Telugu Global
Arts & Literature

ప్రాయశ్చిత్తం (కథ)

ప్రాయశ్చిత్తం (కథ)
X

ఇరవై నాలుగ్గంటలూ కంటికి రెప్పలా చూసుకునే అటెండర్ శీనయ్య. ఎపుడు ఏమి కావలసి వచ్చినా క్షణాల్లో సమకూరే ఏర్పాటు. ప్రతి పూటా పక్క మార్చి, ఆహ్లాదంగా అనిపించే లేలేత రంగుల బెడ్ షీట్లలో పరిశుభ్రంగా ఉంచే సౌకర్యం. ఎదురుగా టీవీ. మ్యూజిక్ సిస్టమ్ లో స్పీకర్లనుండి సన్నగా వినవచ్చే తనకిష్టమైన పాటలు. అయినా నారాయణకు సంతృప్తిగా లేదు.

కూతురి మొహం చూసి నెలరోజులు దాటి పోయింది. అమెరికాలో ఉన్న కొడుకు అస్సలు అజాపజా లేడు. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ఇలా మంచానికి అంకితమయాక ఒకసారి వచ్చి వెళ్ళాడు. అంతే. పదేళ్లక్రితమే జీవనం చాలించిన సహధర్మ చారిణి సక్కుబాయి గుర్తుకు వచ్చింది. పాపం ఇరవై నాలుగ్గంటలూ పూజా పునస్కారాలూ, దైవ కార్యాలూ తప్ప మరోధ్యాస ఉండేది కాదు.

చిన్నతనం గుర్తుకు వచ్చింది నారాయణకు. అరకొర సౌకర్యాలతో ఉన్న ఇల్లు. అవసరాలకు చాలని జీతం అయినా ఇంటి నిండా పిల్లలే. అవును అదేమిటో తండ్రి చక్కని ఉద్యోగంలో ఉన్నా అర్ధం లేని ఛాదస్తం. పిల్లలను భగవంతుడే ఇస్తాడట.అదీ ఏడాదీ ఏడాదిన్నరకు ఒకరు చొప్పున.

నారాయణకు పైన ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు, వెనకాల నలుగురు తమ్ముళ్ళు మేం తీసిపోయామా అంటూ నలుగురు చెల్లెళ్ళు. ఒక్కోరికి ఒక జత బట్టలు ఉండటమే గగనం గా ఉండేది. వీధిబడిలో చదువులు.

ప్రతి పూటా అన్నం పప్పుచారు. కూర వండిన రోజు పండగే. అలాటి స్థితి నించి ఇలా బెడ్ రిడెన్ అయి కూడా విలాస వంతంగా బ్రతక గలగటం అదృష్టమా? దురదృష్టమా?

మాట స్పష్టంగా రాదు, కాలూ చెయ్యీ ఒకవైపు పనిచెయ్యవు. లేచి కూర్చునే శక్తీ లేదు. అయినా ...ఉన్న బెంగల్లా ఒకటే. కనీసం కూతురు ఒక్కసారైనా వచ్చి పలకరించదు.బయటి నుండి అన్నీ అమర్చడమే తప్ప ఎదురుపడదు.

వెంటనే మనసు ప్రశ్నించింది. మీ అమ్మకు నువ్వేం సేవలు చేసావు? ఇదీ చెయ్యలేదుగా?అవును. చెయ్యగల స్థోమతు ఉండీ , హంగూ ఆర్భాటమూ ఉండీ చెయ్యలేదు. తనకు ఫేవర్ గా లేదనేగా?

తండ్రి అర్ధంతరంగా పోయాక కుటుంబ భారం అందరి నెత్తినా పడ్డాక, నువ్వూ నేననే అహంభావం, అహంకారం ఒకటేమిటీ?

నిజానికి ఆ రోజున తండ్రి నానాగడ్డీ కరిచి, డబ్బులిచ్చి తనకు ఉద్యోగం ఇప్పించక పోతేఈ హోదాలూ ఇవీ ఉండేవా?అత్తెసరు మార్కులతో బీకామ్ పాసయిన వాడికి ఈ దర్పం సాధ్యమా?

