Telugu Global
Arts & Literature

శ్రీశ్రీ మహాప్రస్థానం అనంతం

శ్రీశ్రీ మహాప్రస్థానం అనంతం
X

ఒక పుస్తకం జీవితాన్ని ప్రభావితం చేస్తుందా అంటే అది నేరుగా చేయదు.

మనం ఒక వయసులో బాల్య ప్రభావాల కుటుంబం నుంచి విడిగా చదువు పేర, స్నేహితుల పేర సమాజంలో సంచరిస్తున్నప్పుడు బహిర్గతంగా తెలియని ఘర్షణఒకటి అనివార్యంగా లోన జరుగుతూనే వుంటుంది. కుటుంబ వాతావరణ శక్తి,సమాజ వాతావరణ శక్తి ఒక్కటిగా వుండవు. ఎదుగుతున్న క్రమంలో పరస్పరం ఆ శక్తులూ సంఘర్షిస్తాయి. చరిత్ర అంటే ఓ గతి, ఓ నడక, ఒక రూపుదిద్దుకున్న క్రమం అనుకునేట్టయితే మనదైన వ్యక్తిత్వం వికసించే మార్గంలో స్ఫూర్తినిచ్చే అంశాలలోపుస్తకాలు, మనుషులు కూడా వుంటారు. వాటిల్లో ఒక మలుపుదశలో కంఠదఘ్నంగాప్రభావం వేయగల స్ఫూర్తిదాయకమైన గ్రంథమూ, వ్యక్తి ఎవరో వుంటారనుకోవచ్చు.

మతం చెప్పినా, గతి తార్కిక భౌతికవాదం చెప్పినా 'నిన్ను నువ్వు తెలుసుకో”అనే చెప్పాయి. తన వివాహ విషయంలోనూ, మతావలంబన విషయంలోనూ తనదైనస్వేచ్ఛను స్వీకరించి అనుసరించుకోలేనివాడు స్వతంత్ర జీవి అనడానికి తగడు.

తప్పటడుగుల బాల్యం నుండి పాఠశాలలో ప్రవేశించడంతోనే గురువులు, స్నేహితులతో కలిసి సాగే సామాజిక జీవనం మొదలౌతుంది. విద్యారంగానికి అందుకే ఎనలేనిప్రాధాన్యత వుంది. చిన్నప్పుడు చదువుకున్నవే చితిమంటల వరకు గుర్తుంటాయి.బతుకుపుస్తకంలో వివిధ పుటలుంటాయి. కొన్ని సువర్ణాక్షరాలవి. ప్రతి పుటలోవివిధ రసానుభవాలుంటాయి. కొన్ని పేజీలు పదేపదే దాచుకోవాలనిపిస్తే, కొన్ని చింపేస్తే బాగుండు అనిపించవచ్చు. కానీ చరిత్ర చింపేస్తే చిరిగిపోదు. చెరిపేస్తే

చెరిగిపోదు. తనను తాను మభ్యపెట్టుకుని, మరుగుపరుచుకుని లోకానికివిదితమయ్యేవాడు చిత్తశుద్ధీ. నిజాయితీలేని వాడవుతాడు. తనదయినా కూడాచారిత్రక యథార్ధం, సత్యం నిష్కర్షగా చెప్పుకోగలగాలి. రచనకూ, జీవితానికీ అనుకునేదానికీ ఆచరించేదానికీ పొంతన కనిపించినప్పుడు వ్యక్తి ఎక్కువ సమాదరణీయుడవుతాడు. 'అనకాపల్లికి దారి' అని దారి చూపించేబోర్డు అనకాపల్లివెళ్లదన్నట్లుగా -'మార్గదర్శి' ఆ మార్గంలో నడిపించేవాడేగానీ, తాను నడిచేవాడు.

