Telugu Global
Arts & Literature

రూట్ మ్యాప్

రూట్ మ్యాప్
X

రూట్ మ్యాప్

'అడ్రసు చెప్పు' అన్నాను.

'అదంతా ఎందుకు

రూట్ మ్యాప్ పంపిస్తా వచ్చేయ్యి' అన్నాడు మిత్రుడు.

బస్సయినా

కారయినా

అదొక సుఖగమనం

నా కయితే కదిలే కవిత్వం.

కారు బయల్దేరింది

'200 మీటర్ల తర్వత

కుడి పక్కకు తిరుగు' అంది వాయిస్.

తెలిసిన వీధులే

కొత్త ఆనవాళ్లతో చెప్తున్నది.

అది ఫలానా మహానుభావుని

పేరు మీదున్న రోడ్డు

ఇప్పుడది పెద్ద బిల్డింగ్‌ను కొండగుర్తుగా చెప్తున్నది.

గతంలో వచ్చినప్పుడు

ఈ రోడ్డంతా

ఓ సుదీర్ఘ కవితలా

భావోద్వేగభరితంగా వుండేది.

అపూర్వమైన తలపులు

గాలితో కలిసి

కిటికీ లోపలికి చేయి సాచేవి.

ఫుట్‌పాత్‌లపై

పేదవాళ్లు పెటుకున్న

చిన్న చిన్న దుకాణాలు

జీవన సమరానికి సిద్ధమైన

సాత్త్విక శస్త్రాల్లా ఉండేవి.

ఇదేమిటి!

ఇవాళ ఈ నక్షా

నా నగరాన్ని

నాకే అపరిచితం చేస్తున్నది.

సందుల సంఖ్యను పెంచుతూ

నా ప్రయాణాన్ని

పద్మవ్యూహంగా మారుస్తున్నది.

కారు ప్రయాణమంటే నాకు

పరమ రమ్యమైన అనుభవం,

కవిత్వ రచనకు కాణాచి కూడా.

అదిప్పుడు

కేవల కళేబరాలను బట్వాడా చేసే

నిర్జీవ సందడిగా మారింది.

దీని కన్న నడకే నయం

మట్టిలోంచి ప్రాక్తన ప్రసారాలన్నా జరుగుతాయి.

ఇంతలో

ఇంటి నుంచి ఫోనొచ్చింది,

'ఎక్కడున్నావ'ని

ఎక్కడున్నానో చెప్పలేను గాని

నాలోంచి నేను మాత్రం తప్పిపోయాను.

-- డా౹౹ ఎన్. గోపి

First Published:  28 Nov 2022 7:30 AM GMT
Next Story