Telugu Global
Arts & Literature

వాకింగ్ టాక్ - ( వెస్టులో)

వాకింగ్ టాక్ - ( వెస్టులో)
X

సుందరం అందర్లో కొందరిలాగా సందర్భానికి తగిన కంప్యూటర్ భాషలేవో నేర్చేసుకోని తగిన ఉద్యోగంలో కుదురుకొని పెళ్ళాం పిల్లలతో అప్పట్లో మనల్నేలిన మారాణి గారి ఇలాకాలో స్థిరపడ్డాడు.

వెస్టు జీవనానికి అలవాటుబడ్డా బాల్యంలోనూ యవ్వనంలోనూ పురాణాలకి కావ్యాలకి సంబంధించిన సినిమాలు చూసి ఉండటం, వాటిని గురించి పుస్తకాలు చదివిన అవగాహన, అక్కడక్కడ వాటిని ఆచరణలో పెట్టిన వారిని చూసి ఉండటం వలన ఇంకా ఆ విలువలు గురించి గట్టి నమ్మకంతో ఉండేవాడు!

కోవిడ్ మూలాన ఇంటినుంచి పనిచెయ్యడం, సాయంత్రం తోటి కాలనీ వాసులతో నడుస్తూ పిచ్చాపాటి మాట్లాడటం, కాళ్ళిక సహకరించట్లేదు అనుకున్నప్పుడు ఇంటికి చేరడం రోజూవారి కార్యక్రమమయ్యింది సుందరానికి.

ఓ రోజు సాయంకాలం యధాప్రకారం నడుస్తుంటే , ఒకాయన మాట్లాడుతూ శ్రీరాములోరు అడవికి ఎందుకు వెల్లవలసి వచ్చింది తండ్రి మాటకు కట్టుబడి, ఆయన సొంతంగా ఆలోచించి నేనడివికెళ్ళనని నాకిది సమ్మతంగాదని చెప్పవలసిందని తన సందేహాన్ని వ్యక్తపరిచారు.

దానికి ఇంకొకాయన వెళ్ళటం వరకు బాగానే వుందికాని, రాములోరికి అడవిలో చాలా సౌకర్యంగా అనిపించిందేమో అందుకనే తండ్రిగారు అడిగినన్ని రోజులు అరణ్యవాసం చేశాడు. లేకపోతే అన్నిరోజులు అడవిలో ఉండేవారు కాదేమోనని తన వాదన వినిపించాడు,

ఇంకొకాయన అవును అంతేగా సౌకర్యంగా లేకపోతే ఎవ్వరైనా ఎందుకు నాన్నకిచ్చిన మాటకోసం అన్ని సంవత్సరాలు ఫారెస్టుకెళ్తారు ..తండ్రి సౌకర్యాలన్ని ముందుగానే కల్పించుంటాడని..

అట్లా కాకపో తే ఒక్క క్షణమక్కడ ఉండేవారు కాదేమోనని వక్కాణించాడు.

బృందానికి సుందరమేదో చెప్పబోయాడు, త్రేతాయుగం విలువలని అప్పట్లో అలాంటి మహానుభావులుండేవారని..ఈ కాలంలోనూ అనుబంధాలు ఆప్యాయతలు కట్టుబాట్ల గురించి తన బాల్యంలో అనుభవంలోనున్న కొన్ని సంఘటల్ని ఉటంకిచబోయాడు..

కాని వెస్టు వాసన బాగా వంటబట్టిచ్చుకున్నారేమో సహచరులు..టాట్ అల్లాంటి జనులుండే వీలేలేదు ఎప్పుడైనా అన్నీ పుక్కిటి పురాణాలని..కొంచెం నడకకి ఊపిచ్చే వ్యాఖ్యానాలు చెయ్యాలని తీర్మానించారు.

సుందరమిక మిగిలిన మాటల్ని నోట్లోనుంచి బయటికి రానివ్వలేదు..అవి సూటిగా మళ్ళీ మైండుకి తగిలి నడుస్తూనే ఆలోచనల్లోమునిగిపోయాడు..

ఎంత మారిపోయారు మనుష్యులు..వేరే ప్రాంతాలకు తరలెళ్ళి ఆ ప్రాంతాలకు తగ్గట్టు జీవించడం మంచిదేగాని మన విలువలు కట్టుబాట్లని తక్కువజేసి ..ఎన్నో వేల సంవత్సరాలుగా నమ్ముతూ వస్తున్న మహా పురుషుల జీవితాల్ని కల్పిత పురాణాలుగా తీసివెయ్యడం..తీసేశారు సరే అలా అనుకున్నా వాటిలో పనికొచ్చే నీతిని తెలుసుకోవడం ఆచరించడం మంచిదేగదా...ఎందుకో ఇలా మనవాళ్ళు మారిపోయారు

అనుకొంటూ ...రేపు ఎట్లాంటి డౌటనుమానాలొస్తాయో జనాలకి ఇంకా ఎటువంటి భయంకరమైన సమాధాన స్టేట్మెంట్స్ వినాల్సొస్తుందోననుకోంటూ ఆ రోజుకి నడక ముగించాడు సుందరం!

-రవి కిషోర్ పెంట్రాల, (లాంగ్లీ, లండన్)

First Published:  26 May 2023 11:12 AM GMT
Next Story