కాకపోయే సందర్భాలుంటాయి. అందుకనే ఒక గ్రంథం నుండి గానీ, మనిషి నుండిగానీ స్ఫూర్తి పొందడం అనేది పొందేవాడిననుసరించి వుంటుంది.

సూర్యుడు తనకిరణాన్ని మణిమీదా, మట్టిముద్ద మీదా ఒకేలా ప్రసరింపచేస్తాడు. ఆ కిరణంతో మణి ప్రకాశిస్తుంది. మట్టిముద్ద ప్రకాశించదు. అంటే అది వాటివాటి తీరునుబట్టేకదా!

పదహారేళ్ల ప్రాయంలో అప్పుడప్పుడే లోకాన్ని సమాజజీవిగా అర్థం చేసుకుంటున్న రోజుల్లో 1967 లో నాకు శ్రీశ్రీ 'మహాప్రస్థానం' చదవడం

తటస్థించింది. ఇక్కడ అనివార్యంగా నా గురించి కొంత చెప్పాలి. కర్నూలు కాక హైదరాబాద్ రాజధానిగా మద్రాసు నుండి తరలివచ్చిన కుటుంబమే మాది. మా నాన్నగారు కీ.శే. అల్లంరాజు కామేశ్వరరావు గారు వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగి.

1956 లో ఒకటో తరగతిలో హైదరాబాదులోనే చేరాను .సుల్తాన్ బజార్ క్లాక్ టవర్ ఎదురుగా ఓ చిన్న పాఠశాలలోనే చేరాను. ఆ తర్వాత కేశవ మెమోరియల్ స్కూల్లో ఆరవతరగతి చదివాను. మలక పేట కాలనీలో మా నాన్నగారికి క్వార్టర్ కేటాయించడంతో మలక్పేట ప్రభుత్వోన్నత పాఠశాలలోనే 7వ తరగతిలో చేరిచదువుకుంటూ ఆనాటి హెచ్.ఎస్.సి.పాసయ్యాను. స్కూల్లో ఉండగానే గ్రంథాలయం పీరియడ్ వుండడం వల్ల బాల సాహిత్య గ్రంథాలేవో ఉపాధ్యాయులు చదివించిన గుర్తు. పదేళ్ల ప్రాయంలోనే 'విజ్ఞాన జ్యోతి' అనే లిఖిత పత్రిక నిర్వహించాను.

తెలుగు మీద మమకారం, కృష్ణమూర్తి, వెంకటేశ్వరశర్మగార్లు కలిగించారు. హెచ్.ఎస్.సితర్వాత వివేకవర్థినీ కళాశాలలో పి.యు.సి సైన్స్ గ్రూప్ లో చేరాను. హైస్కూల్తెలుగు మీడియం నుండి కాలేజీలో ఒక్కసారిగా ఆంగ్లమాధ్యమం కావడంతో బెంబేలుపడ్డాను. లెక్కలూ, సైన్సూలేని విద్య కోసం వెదికి ఆంధ్ర సారస్వత పరిషత్తుప్రాచ్యకళాశాలలో డిప్.ఓ.యల్ (డిప్లమో ఇన్ ఓరియంటల్ లాంగ్వేజెస్)లో చేరాను.

పి.యు.సిలో తెలుగు క్లాసు ఒకటే నిడదవోలు సర్వేశ్వరరావుగారిది ఆసక్తికరంగావుండేది. పాఠ్య గ్రంథంలోని పానుగంటివారి 'స్వభాష' నన్ను తొలుతగా ఆకర్షించిన వచన రచన.

నాకు 1967 వ సంవత్సరంలోనే ప్రభావోపేతమైన 'యువభారతి' సంస్థతో అనుకోకుండా పరిచయం కలిగింది. సుల్తాన్ బజార్లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో ప్రతినెలా మొదటి, మూడవ ఆదివారాలలో జరిగే సాహిత్య సమావేశాల గురించి 'డెక్కన్ క్రానికల్' సిటీడైరీలో చూసి సాహిత్య సమావేశం చూడడానికి వెళ్లిన నాకు, అతిథులను కూడా వారిలో కలుపుకుని, కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసిన యువభారతి తీరు నచ్చింది.

