Telugu Global
Arts & Literature

దగ్గరితనం

దగ్గరితనం
X

వద్దన్నా వినకుండా మారాం చేస్తుంది.

అచ్చంగా పసిపాపలానే బుంగమూతిపెట్టుకుని

ఎంత కోపగించుకుందామన్నా

ఎప్పటికప్పుడు మనసు మెత్తబడి

నీ చుట్టూనే తూనీగలా పరిభ్రమిస్తుంది.

అర్ధంతరంగా వదిలేసివెళ్ళిన ఆత్మ ఒకటి

తలపులుగానో తలిరాకు పలకరింపుగానో

తడిసి ముద్ద చేసే తొలకరి చినుకులుగానో

పలకరిస్తూనే ఉంటుంది.

అగరుపొగల సువాసనై ఉక్కిరిబిక్కిరి చేస్తూ

స్మృతుల డోలికల్లో కాస్సేపు

నింగి నడి మధ్యన నీ చుట్టూ నీడవుతూ

మరికాస్సేపు నేలరహదారుల్లో

చేతులు చాచిన నీరెండ మెరుపునవుతూ

తొలగని మోహ పరవశాల మొహరింపు

సందర్భమే కావాలా, సాన్నిహిత్యం కొలుచుకుందుకు

తెరలూ కలవరాలూ లేని కలవరింతలు చాలవూ

కనురెప్పపాటు జీవన సమయాన

ఎందుకు ఒక లిప్తైనా ఏమరుపాటు?

- స్వాతి శ్రీపాద

Next Story