Telugu Global
Arts & Literature

మహిళలు - మహారాణులు (కథ)

మహిళలు - మహారాణులు (కథ)
X

అద్దం ముందు నుంచుని నెక్లెస్ పెట్టుకుంటున్న సుజితను చూస్తూ " ఏమిటీ ప్రొద్దు ప్రొద్దున్నే పట్టుచీర నగలు సింగారించుకుంటున్నావు, ఎక్కడికైనా వెళ్ళాలా!? ఏమైనా ఈమధ్య నీకు అలంకారం మీద శ్రద్ధ పెరిగింది" అన్నాడు సారథి భార్యతో.

" ఏమిటో, మీరెంత అమాయకులండీ ... రోజూ నాతో పాటు కొన్ని సీరియల్స్ చూస్తున్నారు కదా, ఎలా వుంటారూ అందులో ఆడవారు!? మేము పెళ్ళికి వెళ్ళినా అంత మంచి చీరలూ,నగలూ వేసుకోము. ధగధగ మెరిసిపోతూ ...అదేం ఒన్ గ్రామ గోల్డో, 24 క్యారెట్స్ బంగారంలో కూడా ఆ మెరుపూ, ఆ డిజైన్లు రావు. ఇవాళ నుండి నేనూ ఇలాగే సీరియల్స్ ని ఫాలోఅయిపోవాలనుకుంటున్నాను". అంది సుజిత.

"ఆ వెధవ సీరియల్స్ చూడడమే ఒక తప్పు అనుకుంటే ఫాలో అవుతావా వెర్రిదానా, ఆ వెర్రి పిచ్చిగా మారకుండా చూసుకో".అంటూ ఆఫీసుకి బయలుదేరబోతుంటే...

" సారథీ! నిన్న మీకు చెప్పేను కదా, నా ఫ్రెండ్ సుశీల వస్తోందని...అదీ మీలాగే తిట్టి పోస్తోంది... సీరియల్స్, యూట్యూబ్ లు మానేసి ...నీ టేలెంట్ చూపించు అని, ఇవాళ ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పింది. ఇవాళ నాతో ఏదైనా వంట చేయిస్తుందట వీడియో తీసి. వంటింట్లో నాకు చాలా పని వుంది ఇంక నేనూ మీలాగే బిజీ అయిపోతాను" అంటూ నవ్వుతూ వెళ్ళింది సుజిత.

సుజిత మాటలకి "ఈ వెర్రి పోయి ఆ వెర్రి మొదలవుతోందా. ఇలాగే వెళతావా పట్టుచీర తో పిచ్చి మాలోకం... "అంటూ ఆఫీసుకి వెళ్ళేడు.

సుశీల ఏమైనా మెసేజ్ పెట్టిందేమోనని ఫోన్ ఓపెన్ చేసింది సుజిత. ' ఈ నటి ఏం చేసిందో తెలిస్తే మీరు అవాక్కవుతారు' పోస్ట్ చూడగానే చిర్రెత్తుకొచ్చింది సుజితకి. రోజుకో పది ఇలాంటి పోస్ట్లు చూసి విసుగువస్తోంది. తీరా మొత్తం చదివితే ఇంతా చేసి ఏమీ వుండదు. ఏమీ వుండదని తెలిసినా, ఆతురతతో చూడడం...విసుక్కోవడం అలవాటయిపోయింది. ఫేస్బుక్ లతో, టివీ సీరియల్ లతో మనని ఆడుకోవడం వీళ్ళకు ఎక్కువ అయిపోయింది. విసుగ్గా ఫేస్బుక్ ఆఫ్ చేసి, యుట్యూబ్ లో, వంటలు ఛానెల్స్ లో అమ్మాయిల్లా స్టౌ ముందు నుంచుని కూరలు వయ్యారంగా తరగడం మొదలెట్టింది సుజిత.

ఈమధ్య సీరియల్ ప్రభావంతో వాళ్ళెలా తింటారో, అలా చూపుడువేలు వదిలేసి, సుతారంగా ముని వేళ్ళతో అన్నం కలపడం, ఆ నాలుగు వేళ్ళతో నాలుగు మెతుకులు లోపలికి పెట్టుకోవడం, నోరు ఇప్పకుండా నమలడం చేస్తుంటే సారథి అడిగేసేడు..."ఈ వెర్రి ఎప్పటినుండీ "అని.

అలాగే వాగింది వాగినట్లుగా...ఆ కూరలెలా తరగాలి,వాటి పుట్టు పూర్వోత్తరాలు, వాటి వుపయోగాలు నాన్ స్టాప్ గా తనే మాట్లాడుకుంటుంటే, కాలింగ్ బెల్ మ్రోగింది.

తలుపు తీస్తూనే సుశీలను చూసి, "హాయ్ సుశీ" అంటూ కావులించుకుంది.