కాళోజీ నారాయణరావు, ఇరివెంటి కృష్ణమూర్తి వంటి ప్రముఖులున్న ఆ తొలి సమావేశంలోనే అప్పటికప్పుడు వచ్చిన అంశంపై రెండు నిమిషాలు మాట్లాడే 'క్లుప్తగోష్టి'లో పాల్గొని, బ్యాలెట్ ద్వారా ఉత్తమవక్తగా ఎంపికైన నాకు అందిన పుస్తక బహుమతి శ్రీశ్రీ 'మహాప్రస్థానం'. 1930 ల్లోటైఫాయిడ్ జ్వరం పడిలేచాక శ్రీశ్రీ మహప్రస్థానం గీతాలు రాస్తే-'మహాప్రస్థానం'

చదవడంతోనే నేను జ్వరానపడి క్షాళనమయ్యాను. నాకెంతో స్ఫూర్తిదాయకమైంది ఆకవిత్వం. నా సాహిత్యాభిలాషను ప్రేరేపించడమే కాదు 'ఒక సకలాతీత శక్తి ఉన్నట్లా లేనట్టా' అనే సంశయగ్రస్తుడనై వున్న తరుణంలో, వ్యక్తి కన్నా సమష్టి విలువను ప్రబోధిస్తూ, సమాజ హితచింతనతో నేను సైతం ప్రపంచాగ్నికి ఒక సమిధనన్న

లక్ష్యాన్ని ప్రేరేపించి నన్ను అభ్యుదయ పధగామిగా ఆనాడు వామపక్ష భావాలవైపుమొగ్గేలా చేసింది మహాప్రస్థానమే. 'దేశ చరిత్రలు' చదివి ఇతిహాసపు చీకటి కోణం

అట్టడుగున పడి కన్పించని కథలన్నీ కావాలిప్పుడు దాచేస్తే దాగని సత్యం అనిగ్రహించాను. యువభారతి సంస్థలో నాడు కాళోజీ 'జీవనగీత' (ఖలీల్ జిబ్రాన్ దప్రాఫెటు అనువాదం) ప్రచురణకు శుద్ధ ప్రతి తయారు చేయడంలో పాల్గొంటూ

కాళోజీగారితో యువకునిగా సాన్నిహిత్యాన్ని, ఉత్తర ప్రత్యుత్తరాలను పొందగలిగాను.చదివింది ప్రాచ్యవిద్యయే అయినా ప్రాచ్య కళాశాల ప్రిన్సిపాల్ గా వున్న ఆచార్య

కె.కె. రంగనాథాచార్యులుగారు అభ్యుదయ భావోద్దీపన కలిగించారు. యువభారతివంగపల్లి విశ్వనాథంగారు 'సమ్యక్ దృష్టి' అలవడేందుకు హేతువయ్యారు. అందుకే

శ్రీశ్రీ కవిత్వంవైపు నేను ఆకర్షితుడిని, ప్రభావితుడిని అయ్యానేగానీ వ్యక్తిగా ఆయనవీరాభిమానిని కాలేదు సరికదా ఆ సిగరెట్లు, మద్యపానాలకు దూరంగా వున్నాను.

"ఆయన రాసి పారేసిన కవిత్వం గుబాళిస్తుండగా తాగి పారేసిన సీసాల సంగతి మనకెందుకు” అన్న కాళోజీ మాటల్లా మహాప్రస్థానానికి ప్రభావితుడిని అయ్యాను గానీ శ్రీశ్రీ కవిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కలగలుపు చేసుకుని కలవరపడ లేదు నేను.

