Telugu Global
Arts & Literature

తెలుగే ఒక వెలుగు

తెలుగే ఒక వెలుగు
X

తెలుగే ఒక వెలుగు

పండువెన్నెల‌ను మ‌ధిస్తే

పుట్టిన వెన్న‌ముద్ద తెలుగు

భావావేశ క్షేత్రాన్ని దున్నినాట్లు వేస్తే

మొల‌చి నిలిచిన ప‌చ్చ‌ని చ‌క్క‌ని మొక్క తెలుగు

ఎప్ప‌టికప్పుడు ప‌రివ‌ర్త‌నమ‌వుతూనే

ప‌రిణ‌త భ‌వంతిలా మారిన ఆమూలాగ్రం తెలుగు

క‌టిక చీక‌ట్లో స‌న్న‌స‌న్న‌గా వెలుగుతూ

నేలపైకి దిగొచ్చిన మిణుగుర‌మ్మ తెలుగు

వాత్స‌ల్యం తెలుగు

వార‌స‌త్వం తెలుగు

గ‌ళం తెలుగు

ఎన్నో సుమ‌గ‌ళాల యుగ‌ళం తెలుగు

మూలాల్లోకి నాటుకుపోయి

అజ్ఙాత శూన్యాన్ని క‌డిగేసిన విజ్ఞాని తెలుగు

త‌నలో విహ‌రించే ప్ర‌తి మ‌న‌స్సును అమ్మై సంధానించిన

అనుసంధాన సేతువు తెలుగు

ప‌లికే ప్ర‌య‌త్నం ఎవ‌రు చేసినా

ఎద‌క‌త్తుకునే స్నేహం తెలుగు

భాషా ప‌దాలేవైనా అలవోక‌గా ఇముడ్చుకుని

త‌న విశాల‌త‌ను చాటే మ‌హాస‌ముద్రం తెలుగు

విశ్రాంతి కోరుకోని క్రియాశీలి తెలుగు

ప్ర‌స‌ర‌ణ శీలానికి ప‌ర్యాయ‌ప‌దం తెలుగు

న‌డ‌క తెలుగు

న‌డ‌వ‌డిక తెలుగు

ఉద్య‌మాల‌లో ఉద్వేగం తెలుగు

స‌మ‌భావం తెలుగు

సార్వ‌కాలిక యదార్థం తెలుగు

ఎండుటాకుల పాదుల్లో

చిగుళ్లు తొడుక్కున్న‌ ఆశ తెలుగు

మాటైనా పాటైనా

భ‌విష్య‌త్తుకు బాటైనా

ఆవిర్భ‌వించిన మ‌హోన్న‌త గ‌ర్భం తెలుగు

క‌మ్మ‌ద‌నం తెలుగు

అమ్మ‌త‌నం తెలుగు

ఆత్మీయ‌తారూపం తెలుగు

అజ‌రామ‌రం తెలుగు

విశ్వానికే స‌మున్న‌త భాషా సందేశం తెలుగు

ఆత్మ‌ల‌ను ప‌లికించగ‌లిగిన భాష తెలుగు

మౌన‌పాఠం తెలుగు

జ్ఞాన‌పీఠం తెలుగు

చంద్ర‌బింబం తెలుగు

పూర్ణ‌కుంభం తెలుగు

హృద‌య మందారం తెలుగు

ఉద‌య సూర్య‌బింబం తెలుగు

తెలుగే వెలుగు

తెలుగే ఓ గెలుపు

నాడైనా నేడైనా

ఇప్పుడైనా ఇంకెప్పుడైనా

గెలిచేది తెలుగు

నిలిచి వెలిగేది తెలుగు

- తిరున‌గ‌రి శ్రీ‌నివాస్

First Published:  23 Nov 2022 11:50 AM GMT
Next Story