖనిజంగా ఉన్న

ఆమెను తవ్వి తలకెత్తుకోగలవా

చిన్నపిల్లలా భుజానెక్కించుకుని

విశ్వమంతా ఊరేగించగలవా

ఏం చేయగలవు నువ్వు

చెదిరిన ముఖంగలవాడివి

చీలిన నాలుకలవాడివి

తలాతోకా తెలియని

మొండెపుతనంతో ఊరేగుతున్నవాడివి

రహస్య సంకేతాల కేంద్రమయిన ఆమెను

ఛేదించగలవా చదవగలవా

చిరుమువ్వల పువ్వులు ధరించి

తిరుగుతున్న ఆమెను వినగలవా

వీనులతో చూడగలవా

ఆమెనేం చేయగలవు

'అడవి ఉప్పొంగిన రాత్రి'లాంటి ఆమెను

అందుకోగలవా అనువదించగలవా

ఆరుబయట వెన్నెట్లో

అమోఘంగా చలించే ఆమెను

తాకగలవా, తాకి తరించగలవా -

ఆమె ముందొక శిశువై

దిగంబరంగా నర్తించగలవా

ఆమె గుండెల్లో తల పెట్టుకుని దుఃఖించగలవా

ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి సేదదీరగలవా

నీ అస్తిత్వాన్ని మర్చిపోయి

ఆమె అస్తిత్వాన్ని గుర్తించగలవా

ఏం చేయగలవు

ఏం చేయలేని వెర్రిబాగులాడా

వెదకటం తెలియాలిరా

మనుషుల్లో మనుషుల్ని వెదకటం తెలియాలిరా

నీలో నువ్వు కొట్టుకుపోతున్న నిన్ను

ఆమె రక్షించగలదు

ఆమె కలదు, నువ్వు లేవు.

- కె .శివారెడ్డి

First Published:  5 Nov 2022 7:14 AM GMT
Next Story