Telugu Global
Arts & Literature

సోకు మరొకరిది ….

సోకు మరొకరిది
X

సోకు మరొకరిది

బాబాయి పరంధామయ్య గారి గావు కేకలు విని, కృష్ణకాంత్ సింహద్వారం దగ్గరే ఆగిపోయాడు.

"వెధవలు, వెధవలని. బుద్ధి, జ్ఞానం ఉండక్కర్లేదా? పరాన్నజీవులు" అని బిగ్గరగా అంటున్న బాబాయిని పలకరించడానికి జంకి, ఆయనను దాటుకొని, లోపలికి వెళ్ళి, వంటగదిలో ఉన్న పిన్ని బృహదంబని మెల్లగా అడిగాడు విషయమేమిటని. "ఆ… ఇది రోజూ జరిగేదేరా అబ్బాయీ! మన ఇంట్లోని మొక్కలనుండి పారిజాతాలు, మల్లెలు, మందారాలని, చెట్లనుండి మామిడికాయలని, జామకాయలని కాంపౌండు బయట వీధివైపునుండి ప్రక్క ఇంటివాళ్ళూ, పిల్లలూ తీసికెళ్ళడం, ఈయన వారిని ఇలా నానా మాటలూ అనడం పరిపాటి ఐపోయిందిరా. రా! ఇలా కూర్చో! ఏమిటి విశేషాలు?" అంటూ పరామర్శించింది పిన్ని.

ఆ మాటలను విన్న పరంధామయ్య "అవును. నేనే వారిని నానా మాటలు అంటున్నానని ఆడిపోసుకుంటేకానీ, నీకు హాయిగా ఉండదు." అంటూ కృష్ణ వైపు తిరిగి "నీవే చెప్పరా అబ్బాయ్! రోజూ నీళ్ళు పోసి, కన్నపిల్లల్లాగా, కంటికి రెప్పల్లాగా, ఎంతో ప్రేమతో పెంచి, కాపాడుకుంటూ వస్తూంటే, తేరకి వచ్చిందని, మనకు చెందిన పూలనీ, కాయలనీ ఇతరులు తీసుకోవడం భావ్యమా? అదీ ఇంటి యజమానిని అడగకుండా తీసుకోవడం అంటే దొంగతనమన్నమాటే కదా? మొన్న అదే మాటని పక్కింటి రామనాథాన్ని అడిగితే, ఏమన్నాడో తెలుసా? మీ ఇంటి పూలని దేవుడికి సమర్పించడంవల్ల, మీకు కూడా పుణ్యం వచ్చినట్లేగదా అని వక్రంగా జవాబిచ్చాడు. నాకు ఎంత ఒళ్ళు మండిందో అది విని. అంతటితో ఆగక, క్రితం వారం తన బంధువుల ఇంటికి వెళ్ళినపుడు, అక్కడ వాళ్ళ ఇస్త్రీ పెట్టెతో తన బట్టలు ఇస్త్రీ చేసుకుని, చొక్కాకు ఇంత, పంట్లాముకి ఇంత అని లెక్కగట్టి, ఆ డబ్బులని తన కొడుకు పిగ్గీ బాంకు డబ్బాలో వేసుకున్నాడట. తను బయట ఇస్త్రీ కని ఇచ్చే డబ్బులని అలా ఆదా చేసానని గొప్పలు పోతుంటే, తన్న బుద్ధయింది తెలుసా? వెధవ తెలివితేటలూ, వాడూ" అంటూ ఈసడిస్తూ, కాస్త ఆగి, " ఆ… ఇప్పుడు చెప్పరా అబ్బాయ్! ఏమిటి కబుర్లు?" అంటూ మనలోకానికి వచ్చాడు పరంధామయ్య.

బాబాయికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. చిన్నది కనుక, కూతురి పైన కాస్త ఎక్కువ మమకారం ఉండడంవల్ల, ఉన్న ఊర్లోనే, తెలిసినవారి అబ్బాయికే ఇచ్చి, వివాహం జరిపించాడు. కొడుకులిద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. కాంపస్ లోనే ఉద్యోగాలు దొరికి, అమెరికాకి వెళ్ళి, అక్కడే స్థిరపడ్డారు. సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వచ్చి, పది- పదహైదు రోజులు తలిదండ్రులతో సరదాగా గడుపుతారు.

తను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఈయకుండా, తననే తేరిపారచూస్తున్న కృష్ణని "అదేమిట్రా సమాధానమీయకుండా నాకేసి అలా చూస్తున్నావు? నా ముఖంలో కోతులు గానీ ఆడుతున్నాయా ఏమిటి?" అని పరాచికాలాడాడు బాబాయి. "బాబాయ్! నిన్నొకటి అడగనా?" అని అడిగాడు కృష్ణ నిదానంగా.

"అడగరా. సంకోచం, అనుమతులు ఎందుకు?" అన్నాడు బాబాయి. "నీ ఇంట్లో పెరిగిన చెట్ల పూలు, కాయలు బయటివారు తీసుకుంటేనే అంతలా బాధ పడుతున్నావే, మరి అన్నయ్యలిద్దరినీ అంత కష్టపడి, ఇష్టపడి పెద్ద చదువులు చదివించి, మన దేశంలోనే ఉంచక, వారి విద్యాబుద్ధులు పరాయి దేశానికి ఉపయోగపడేటట్లు చేసావే? దీన్నిఏమని అంటారు బాబాయ్?" అని అడిగిన కృష్ణకాంత్ ప్రశ్నకి పరంధామయ్య నిశ్చేష్టుడయ్యాడు.

డా.తిరుమల ఆముక్తమాల్యద, చెన్నై

First Published:  3 Dec 2022 11:08 AM GMT
Next Story