Telugu Global
Arts & Literature

శతజయంతి సంగీతసామ్రాట్.. ( ర ) సాలూరు రాజేశ్వరరావు

శతజయంతి సంగీతసామ్రాట్.. ( ర ) సాలూరు రాజేశ్వరరావు
X

(అక్టోబర్ 25 - 25వ వర్థంతి)

తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో సాలూరు రాజేశ్వ‌ర‌రావు గారు ఒకరు. తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించిన ఆయ‌న , ఎన్నో అజరామరమైన చిత్రాల‌కు అద్భుత‌మైన స్వ‌రాల‌నందించారు.

రాజేశ్వ‌ర‌రావు సాలూరు మండలంలోని శివరామపురం గ్రామంలో 1922 సంవత్సరం అక్టోబ‌ర్ 11న జన్మించారు. రాజేశ్వరరావుకి అతి చిన్నత‌నం నుంచి సంగీత‌మంటే ఆస‌క్తి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో ప్రారంభంలో మృదంగ నిపుణుడైన తండ్రి సన్యాసిరాజు ద‌గ్గ‌రే సంగీతంలో “ఓన‌మాలు ” దిద్దారు.

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు, నాలుగేళ్ళ వయసులోనే రాజేశ్వరరావు అనేక రాగాలను గుర్తించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మరో మూడేళ్ళు గడిచేసరికి అన్న హనుమంతరావుతో కలిసి పాట కచేరీలు ఇవ్వడం, హరికథలు చెప్పడం మొదలు పెట్టారు.

రాజేశ్వరరావు ప్రతిభను గుర్తించి హచ్చిన్స్‌ గ్రామఫోను కంపెనీ ఆయ‌న‌ను బెంగుళూరుకు ఆహ్వానించింది. 1933-34 మధ్యకాలంలో “బాల భాగవతార్‌ మాస్టర్‌ సాలూరి రాజేశ్వరావు ఆఫ్‌ విజయనగరం” కంఠం గ్రామఫోను రికార్డుల ద్వారా (భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు, మోతీలాల్‌ నెహ్రూ పై పాటలు మొదలగునవి) మొదటిసారిగా విజయనగరం ఎల్లలు దాటి యావదాంధ్రదేశానికీ పరిచయమయింది.

సాలూరి గాత్ర మాధుర్యానికి ముగ్ధులైన పినపాల వెంకటదాసు, గూడవల్లి రామబ్రహ్మం తమ (వేల్‌ పిక్చర్స్) రెండవ చిత్రానికి గాను (శ్రీకృష్ణ లీలలు,1935),ఆయ‌న‌ను “కృష్ణుడి” పాత్రధారునిగా ఎంపిక చేసుకొని మద్రాసుకు చేర్చారు. తొలిచిత్రంలోనే తన గాన, నటనా కౌశలాన్ని సాలూరి తెలుగు ప్రేక్షకులకు చాటి చెప్పారు.

” వేల్ పిక్చర్స్” వారి శశిరేఖాపరిణయం (మాయాబజార్‌ 1936) ఆయన రెండవ చిత్రం. దీనిలో అభిమన్యుని పాత్రని పోషిస్తూ కొన్ని పాటలు కూడా (నను వీడగ గలవే బాలా, కానరావ తరుణీ) పాడాడు. ఆ చిత్రం పూర్తయిన తరువాత మరొక చిత్రంలో నటించేందుకై కలకత్తా చేరుకున్నారు.

కానీ అప్ప‌టికే ఆయ‌న‌కు సంగీతంలో ఉన్న‌త స్థితికి చేరుకోవాల‌నే ఆస‌క్తి అధికంగా ఉండేది. ఆ ఆస‌క్తే ఆయ‌నను ఆర్. సి.బోరల్, పంకజ్ మల్లిక్, తిమిర్ బరన్ ల ప‌రిచ‌యాల‌కు , ప్రముఖ గాయకుడు కె.ఎల్.సైగల్ ద‌గ్గ‌ర శిష్యరికానికి దారి తీసింది.

