కానముద్ర (కవిత)
BY Telugu Global30 Nov 2023 6:41 AM GMT
X
Telugu Global Updated On: 30 Nov 2023 6:41 AM GMT
పిల్లసెలయేటి గలగలల్లో
'గవ్వల భాష ' గల్లుమంటోంది.
వేకువన కొమ్మ, రెమ్మల మలయమారుత సడి,
పక్షుల కలకల రావాలతో మేళవించి,
కొత్తసృష్టికి స్వాగత గీతం ఆలపిస్తున్నాయి.
హిమబిందువుల జల్లు
మంచి ముత్యాల్లా వర్షిస్తూనే ఉంది.
సుడులు తిరుగుతూ సవ్వడి చేస్తూ,
ఎండుటాకులా మనసు తేలికపడి,
తేలిపోతున్న మనోవిపంచి.
శ్వేత కపోతం మెత్తటి రెక్కలు
విప్పార్చుకొని,
కిరణాల వేడి పొదుగుతూనే ఉంది.
గుండెకు చేరువగా పడుతున్న
'ముఖమల్ ' అడుగుల చప్పుడు,
తుట్టె నుండి బొట్టు బొట్టుగా జారుతున్న
తేనె చినుకుల్లా అప్పుడప్పుడు.
ఇప్పుడప్పుడే తీరేలా లేదు,
ఈ ఆకుపచ్చని వసంతాల
ఆత్మానంద వన విహారం.
-ఆర్ యస్ రాజకుమార్
(విజయనగరం)
Next Story