సైకిల్

కొనుక్కోమని ఇంట్లో రెండు వందల రూపాయలిస్తే ఆ డబ్బులతో మద్రాసుకు రైల్లో వెళ్లి శ్రీశ్రీని ఆయన ఇంట్లో తాగి తూలుతూ అనంతంగా రంగనాయకమ్మను దూషిస్తున్న

స్థితిలో చూసిన యువ మిత్రుడు సుబ్బారావు తిరిగి వచ్చి ఆ విషయం మాతో చెప్పాకమహాకవుల జీవితాలను కాక, వారి రచనలను, అందులోని భావాలను గ్రహించిఅనుష్టించడమే సబబు అనిపించింది.

మహాప్రస్థానంలోని ప్రతి కవితా నాకు

స్ఫూర్తిమంతమే. లోకం తీరునంతా

"నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే

నిబిడాశ్చర్యంతో వీరు

నెత్తురు కక్కుకుంటూ

నేలకు రాలిపోతే

నిర్దాక్షిణ్యంగా వీరే" అంటూ

'ఆః' అన్న ఒక్క అక్షరాన్ని అర్ధవంతమైన

అద్భుత శీర్షికగా నిలిపి స్వరోచ్చారణలోని దాని ఉత్థానపతనాలతో రూపుకట్టించిన

తీరు ప్రశంసలకూ, తిరస్కారాలకూ అతీతంగా వ్యక్తి తనదైన నిబద్ధతతో, నిమగ్నతతో వుండాలని సందేశిస్తూనే ఉంది.

‘జగన్నాథ రథచక్రాలు’ ను శ్రీశ్రీ బ్రాహ్మణీక భావజాలంతో కవిత్వీకరించాడని

ఆ మధ్య ఏదో పత్రికలో ఓ దళితకవి రాశాడు. 'సర్వం జగన్నాథం అని' తాడితులపీడితుల కోసం ఎప్పటికప్పుడు విధ్వంసం నుండి కొత్త సృష్టి చేసుకునే దారు విగ్రహాలతో

జరిగే జగన్నాథ రథయాత్ర సర్వమానవ ఏకీకరణ సంకేతం అనే నా ప్రగాఢ భావన.

“పతితులార భ్రష్టులార బాధాసర్పదష్టులార పనికిమాలి బ్రతుకు కాలి శనిదేవత రథ

చక్రపుటిరుసులలో పడి నలిగిన హీనులార!" అంటూ వారిని సముద్ధరించేందుకే వారి కోసమే కలంపట్టి ఆకాశపు దారివెంట హడావిడిగా వెళ్లిపోయే రథచక్రపు

ప్రళయఘోషను భూమార్గం పట్టించిన అసలైన సామ్యవాదకవి శ్రీశ్రీ.

'మరోప్రపంచం మరోప్రపంచం మరోప్రపంచం పిలిచింది' అని

సమాజాంతర్గతంగానే వున్న నవ్యలోకాన్ని ఆవిష్కరించి ఎర్రబావుటా ధగధగలను ,హెూమజ్వాలల భుగభుగలను సమ్యక్ దృష్టితో సమీకరించి సహస్రవృత్తుల సమస్త

చిహ్నాలు తాను విరచించే నవీనగీతికి ప్రాణం, ప్రణవంగా స్వీకరించి తెలుగు కవిత్వానికి ఒక అంతర్జాతీయ దృక్పథాన్ని, 'ప్రపంచ కార్మికులారా ఏకంకండు' అని విశ్వజనీన

శ్రామిక ఏకీకరణను లాంగ్ మార్చ్ చేయించాడు. నవయుగ భగవద్గీతా ఝంఝను సాయుధ విప్లవ రథసారథియై పలికించాడు.

