Telugu Global
Arts & Literature

రాముడికీ జాగ్రఫీ తెలీదు

రాముడికీ జాగ్రఫీ తెలీదు
X

అమెరికాలో ఓ రోజు ముందే పుట్టేశాడు

ముంబాయి లోనూ ముందే

ఉత్తరాదిలోనూ అంతే

అక్కడి బ్యాంకులూ

స్టాక్ మార్కెట్లూ సెలవ్

భద్రాచల రాముడి

పుట్టిన్రోజు మాత్రం ఓ రోజు లేటు

అందుకే ఆయనకి జాగ్రఫీ తెలీదు ...

రాముడొకరకంగా అదృష్టవంతుడు

పుట్టిన్రోజూ పెళ్ళిరోజూ ఒకటే

పైగా సత్ప్రవర్తన వల్ల

నలుగురూ పొగుడుతూ ఉంటారు

ఆయన పేరున కావ్యాలొచ్చాయి

రామాయణం రచించబడింది

అదే లోకాభిరామాయణం గా మారింది

రాముడు మంచిబాలుడు

రామరాజ్యం, రామబాణం

అన్నారు... ఆయన పేరు

మార్చి మార్చి మనం పెట్టుకున్నాం గానీ

ఆయన మన పేర్లు పెట్టుకోలేదు

ఆయనకి అనుసరించడం

అనుకరించడం రెండూ రావు

లీడింగ్ ఫ్రం ద ఫ్రంట్ మాత్రమే తెలుసు ...

ఆయనకి పబ్లిసిటీ పిచ్చి లేదు

బాకా ఊదడానికి,

బాలేనిది భలే ఉందని టముకెయ్యడానికీ

భజంత్రీ మీడియా లేదు

అబ్బో

రావణుడు ఎత్తుకెళ్ళడానికొచ్చి

సీతమ్మని చూసి బెదిరిపోయి

కాస్ట్యూం మార్చేసుకున్నాడు

రామయ్య బంగారు లేడిని

కంటి చూపుతో కాల్చేశాడు

సీతమ్మని కిడ్నాప్ చేసినా

రామయ్య కోతులని పంపితే

అవినీతి, బంధు ప్రీతితో

అంటకాగుతున్న రావణుడు

అదిరి పడ్డాడు

అసలు సీతమ్మ కిడ్నాప్ కాలేదు

వాడి సంగతి తేల్చేద్దామని

తనే వెళ్ళారు

రాముడొచ్చి నాలుగు పీకాడు

ఒచ్చే దార్లో సముద్రం మీద బ్రిడ్జి కట్టించి

అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాడు అని కుయ్యడానికి

కూసే గాడిదలూ లేవు

టీవీలూ లేవు,

విదూషక విశ్లేషకులూ లేరు ...

ఆయనకు రాజనీతి తెలుసు

అరాజకీయం రాదు

సో ... పాలిటిక్స్ కూడా తెలియవ్ ...

అయినా ఆయన పనేదో

ఆయన చేశాడు

పొగిడించుకోడానికి

పైసలూ పదవులూ ఇవ్వకపోగా

కాంతని వెంట తీసుకుని

కష్టాలు కట్టగట్టుకుని

కాననానికెళ్ళాడు

హా !!! సీతా అంటూ

హైకింగ్ చేసుకుంటూ

హనీమూన్ కి

కాదు వెళ్ళింది ...

"దశరధుడు శాశించాడూ

ఈ రాముడు పాటిస్తాడు... ఉఫ్..ఉఫ్"

అని రజనీ కాంత్ స్టైల్లో

అని అంతర్దానమవ్వలేదు

నువ్వే ఈ దేశాన్నేలు అని

తమ్ముడికి దండం చేతికిస్తే

నీ పాదరక్షలే పరిపాలకులని

ప్రాధేయపడ్డాడేగానీ

అన్న గారు అడవికెళ్ళిందే అదనుగా

వెన్నుపోటు పొడిచి కుర్చీ కాజెయ్యలేదు

విధేయతంటే తన తమ్ముళ్ళదే

అని చాటి చెప్పుకోగలిగాడు

అదీ రాముడి గొప్పే

అదే రాముడి గొప్ప

లంక భలే ఉందన్నా ఉండిపోదామా

అని లక్ష్మణుడంటే...

"అపి స్వర్ణమయీం లంకాం

నమే లక్ష్మణ రోచతే

జననీ జన్మభూమిశ్చ

స్వర్గాదపి గరీయసీ"

అని వారించాడు

అందుకే రాముడు

దేవుడయ్యాడు

- సాయి శేఖర్

First Published:  5 April 2023 4:54 AM GMT
Next Story