నిజమే, తలీ తండ్రికి ఇవ్వవలసినంత విలువ ఇవ్వలేదు. గంపెడు పిల్లలను కని వారికి కనీస సౌకర్యాలు కల్పించలేని తండ్రి పైన కోపం. అందరినీ సమానంగా చూడని తల్లిపైన కోపం.తనకు పోటీగా ఉన్నారని అన్నదమ్ములమీద కోపం. పెళ్ళాం పిల్లలకు కాకుండా తోడబుట్టిన వారికి పెట్టవలసి రావ డం వల్ల ఉక్రోశం.

ఏదేమైనా డబ్బు యావ ఆరునూరైనా సంపాదించి తీరాలన్న దురాశ పెరిగిపోయాయి.

గదిలోకి ఎవరో వచ్చిన శబ్దానికి కళ్ళు తెరిచి చూశాడు.కూతురు, ఒకసారి అన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసి, తండ్రి వంక ఒక చూపు విసిరి వెళ్లబోయింది.

" అమ్మా !సారు మీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు." శీనయ్య చెప్పాడు.

'నాకు తెలుసు 'అన్నట్టుగా తలఊపి, " చెప్తాను, రాత్రి మీ ఆదుర్దాకి సమాధానం చెబుతాను" అంటూ వెళ్ళిపోయింది.

కంటి చివర జారిన కన్నీళ్ళను శీనయ్య టిష్యూ పేపర్ తో తుడిచాడు.

****

రాత్రి బాగా పొద్దుపోయాక గదిలోకి వచ్చింది కూతురు. శీనయ్యను కాస్సేపు బయట తిరిగి రమ్మని పంపింది.తండ్రి పక్కన స్టూల్ మీద కూచుని అతని కళ్ళల్లో కి కళ్ళు పెట్టి చూసింది.

నింపాదిగా వెంట తెచ్చిన పెన్ డ్రైవ్ లాప్ టాప్ లో పెట్టి ఆన్ చేసింది.

లేచి గది మూలన ఉన్న వేజ్ లో పూలను సరిచేస్తూ నిల్చుంది.

"నాన్నా,ఇలా పిలవాలని కూడా లేదు. కాని నువ్వు నా బయలాజికల్ తండ్రివి కదా, మరి పిలవాలిగా ? పిలవక పోడానికి ఏం తప్పు చేశానని అడుగుతావేమో - చేసావు.

మా మీద నీకు అపారమైన ప్రేమ ఉండవచ్చుగాక, మాకు స్వర్గ సౌఖ్యాలు అందించాలని అనుకోవచ్చుగాక, అందుకోసం హాలాహలం గొంతులో దాచుకునే పరమ శివుడివి అయినా తప్పు లేదు కాని వేలాది మంది ఆశలు జీవితాలు ఫణంగా పెట్టి మాకు ఏర్ర్పరచిన పూల బాటలు విషం కాక అమృతం చిందుతాయని ఎలా అనుకున్నావు?

అన్నయ్య రాడని అంటావు, వాడికి అచ్చు నీ పోలికలే. నువ్వు నీ తలిదండ్రులను గౌరవించావా? పక్కనే ఉండి వారి యోగ క్షేమాలు విచారించావా? ఎప్పుడూ కోపంగా చూపులూ ,తూపుల్లా మాటలే కదా, నీకు రక్త మాంసాలూ , మనసూ జీవితమూ ఇచ్చినవారికి నువ్వు చూపిన కృతఘ్నత అది.

మమ్మల్ని ఇద్దరినీ బాగా చదివించాననీ , విలాసవంతమైన జీవితం ఇచ్చాననీ అంటావు. తెలిసీ తెలియని వయసులో అవి గొప్ప అనుకున్నాము.కాని నీకు తెలియదు నువ్వు చేసిన పాపాలు నీడల్లా మమ్మల్ని కమ్ముకుంటాయని.

అమెరికాలో వాడు చేసిన రోడ్ యాక్సిడెంట్ కారణంగా బలై పోయిన కుటుంబాలు ఎన్నో తెలుసా నీకు సరిగ్గా పదహారు.

