Telugu Global
Arts & Literature

మాతృక

మాతృక
X

ఈ నెలతలు

ప్రకృతి సాంగత్యం వీడరు.

చిగురాకుల సోయగాలను చూసినప్పుడల్లా

చిరు పవన కాంక్షలను

వీచుకుంటారు.

రంగు రంగుల

పూల రెక్కల అందాలను

తలపోసుకుంటారు.

తళుకు బెళుకుల హవణికలను అద్దుకుంటారు.

వాలు ముంగురులతో మేలమాడుతుంటారు .

చిలుక కులుకుల

పరికిణీలు ఓణీలు ,

కోకలు రవికెలు,

ఎత్తు మడమల జోళ్ళు ,

బిగుతు పుట్టములు,

విహంగయాన సమయంలో

ఆకృతుల విస్మయాలను

అవధరిస్తుంటారు.

తాము పుట్టిన పల్లె పట్టూ

చెరువుగట్టూ ,మావి చెట్టూ ,

కోకిల పాటల కనికట్టూ ,

పెంకుటింటి వసారాలో

తాతయ్య చదువుతున్న

రుక్మిణీ కల్యాణ ఘట్టంలో

మనోహరుని రూపం

ఎదలో అచ్చు పడినట్లూ

ముదమందిన యువతులు,

తెల్లారిపోయాక

బామ్మ చెప్పినట్లు,

ఆరు రుచుల పచ్చడిలో

నాలుకపై నిలిచిన

చేదుకు నిర్భయులై

పిడికిళ్ళను ఆత్మలో

పొదుగుకుంటారు.

నగర విస్తరణల మాధ్యమంలో ,

రహదారి బాటల కిరుపక్కలా

నాటుకున్న తరుశాఖల

కీచ కిచ గూళ్ళకు

నాగరికుని పర్యావరణాపేక్షను ప్రశంసిస్తూ

కల కల నవ్వుల ఉత్తరం పంచుతుంటారు.

సమీప పుర ఉద్యాన వనాలలో

ఋతు క్రమమును మరువక

పచ్చిక పొత్తిళ్ళ పై

ముసిరిన ఉషోదయ కాంతులకు

నవ వసంతమొకటి శ్వాసలూదుతుంటే ,

యుగాది పంచాంగ శ్రుతులకు

వీనులను అప్పగిస్తుంటారు.

పండుగనాటి

ప్రాముఖ్యతను ప్రకటిస్తూ

సహకార పత్రాల

తోరణాలను కట్టారు.

వాకిట

ముగ్గుల వరుసను కలిపారు.

విసుగుదలను పక్కకు నెట్టి

చురుకుగ గూటిని చక్కదిద్దారు ,

తీపి వగరు చేదు

పులుపు ఉప్పు కారాలను

వంచించక మిత ఆరోగ్య సూత్రాల పచ్చడిని కలిపారు.

బొగ్గుల కుంపట్లు,

మసిపాత్రల రాద్ధాంత మేమీ లేని

పొగచూరని వంటలలో

అభిరుచులను కలగలిపి

సంసారాలకు తరతరాల

మాతృకలను పంచారు.

శోభకృతు ధరిత్రికి

తమ ఆనవాళ్ళను నిలిపారు

చలిగాయాలను మరచిన

సంధి వేళలో ,

హిందోళ రాగాలకు మనసులను

శృతి చేసుకున్నారు

- రాజేశ్వరి దివాకర్ల

(వర్జినియ యుఎస్)

First Published:  24 March 2023 5:01 AM GMT
Next Story