Telugu Global
Arts & Literature

పద పోదాం

పద పోదాం
X

నిన్న మొన్నటిలానే ఉంది

నీలాకాశం కింద నీటి వాలుసాక్షిగా

మనిద్దరి మనసులు నింగికీ నేలకూ మధ్యన

సప్తవర్ణాల్లో ము౦చితీసి ఆరబెట్టుకున్నది

అంతరంగ సముద్రాల అల్లకల్లోలాల్లో మునిగితేలి

ఒడ్డునపడి విలవిల్లాడిన సమయాన

మాటలురాని మౌనం పెదవులు దాటని పరామర్శ

రాయబారాలు నడిపి ఓదార్చుక్కున క్షణం

ఇంకా వెచ్చ వెచ్చ గానే ఉంది

అప్పుడే పితికి తెచ్చిన పచ్చిపాల స్పర్శలా

నా మనసు నీ పాటల పరిమళం

చల్లిన మత్తులో మునిగి

పెదవి దాటిన ప్రతి పలుకూ నాచుట్టూ

నాటిన మల్లెపొదలై వెన్నెలలు పూసేవేళ

నీ చూపుల కొసలకు ఇష్టంగా చిక్కి

క౦టి పాపలో ఒదిగిపోయానే గాని

మరే వివరమూ గుర్తే రాలేదు

మెత్తని పలుకుల తొలితొలి చినుకుల్లో నాని

చిత్తడిగా మారిన హృదయం కరిగి కరిగి

ప్రవాహమై ము౦చెత్తి౦దే తప్ప

కోర్కెల పడగలు ఊహల్లోకూడా బుసలు కొట్టలేదు

కనురెప్పలు వాలితే చాలు

గతం వీధుల్లో మనిద్దరమే

చేతులు పట్టుకు తిరుగుతూ ఉ౦టాము

క్షణం ఆదమరచినా చెక్కిలిపై

నెమలీక స్పర్శలా నీ వేలికొసల లాలి౦పు

ఉక్కిరిబిక్కిరి చేస్తు౦ది కదా

పాపం ఈ లోకానికేం తెలుసు

నాచుట్టూ ఒక నీడై నువ్వే చెట్టులా మొలిచావని

పదును పదాలు విసిరి గాయపరచాలని చూస్తారు

ఎందుకు మనకీ జంతు సఫారీ

కొమ్ములు మొలిచి, మెడలు సాగి

చారలు గీరుకు పంజాలు విసిరే

ఈ క్రూర సాంగత్యాలు

పద పోదాం మన పచ్చని ప్రేమ వనాలలోకి

పరవశాల్లోకి.

- స్వాతి శ్రీపాద

First Published:  11 April 2023 9:41 AM GMT
Next Story