వాడు అక్కడ యావజ్జీవ కారాగారంలో ఉన్నాడు వాడి భార్య పిల్లలు వాడిని అసహ్యించుకుని తెగతెంపులు చేసుకున్నారు.

ఇహ నా సంగతి !నిజమే కోట్లు వెచ్చించి వరుణ్ణి కొని తెచ్చావు గాని, నీ పాపాలు మా పై కురిపించి శాపాలు మార్చలేవుగా, మా అదృష్టాన్ని కొనలేవుగా? పెళ్ళైన రెండేళ్ళకే సరిగ్గా పిల్లవాడి ఏడాది పుట్టిన రోజునాడే ఆయన సెరెబ్రల్ పాల్సీ తో మంచానికి అతుక్కుపోతే ఏమన్నావు, డబ్బుంది గనకే అన్నీ మానేజ్ చెయ్యగలనని కదూ...

ఆ పుట్టిన ఒక్కగా నొక్క నలుసు పెరుగుదల లేని మెదడు, ఆటిజమ్ తో బాధలు అవీ నీపాపాల చలవే.

సిగ్గుగా ఉంది, నువ్వు తండ్రివని చెప్పుకుందుకు, చెరువుల్లో స్థలాలు అమ్మిన వారికి అనుమతి నిస్తూ ఎన్నికోట్లు వెనకేశావో కాని, పెద్ద వర్షపు తాకిడికి నగరం నగరం సముద్రమై ఎన్ని జీవాలు అల్లాడి పోయాయో వారి ఉసురు ఊరికే పోతుందా?

నా మెడకు గుది బండలా మంచం మీద శవంలా నీ అల్లుడు, నడుస్తున్న పాపాల ప్రతి రూపంలా నా కొడుకు, ఇప్పుడు నువ్వు. ఆత్మ హత్య చేసుకుందుకు కూడా వీల్లేని ప్రేమ పాశం.ఇప్పుడూ నువ్వు వెనకేసిన కోట్లు నా జీవితాన్ని సరిదిద్దుతాయా?

దీనికి బదులు ఒక్క పూట తిండి పెట్టినా, కలో గంజో తాగి , వీధి లైట్ల కింద చదువుకున్నా, అదీ లేకపోతే నాలుగిళ్లలో పని చేసుకున్నా మనశ్శాంతిగా ఉండే దాన్నేమో.

అందుకే , నీ కోట్లు నీ అవసరాలకే వాడుతున్నా. ఎన్నేళ్ళు అనుభవిస్తావో అనుభవించు. వేలాది జీవితాల శాపనార్ధాలు కదా. నీ తరువాత నీ ఆస్తులన్నీ అనాధ సంస్థలకే.అందుకే కష్టపడిసంపాదించుకుంటున్నా నా మొగుడి కోసం ,నా పిల్లడి కోసం,నా కోసం.

నీకు తెలియదు నీగది బయటి ప్రపంచం - నాలుగ్గదుల పెంకుటిల్లు, నవ్వారు మంచం మీద నడవలేని నా భర్త, నాపిల్లడి తో పాటు మరో నలుగురు మానసిక వికలాంగుల కేర్ టేకింగ్ అదే నా జీవనాధారం నా ప్రపంచం.

నీ వైభోగాలు నువ్వే అనుభవించు.

మరో జన్మంటూ ఉంటే నీతి నియమాలున్న తండ్రికి బిడ్డగా తలెత్తుకు బ్రతకాలని ఆశతో నా ఈ ప్రాయశ్చిత్తం.

ఇంక చెప్పేందుకేముంది ఎదురు చూపులే.

రికార్డింగ్ ఆగిపోగానే వెనక్కు తిరిగిన అమ్మాయి కళ్ళలో వరద గోదావరి.

చటుక్కున లాప్ టాప్ తీసుకుని మౌనంగా వెళ్లిపోయింది.

తల గోడకేసి కొట్టుకుందా మనిపించినా అతని శరీరం సహకరించదు. శీనయ్య వచ్చి తుడిస్తేగాని పీక్కుపోయిన బుగ్గల్లో ఆగిన కన్నీటి చెలమ ఆరదు.

-స్వాతి శ్రీపాద

First Published:  2 Feb 2023 10:14 AM GMT
Next Story