ఇలా ఒక సినిమాలో నటించడానికని కలకత్తా చేరిన ఆయ‌న సంవత్సర కాలం పైగా అక్కడే వుండిపోయి, అక్కడి ఉద్దండుల వద్ద (హిందుస్తానీ) శాస్త్రీయ సంగీతంలోని మెళుకువలు, బెంగాలీ, రవీంద్ర సంగీతరీతులు, వాద్యసమ్మేళన విధానం నేర్చుకున్నారు.

1938లో మద్రాసుకు తిరిగి వచ్చిన తరువాత సంగీతబృందాన్ని ఏర్పాటు చేసుకొని ఒక తమిళ చిత్రానికి (”విష్ణులీల” 1938) సహాయ సంగీత దర్శకునిగా పనిచేశారు. అనంత‌రం చిత్రపు నరసింహరావు దర్శకత్వంలో తయారయిన “జయప్రద”(పురూరవ 1939) చిత్రానికి పూర్తి సంగీతదర్శకత్వపు బాధ్యతలు చేపట్టి, అప్పట్లో అత్యంత పిన్న వ‌య‌సు గ‌ల యువ సంగీత దర్శకుడిగా చరిత్ర సృష్టించారు.

ఇదిలా ఉంటే ఆయనకు సినీ సంగీతదర్శకునిగా బాగా గుర్తింపు తెచ్చిన మొదటి చిత్రం ” ఇల్లాలు ” (1940).సంగీత రీతుల్ని సమన్వయం చేయడంలో ఆయన సాధించిన విజయాలు మరెవ్వరూ సాధించలేదు. వాయిద్యాలపై ఆయనకున్న పట్టును గురించి చిత్రరంగంలో చాల గొప్పగా చెప్పుకొంటారు. 20 – 30 వయొలిన్లు ఒకేసారి వాడిన సందర్భాల్లో ఏ వొక్క వయొలిన్‌ తప్పు పలికినా ఆ నంబరును చెప్పి మరీ గుర్తించే వారని అంటారు.

రాజేశ్వ‌ర రావుది ఓ విల‌క్ష‌ణ‌మైన శైలి. ఏదో ఒక సంగీతానికే కట్టుబడి వుండాలని ఆయన ఏనాడూ మడికట్టుకు కూర్చోలేదు. మారుతున్న కాలాన్నిబట్టి, మెలొడీకి ప్రాధాన్యతనిస్తూ సంప్రదాయ రాగాల్లో వుండేటటువంటి మధురిమను వదులుకోకుండా చక్కని చిక్కని పాటలు అందించారు.

సాలూరు రాజేశ్వరరావు ప్ర‌తిభ‌ను గుర్తించి ఆంధ్రా విశ్వవిద్యాలయం 1979లో డాక్టరేటుతో పాటు కళాప్రపూర్ణ పుర‌స్కారాన్ని ప్ర‌దానం చేసింది. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం ఆయ‌న‌ను ఆస్థాన విద్వాన్ గా నియమించుకుంది. ఇదే కాలంలోనే ఈయన స్వరపరచిన అన్నమయ్య కీర్తనలను ఘంటసాల ఆల‌పించారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదును ఇచ్చి సత్కరించింది.

అద్భుతమైన తొలి లలితగీతాలను ఆలపించడమే కాక ఎన్నో చిత్రాల‌కు అద్భుత‌మైన సంగీతాన్ని అందించిన రాజేశ్వ‌ర‌రావు 1999 అక్టోబరు 25 వ తేదీన చెన్నైలోని త‌న స్వగృహంలో క‌న్నుమూశారు. ఆయ‌న లేని లోటు సంగీత ప్ర‌పంచానికి ఎన్న‌టికీ తీర‌ని లోటుగానే మిగిలిపోతుంది.

గత ఏడాదే శతజయంతి సమాపనమైన ఈ సంగీత సామ్రాట్ కివే స్మృతి నివాళులు.

- కాంతి సృజన

First Published:  25 Oct 2023 11:10 AM GMT
Next Story