"సుజీ! ఇవాళ మనం, టివీ ఛానల్ కి వెళ్ళి,అటునుండి బయట భోజనం చేద్దాం. ఈ వారం మహిళా దినోత్సవంకి నాందీ అనుకో...నీకిష్టమైన వంటకం చేయి, నేను విడియో తీసేక బయలు దేరుదాము"

వేడి వేడిగా మంచి ఫిల్టర్ కాఫీ త్రాగగానే, డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చిలాగి, సుశీలను కూర్చోమని ఫేన్ వేసింది సుజిత.

డైనింగ్ టేబుల్ మీద ఇండెక్షన్ స్టవ్ పెట్టి, తరిగిన కూరగాయలు ముక్కల ట్రే తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది.

" సుశీ ! ఇంతసేపూ నేనొక్కదాన్నే వాగుకుంటూ...కూరలు తరిగేను. ఇవి చూసేవా గ్రీన్ గా పచ్చి బఠాణీలు, ఇవి ఎర్రగా వుల్లిపాయ ముక్కలు, ఇవి ఆరంజి రంగులో కేరట్, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర,కరేపాకు సరేసరి, తెల్లగా క్యాబేజీ తరుగు. ఇప్పుడు నేను క్యాబేజీ బాత్ చేసే గెస్ట్ ని, నీవేమో ఏంకర్ వి. ఇదివరకూ ఏంకర్లు గెస్ట్ లను మాట్లాడనిచ్చేవారు కాదు, వారే ప్రశ్నలేస్తూ,జవాబులు చెప్పేస్తూ. ఇప్పుడలా కాదు ట్రెండ్ మారింది. అసలిలా వంటలకు ఏంకర్లే వుండరనుకో.ఇప్పుడు నిన్నేమీ మాట్లాడనీయకుండా, నీవు షూట్ చేస్తూవుంటే, అంతా నేనే మాట్లాడుతానన్నమాట...నీకు ఛాన్సే ఇవ్వను సరేనా " నవ్వుతూ చెప్పిన సుజితకు సరేనని తలాడించింది సుశీల.

" సుజీ ఈమధ్య నీకు యుట్యూబ్, టివి పిచ్చి ఎక్కువయ్యాయి. మీ ఆయన ఎలా భరిస్తున్నాడే బాబూ"

"అందుకే ఆయనకీ నాతో పాటు అలవాటు చేసేసాను సీరియల్స్ చూడడం". నవ్వుతూ సొల్యూషన్ చెప్పింది సుజాత.

" సుజీ ! నీకు గుర్తుందా మనం, చదువై పెళ్ళిళ్ళు అయ్యేక హైదరాబాద్ లో కలిసేము పదేళ్ళ క్రితం"

"ఎందుకు గుర్తులేదూ ...అందరికీ దూరంగా కర్నాటక లో పదేళ్ళు వుండి వచ్చేము".

"ఆరోజు నిన్నా మొన్నలా అనిపిస్తోంది నాకు. నేను రాగానే అప్పటికప్పుడు ఇలాగే ఫిల్టర్ కాఫీ ఇచ్చి, నాకోసం వేడి వేడి మైసూర్ బజ్జీ వేసి పెట్టేవు. వేస్తున్నంతసేపూ అప్పటికప్పుడు చేసే ఎన్నో తేలికైన వంటలు చెప్పేవు గుర్తుందా!?, మరమరాలు ఉప్మా, క్రిస్పీగా రవ్వ దోశ, అలాగే సగ్గుబియ్యం కిచిడి అటుకుల పోహ, ఇలా ఉప్మా లు చెప్పడం కాకుండా, బజ్జీలకు కొద్దిగా మైదా, పూరీకి కొద్దిగా రవ్వ కలపాలని రకరకాల చిట్కాలు చెప్పేవు". చెప్పడం ఆపింది సుశీల.

"అవును సుశీ ఇప్పుడులా అప్పుడు వాట్సాప్ లు, ఫేస్బుక్ వంటలు గ్రూపులు, యుట్యూబ్ లు లేవుకదా. ఎన్ని వంటలు వచ్చినా ఇంట్లో, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చెప్పుకునే వాళ్ళం".

"అందుకే నీ ప్రతిభను బయటికి చాటాలనుకుంటున్నాను"

"కరోనా వచ్చేక బయటకు వెళ్ళడం తగ్గిపోయింది. దాంతో మరీ ఫోనూ టీవీ ఇవే లోకం అయిపోయాయి. అరచేతిలోకే అన్నీ వచ్చేసేయి. ఓటిటి లో సినిమాలొచ్చేక, ఇల్లే ప్రపంచం అయిపోయింది. పిల్లలతో విడియో కాల్స్ అందులో ఒక భాగం కాదనను... లోకంతో పాటూ మనమూ మారాలి సుజీ ."

