Telugu Global
Arts & Literature

ప్రియమైన అన్నకు ప్రేమతో చెల్లి

ప్రియమైన అన్నకు ప్రేమతో చెల్లి
X

మోహనన్నయ్యా..!

నాకు తెలియదు కానీ అమ్మ చెప్పేది. నేను పుట్టినప్పుడు నన్ను నీకు చూపించి "ఇదిగోరా కన్నా..నీకు చెల్లి పుట్టింది" అమ్మ చూపిస్తే నీ కళ్ళను పెద్దవి చేసి నా వంక ఒకింత ఆశ్చర్యంగా చూస్తూ అమ్మ ఒడిని పంచుకోవడానికి నాతో పాటు చిట్టి చెల్లి వచ్చింది అని సంబరపడుతూ నీ చిన్ని చేతులతో నా చిట్టి చేతిని పట్టుకుని కరచాలనం చేసావంట. "నాకు చిట్టి చెల్లి పుట్టింది " అంటూ సంబరంగా ఇంట్లో, బడిలో అందరికి టముకు వేసి చెప్పావంట.

అన్నయ్యా..నీకు గుర్తు ఉందా..మనం ఊరికి వెళ్ళినప్పుడు మీరంతా మామిడి చెట్టు ఎక్కి పిందెలు కోసి నాకు ఇస్తే వద్దని , చెట్టు ఎక్కడం నాకు నేర్పమని నేను మారం చేస్తే చెట్టు ఎక్కి కాయలు కోసేదానికి ఎన్ని మెళకువలు నాకు నువ్వు నేర్పించావు కదా. ఎంత ఓర్పు చూపించావు నా పట్ల.

అన్నయ్యా..ఓ దీపావళి పండగకి ఇద్దరం చేటలలో టపాసులు ఎండబెట్టుకున్నప్పుడు పొరపాటున నా టపాకాయల మీద నీళ్లు పడి, అవి సరిగా కాలకుంటే నీ టపాకాయలన్ని నాకు ఇచ్చి నేను కాకరొత్తులు వెలిగిస్తుంటే నా కళ్ళల్లో మెరిసిన మెరుపులకు నీ కళ్ళల్లో వెలుగులు పూయడం నాకు ఇంకా గుర్తే..

అన్నయ్యా..బడికి వెళ్ళిన నేను ఇంటికి రావడం కాస్త ఆలస్యం అయినా నేనొచ్చే వరకు గుమ్మంలోనే నిలబడి నాకోసం ఎదురుచూసేవాడివి. అల్లంత దూరాన నేను కనపడగానే నీ కళ్ళల్లో నిశ్చింత నా పట్ల నీ బాధ్యతని గుర్తుచేసేది.

అన్నయ్యా.. సంక్రాతి పండగ నెల సాయంత్రాలు వాకిలి ముందు మన సుబ్బి పేడ నీళ్ళ కళ్ళాపి చల్లి పొతే నేను ముగ్గు వేసి రంగులు నింపడానికి రెండుగంటలు పైనే పట్టేది. చీకట్లో నేనొక్కదాన్నే ముగ్గువేస్తున్నానని నాకు శ్రమ తెలియకుండా ఎన్ని కబుర్లు చెప్పేవాడివి నువ్వు. ఒక్కోరోజు నా ముగ్గు బాగాలేకున్నా, పక్కింటి పావని వేసే ముగ్గుకన్నా నా ముగ్గే బాగుందని ఎంతమందితో వాదించేవాడివి. నేనంటే ఎంత ప్రేమ అన్నా నీకు.

కయ్యల్లో తిరుగుతూ పచ్చి పెసర కాయలు వలిచి తినేవాళ్ళం, వరి పంట కోతలు అయ్యాక పొలమంతా తిరుగుతూ పోటీ పడి పరిగ ఏరుకుని శ్రీరాములు శెట్టి అంగడిలో కొలిపించి బటానీలు, కమ్మరకట్టులు కొనుక్కుని తినేవాళ్ళం. దోటీలతో సీమచింత గుబ్బలు రాల్చుకుని ఎర్రగా తియ్యగా ఉన్నవాటిని నాకు ఇచ్చి, తెల్లటివి, అంత తీపి లేనివాటిని నాకు ఇచ్చేవాడివి.

అన్నయ్యా.. పంపుసెట్టు తొట్టిలో చేసిన స్నానాలు, మాతమ్మ చెరువులో కొట్టిన ఈతలు, గిన్ని కోళ్లకు మనం వేసిన మేతలు, కాకెంగిలి చేసి కొరికి తిన్న నెల్లికాయల పులుపు, తవ్వి తీసి కాల్చి తిన్న తేగల రుచి, తాటి ముంజల మెత్తదనం, బురగుంజు తియ్యదనం, గురువింద గింజల దండ గుచ్చి వినాయకుడికి వేసిన వైనం, గుబురు చెట్లల్లో బ్రహ్మరాక్షసుడి కళ్ళు కనిపించాయని నేను భయపడితే చెట్లమధ్య దాగి ఉన్న గుడ్లగూబని చూపించినప్పుడు ఇద్దరం నవ్వుకున్న తీపి జ్ఞాపకాలు అన్నీ ఇంకా నాలో పచ్చగా, పచ్చిగా.

నాకు పెళ్ళై అప్పగింతలప్పుడు, నేను మా మెట్టినింటికి వెళుతున్నప్పుడు నీ కంటిలో ఊరిన చెమ్మ నా చేతులతో తుడిచాను గుర్తు ఉందా అన్నా. ఆ చెమ్మ ఇప్పుడు కూడా నా చేతిలో తడితడిగా నీ జ్ఞాకాలను తట్టిలేపుతుంది.

మరి ఇప్పుడు ఆ ఊసులన్నీ ఏవి అన్నయ్యా. బాధ్యతల నడుమ మనం బందీలమైనామా. ఏడాదికి ఒక్కసారి అయినా కలవలేకపోతున్నాం. ఇప్పుడు ప్రకృతి కూడా కక్ష కట్టి మన మధ్య దూరాన్ని పెంచుతోంది ఊపిరిసలుపుకోలేని ఆంక్షలు పెట్టి.

అన్నయ్యా..మనం ఎక్కడ ఉన్నా అనుక్షణం నీవు నా క్షేమం కోరుతావని తెలుసు. దూరం నుంచి అయినా నీ చల్లని చూపులు నా మీద ఎప్పుడు ప్రసరించాలి. ఈ దూరాలన్నీ కరిగిపోయి మనం మళ్ళీ చిన్న అన్న, చిట్టి చెల్లి గా మారిపోయి ప్రేమానురాగాలు పంచుకునే శుభదినం కోసం ఎదురు చూస్తూ నీ కోసం..

నీ చిట్టి చెల్లి

రోహిణి

First Published:  30 Aug 2023 6:15 PM GMT
Next Story