Telugu Global
Arts & Literature

శ్లోకాలు - మంచి మాట‌లు

శ్లోకాలు - మంచి మాట‌లు
X

శ్లో|| పరోపదేశే పాణ్డిత్యం సర్వేషాం సుకరం నృణామ్|

ధర్మే స్వీయమనుష్టానం కస్యచిత్ సుమహాత్మనః ||

తా|| ఇతరులకు ధర్మాన్ని ఉపదేశించడం అందరికీ చాలా తేలికైన పని. ఆ ధర్మముయందు ఆచరణము అనునది ఏ ఒక్క మహాత్ముడి యందే ఉండును.

గొడుగు వర్షాన్ని ఆపక పోవచ్చు. కానీ వర్షంలో తడిచి పోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చి పెట్టకపోవచ్చు కానీ విజయపథంలో అవరోధాలను అధిగమించే శక్తినిస్తుంది.

మన సమస్యలకు పరిష్కారం కేవలం మన దగ్గర మాత్రమే ఉంటుంది. ఎదుటి వాళ్ల దగ్గర సూచనలు, సలహాలు మాత్రమే ఉంటాయి

జీవితమనే పొలంలో సమస్య అనే "కలుపు మొక్కలు" పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదలి వెళ్ళగలమా* ? “కలుపుమొక్కలను" తొలగిస్తూ జీవించాలి అంతే*..!!

నత్వహం కామయేరాజ్యం

నస్వర్గం న పునర్భవమ్‌!

కామయే దుఃఖ తప్తానాం

ప్రాణినామార్తి నాశనమ్‌!!

ధర్మపరులు, మహనీయుల ఆలోచనా ధోరణిని తెలిపే శ్లోకమిది. వారు రాజ్యాన్ని కోరరు. వారికి స్వర్గం అవసరం లేదు. వాళ్లెప్పుడూ మోక్షాన్ని కోరరు. దుఃఖార్తులైన ప్రాణుల దుఃఖం నశించాలని మాత్రమే కోరుకుంటారు. అంటే దీనజన దుఃఖ నివారణకు మించిన ధర్మం లేదన్న సత్యం గ్రహించిన సత్పురుషులు వారు. ఇదే సత్యమని విశ్వసించి, ఆచరించి చూపిన మహానుభావులు. సకల మానవాళికీ వారు ఆదర్శం.

నమస్కారం…

భారతీయ సంస్కారం.

కాదు, సంస్కృతిలో భాగం.

ఇది ఒక గౌరవసూచకం. మనషులందరిలోనూ దైవత్వము ఉంటుందని హిందువులు నమ్ముతారు. దీనినే ఆత్మ అంటారు. నమస్కారం పెట్టడం అంటే మన ఆత్మ ఎదుటి వ్యక్తిలోని ఆత్మను గుర్తించి దానికి విధేయత ప్రకటించడం. కానీ, ప్రతి నమస్కరానికి ఒక విధానం ఉంది. అందరికీ చేతులెత్తి దండం పెట్ట కూడదట. ఎవరికీ ఏ విధంగా నమస్కారం చేయాలి అనే అంశాలను పరిశీలిద్దాం

తల్లిదండ్రులకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేస్తాం. దేవుళ్లకు చేసే నమస్కారాలు ఒక విధంగా ఉంటాయి , గౌరవపూర్వకంగా మనుషులకు చేసే నమస్కారం మరో రకంగా ఉంటుంది.

శివకేశవులకు నమస్కరించేటపుడు తల నుంచి 12అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి. అంటే చేతులెత్తి నమస్కరించాలి.

హరిహరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించకూడదు.

గురువుకి వందనం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి .

తండ్రికి, ఇతర పెద్దలకు నోటికి నేరుగా చేతులు జోడించాలి.

తల్లికి నమస్కరించేటపుడు ఉదరమున నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి.

యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి.

మన శాస్త్రాలు చెప్తున్న సంగతి ఇది

First Published:  21 Sep 2023 3:48 PM GMT
Next Story