1930-1940 ల మధ్య రాసిన మహాప్రస్థానం గీతాలే శ్రీశ్రీని మహాకవిని

చేశాయి. "1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. నాటి నుంచీ తెలుగు సాహిత్యాన్ని నేను నడిపిస్తున్నా. ఈ శతాబ్దం నాది” అన్న శ్రీశ్రీ ఆత్మవిశ్వాసానికి

'మహాప్రస్థానం'లోని గీతాలే ప్రాతిపదికలు. ఈ తర్వాత సర్రియలిస్టు ధోరణిలో రాసిన 'ఖడ్గసృష్టి' కవితలు, 'విచిత్రమే సౌందర్యం, సౌందర్యమే విచిత్రం' అన్న దాఖలాగా

సిరిసిరిమువ్వ, లిమరిక్కులు, ప్రాసక్రీడలు (సిప్రాలి) వంటి ప్రయోగవైవిధ్యాలు,

సినీగీతాలు ఏవయినా అతనికీర్తికి అనుషంగికాలే. మరోప్రస్థానం నాటికే సమాజ ధోరణులు మారిపోయాయి.

మహాప్రస్థానంతో శ్రీశ్రీ ఏకోన్ముఖంగా సంకల్పించినసామ్యవాదశీల 'మరో ప్రపంచం'- విరసంతో అంతర్జాతీయ దృక్పథం నుండిఎడమైపోయింది. సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు కార్మికలోకపు కళ్యాణానికి,

శ్రామికలోకపు సౌభాగ్యానికి ఏకీకృతం కావడం పోయి కుల, మత, ప్రాంత, యాసలపేరిట వేటి కుంపట్లు అవి వేరుగా పెట్టుకోవడం ప్రబలింది. అందుకే శ్రీశ్రీ కవిత్వంలోఒక సమగ్రతా వీక్షణాన్ని దర్శించక- తమ కుల, వర్గ, ప్రాంత అస్తిత్వం - స్త్రీ వాద,దళిత స్పృహలు లేవు గనుక శ్రీశ్రీ 'రిలెవెన్సీ' నేడు లేదనీ శ్రీశ్రీ గారికి నిజంగానే‘నూరేళ్ళు నిండాయి’ అనేవారు బయలుదేరారు.

కాలం పరిణామ శీలమైంది. గతి శీలమైంది. శ్రీశ్రీలో లేనిదాన్ని వెదుక్కోవడంబదులు, శ్రీశ్రీలో ఉన్నదాన్నీ. అది కలిగించే స్ఫూర్తిని, మహాప్రస్థాన కవిత్వపుఆచరణాత్మక ఆవేశాన్ని అందిపుచ్చుకోవడం విజ్ఞత. శ్రీశ్రీ శూన్యాన్ని పూరించినవాడు.

శ్రీశ్రీ తర్వాత శ్రీశ్రీ స్ఫూర్తితో శూన్యం ఏర్పడే వీలేలేదు. 'మహాప్రస్థానం' ఒక చారిత్రక

కర్తవ్యాన్ని నిర్వర్తించింది. శ్రీశ్రీ కవిత్వాన్ని తూచే తూనికరాళ్లు తన దగ్గర లేవన్నాడుచలం. నేడు మన కొలతలతో శ్రీశ్రీని తూచవలసిన అవసరం లేదు. శ్రీశ్రీ అందించినకవిత్వపు కొలతలు అవగాహన చేసుకుంటే, ఏ సామ్యవాద దిశగా తానాశించిన'మహాప్రస్థానం' నేటి సమాజం సాగించగలదో విశ్లేషించుకుని అనుగమిస్తే అదీప్రయోజనదాయకం. శ్రీశ్రీని కాదనుకునిముందుకెళ్ళిపోదామని అనుకున్నవారికెవరికయినా అతను స్ఫూర్తిదాయకమై నీడలా అనుసరించి వస్తాడన్న నిజంఎలాగూ అంతఃకరణంలో అవగతమవుతూనే వుంటుంది.శ్రీశ్రీ స్ఫూర్తి అందుకోగలిగిన వారికి అదెన్నడూ ఆరిపోని దీపం.

-సుధామ

First Published:  15 Jun 2023 3:10 PM GMT
Next Story