Telugu Global
Arts & Literature

శీలా వీర్రాజు స్మృతిలో

శీలా వీర్రాజు స్మృతిలో
X

వీర్రాజు గారూ!

మీరిక లేరంటే

రాత్రంతా నిద్ర పట్టలేదు

మీరు లేకుండానే తెల్లారటం

ఒక నల్లని వాస్తవం.

సాహిత్యంలో

ఎన్నో మైలురాళ్లను నాటారు మీరు

మీ మంచితనంతో

అసంఖ్యాక హృదయాలను మీటారు.

మిమ్మల్ని కలిస్తే

మనిషిని కలిసి నట్టుండేది

తెలంగాణా పల్లెల్లోని

కవి కిశోరాలు దశబ్దాల పాటు

మీ ముఖ చిత్రాల కోసం

హైదరాబాద్‌కు క్యూ కట్టేవారు.

ఎవరికీ లొంగని

ఇనుప జంతువు హైదరాబాద్

అది మీ ప్రేమ ముందు మాత్రం

వినమ్ర సుందరంగా వొదిగి పొయ్యేది.

మీరు ఇండ్లు మారినప్పుడల్లా

మా నడక దారులు మారేవి

అవి బస్టాండ్‌లకు సుదూరంగా ఉండటం మీ స్టైల్.

మీ ఇంట్లోకి అడుగు పెట్టగానే

మీనియేచర్ ఆర్ట్ గ్యాలరీలోకి

ప్రవేశించి నట్టుండేది.

గుమ్మాలకు కట్టిన కళాత్మక తోరణాలు

మీ చిరునవ్వుల్లా వేలాడుతుండేవి.

కవీ చిత్రకారుడనేది ఒక పార్శ్వం

సాదా సీదా వ్యక్తిత్వం మీది,

గోదావరిని దేశమంతా అద్దిన

ఆర్ద్రమూర్తి మీరు.

యాభై యేండ్ల మన స్నేహితం

ఇక పై ఒక అఖాతం.

ఏడాదిక్రితం ఇవాళే

ఒక మహానుభావుని

మహాభినిష్క్రమణం జరిగింది

అంతటా ఖాళీలు ఏర్పడుతూ

కాలం ఒంటరిదయ్యింది.

-- డా౹౹ ఎన్. గోపి

First Published:  1 Jun 2023 7:55 AM GMT
Next Story