Telugu Global
Arts & Literature

శ్లోకమాధురి :16...అయిదు 'వ'కారాలు

శ్లోకమాధురి :16...అయిదు వకారాలు
X

వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ |

వకారైః పఞ్చభిర్యుక్తః నరో భవతి పూజితః ||

ఇది అందరికీ తెలిసిన శ్లోకమే . అయిదు (5) ‘వ'కారాలు మనల్నిసమాజంలో గౌరవస్థానంలో నిలుపుతాయి. అవి వస్త్రేణ- బట్టలచేత ,వపుషా -శరీరంచేత, వాచా- మాటలచేత , విద్యయా -జ్ఞానం చేత, వినయేన -వినయంచేత .

మనపట్ల ఏర్పడిన దురూహలు,

అపోహలు , అనుమానాలు పోగొట్టి మన సహజ స్వభావాన్ని అందరికీ తెలిసేలా చేస్తాయి. మన వస్త్రధారణను బట్టి మనకు రావాల్సినవి దక్కుతాయి ఎందుకు ? మంచి బట్టలు వేసుకోకపోతే గుర్తింపు వుండదా అని వాదిస్తారు కొందరు .కాని ఒక కవి ఇలా సమర్థిస్తాడు

కిం వాససా ఇత్యత్ర విచారణీయం

వాసః ప్రధానం ఖలు యోగ్యతాయై ।

పీతామ్బరం వీక్ష్య దదౌ స్వకన్యాం

దిగమ్బరం వీక్ష్య విషం సముద్రః ॥

శుభ్రమైన వస్త్రాలు ఎందుకంటే యోగ్యతను గుర్తించడానికి అవి ప్రధానం కనుక . సముద్రుడు పీతాంబరాలు ధరించిన విష్ణుమూర్తికి తన కూతురు లక్ష్మినిచ్చాడు, మరి, దిగంబరుడైన శివుణ్ణి చూసి మరి విషాన్ని కదా ఇచ్చాడు. అందుకే చక్కని బట్టలు ధరించాలి. అందమైన రూపం సర్వతః ప్రశంసనీయం, అందులో సందేహం లేదు. భగవంతుడిచ్చిన రూపం కదా ఏం చేయగలము అంటే, పుట్టుకతో వచ్చిన శరీరాకృతిని అష్టవంకర్లు తిప్పకుండా మన మనసుయొక్క స్వచ్ఛతను తెలిపేవిధంగావుండాలి.

అలాగే మనమాటతీరుకూడా !మాట మంచిదైతే ఊరు మంచిదవుతుందిన్న సామెత వుండనే వుంది.మాట అమృతంతో సమానమైనది మాత్రమే కాదు కత్తి లాంటిది కూడా . అందుకే చక్కని వాక్చాతుర్యంతో స్పష్టతతో మధురంగా మాట్లాడే వాళ్ళు ప్రీతిపాత్రులవుతారనడంలో సందేహం లేదు. పరుషంగా మాట్లాడేవారు శత్రువులవడం లోకంలో చూస్తున్నాము.

చక్కనిబట్టలు,రూపము,మాటనేర్పుతో పాటు చదువు ఎంత వస్తే అంత యోగ్యత వుంటుంది. మాటలో గాంభీర్యం , సంస్కారం,ప్రామాణికత , శాస్త్రాల పరిచయం తొణికిసలాడుతాయి.

"స్వదేశే పూజయతే రాజా. విద్వాన్ సర్వత్ర పూజయతే’ (రాజు/ధనవంతుడు తన సొంతవూళ్లో మాత్రమే కొనియాడబడితే విద్వాంసుడు ప్రపంచమంతా గౌరవింపబడతాడు) అన్నాడు భర్తృహరి.

ఉపనిషత్తులు “విద్యాయా అమృతమశ్నుతే” అని అన్నాయి.

ఇవన్ని వుండి , వాటితో పాటు ఋజు ప్రవర్తన , అణుకువ,ప్రేమ, సౌశీల్యాదులున్న మనిషి అందరి మన్ననకు పాత్రులవుతాడు.

ఇవన్నీ ఒక్కొక్కటిగా గౌరవ ప్రదములు. ఇంకా అన్నీ ఒక్కటిగా వుంటే అద్భుతం కదా!కాబట్టి ఈ అయిదు వకారాలను శ్రద్ధగా పాటిస్తూ జీవితాలు సాఫల్యం చేసుకోవాలి.

- డాక్టర్ .భండారం వాణి

First Published:  5 Oct 2023 7:32 PM GMT
Next Story