"ఈ మహిళా దినోత్సవం నాడు ఒక మహిళ, ఇంకో మహిళను ఉత్తేజపరుస్తూ ...మార్చేస్తోందన్న మాట". సుజిత మాటలకు " సరే ఇక స్టార్ట్ చేద్దామా" అంది సుశీల.

చక్కని చందేరి కాటన్ చీరలో సింపుల్ గా చూడచక్కగా మెరిసిపోతోంది సుజిత. తన తెలివితో, అనర్గళ మాటల చాతుర్యంతో ' క్యాబేజీ బాత్ ' ని కలర్ ఫుల్ గా చేసి చూపించింది సుజిత. అంతే అందంగా విడియో తీసింది సుశీల.

ఇద్దరూ చెరో కొంచెం తిని, కొంత హాట్ ప్యాక్ లో పెట్టుకుని, టివి ఛానల్ కి బయలుదేరేరు. వెళుతూ అక్కడ పని చేస్తున్న తన ఫ్రెండ్ స్వాతికి ఫోన్ చేసి, వస్తున్నట్లు చెప్పింది సుశీల.

"మహిళా దినోత్సవాలంటూ పండుగ జరుపుకుంటున్నాము. ఎంతోమంది ప్రగతి సాధించినా నీలాంటి వారు మరుగున పడిపోతున్నారు. రకరకాల మాధ్యమాలు,మీడియా వచ్చేక ...ప్రతి అమ్మాయి తన టేలెంట్ ని చూపించుకోవాలనుకుంటోంది. సినిమా వాళ్ళే కాదు టివి ఆర్టిస్టులు సెలబ్రిటీలయిపోతున్నారు. డబ్బు సంపాదనలాగే అవసరాలు ఎక్కువ అవుతున్నాయి." సుశీల మాటలకు అడ్డు కట్ట వేసింది సుజిత.

" నిజమే సుశీ ! టివీ లో వచ్చే సీరియల్స్ ఓకే మూసలో పోసినట్లు సాగుతున్నా...ఒక ఎపిసోడ్ తీయడానికి ఆ యూనిట్ ఎంత కష్టపడుతుందో కళ్ళారా చూసేను. మనం ఇంట్లో కూర్చుని చూసిన పదిహేను నిమిషాల్లో దాన్ని దుమ్మెత్తిపోస్తాము. అలాగే ఇప్పుడు నేను ఇందులో సక్సెస్ అవుతానంటావా!? నీ మాట కాదనలేక వస్తున్నాను" అంది సుజిత.

"మళ్ళీ వచ్చే మహిళా దినోత్సవానికి తెలుగు రాష్ట్రాలలో నీపేరు మారుమ్రోగకపోతే అప్పుడడుగు" అని సుజిత భుజం తట్టింది సుశీల.

సుజితను, విడియోను చూసి చాలా ఇష్టపడింది వంటల ఇన్ చార్జ్ సుస్మిత. "మేడమ్ కొంచెం టేస్ట్ చేస్తారని తెచ్చేనంటూ ...రుచి చూపించింది సుజిత. ఆ ఛానల్ లో రోజూ మధ్యాహ్నం 2 గంటలకు వంటలు ప్రోగ్రాం వస్తుంది. ప్రతి సోమ, బుధ శుక్ర వారాలు... సుజితకు కేటాయించేరు.

సుశీలన్నట్లు సుజిత వంటలు అందరినీ ఆకట్టుకున్నాయి. సుజిత కిచెన్ క్రొత్త క్రొత్త వంటల పరికరాలతో ఆకర్షణీయంగా వుంటుంది.

"సుజిత మామ్ కిచెన్" గ్రాండ్ సక్సెస్ అయింది. సుజిత కట్టు బొట్టుతో సహా క్రొత్తదనం సంతరించుకుంది ఆ ఛానల్ లో. ప్రాంతీయ వంటలు, చిట్కాలు, వంటింటి వైద్యాలతో అతి తక్కువ సమయంలో గొప్ప పేరు సంపాదించుకుంది.

పండుగలన్నా, పబ్బాలన్నా సుజిత ఇప్పుడు చాలా బిజీ అయిపోయింది... సీరియల్స్ ని విమర్శించడం కుదరడం లేదు. షూటింగ్ వాటి సాధకబాధకాలు అర్థం అయి...ఈ పోటీ ప్రపంచంలో నిలద్రొక్కుకోవడానికి ఒక ఛానల్ కి మించి ఇంకో ఛానల్ ఎన్ని చూసుకోవాలో, ఎంత ఖర్చు చేయాలో తెలిసింది. రేటింగ్ ప్రపంచంలో పోటీ తప్పదు. మార్పులు తప్పవు. 'మహిళలూ ... మహరాణులు' ఎప్పటికీ మీరే.

- సరస్వతి పొన్నాడ

First Published:  21 March 2023 12:10 PM GMT
Next Story